డేటింగ్ యాప్స్ మాయాజాలం.. ‘స్వైప్ రైట్’ లవ్ స్టోరీల్లో హెచ్‌ఐవీ, ఎస్‌టీడీల రిటర్న్ గిఫ్ట్‌లు
‘ఒక్క స్వైప్ రైట్ కొడితే లైఫ్ సెట్ అయిపోతుంది’ అనుకునే ఈ డిజిటల్ యుగంలో మన నవతరం కుర్రకారు డేటింగ్ యాప్స్‌ని ఏకంగా స్వర్గానికి దారితీసే రహదారిలా భావిస్తున్నారు.
By: A.N.Kumar | 31 July 2026 10:00 PM IST‘ఒక్క స్వైప్ రైట్ కొడితే లైఫ్ సెట్ అయిపోతుంది’ అనుకునే ఈ డిజిటల్ యుగంలో మన నవతరం కుర్రకారు డేటింగ్ యాప్స్‌ని ఏకంగా స్వర్గానికి దారితీసే రహదారిలా భావిస్తున్నారు. ఆన్‌లైన్‌లో కాసేపు చాటింగ్, నాలుగైదు "హార్ట్" ఎమోజీలు మార్చుకోవడం.. అటూ ఇటూ రెండు పిజ్జాలు ఆర్డర్ చేసుకోవడం ఆలస్యం... ఇక అటు పక్క ఉన్నది శ్రీరాముడో లేక తీవ్రమైన ఇన్ఫెక్షన్ల నెట్‌వర్కో తెలుసుకోకుండానే శారీరక బంధాల సముద్రంలో ఈత కొట్టేస్తున్నారు. కానీ ఈ వేగవంతమైన ఆకర్షణల వెనుక ఓ పెద్ద 'ఆరోగ్య బాంబు' పేలడానికి సిద్ధంగా ఉందనే చేదు నిజం డాక్టర్ల వద్దకు వెళ్లాకే తెలిసొస్తోంది.
ప్రొఫైల్ పిక్చర్ భలే ఉందే.. కానీ హెల్త్ కార్డు సంగతేంటి.?
తాజాగా ఓ ప్రముఖ మహిళా గైనకాలజిస్ట్ వెల్లడించిన కంటికి కనిపించని నిజాలు వింటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. 19 నుంచి 20 ఏళ్ల లేత వయసున్న యువతీయువకులు ఆసుపత్రుల చుట్టూ పెల్విక్ ఇన్‌ఫెక్షన్లు, జెనైటల్ ఇన్‌ఫెక్షన్లతో క్యూ కడుతున్నారట. "ప్రేమ గుడ్డిది" అని పాతకాలంలో అనేవారు గానీ ఈ డేటింగ్ యాప్స్ తెచ్చిన ప్రేమ మరీ అంత కంధరీకైపోతుందని, కనీస రక్షణ కూడా వాడకుండా ప్రమాదాన్ని కొనితెచ్చుకునేంత అమాయకత్వంగా ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. ఆ క్షణికానందం కాస్తా తీరిపోయాక... హెచ్‌ఐవీ తో పాటు గనేరియా, సిఫిలిస్, క్లమిడియా వంటి భయంకరమైన ఎస్‌టీడీ లూ బహుమతిగా లభిస్తున్నాయి.
ఫిల్టర్లు ఉన్నంత అందంగా భాగస్వామి ఆరోగ్యం ఉండదు
డిజిటల్ ప్రొఫైల్ పిక్‌లలో అద్భుతమైన ఫిల్టర్లు, సరికొత్త హెయిర్ స్టైల్స్ చూసి ఫ్లాట్ అయిపోయే మన కుర్రకారు, ఆ అవతలి వ్యక్తి హెల్త్ స్టేటస్ ఏంటో, అతనికి, ఆమెకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయో తెలుసుకునేందుకు మాత్రం విపరీతమైన సోమరితనం ప్రదర్శిస్తోంది. చాటింగ్‌లో డిజైన్ డిజైన్ మెసేజ్‌లు పంపే తెలివితేటలు... రక్షణ చర్యలు సేఫ్ సె*క్స్ పాటించడంలో మాత్రం పనిచేయడం లేకపోవడం విచారకరం. డేటింగ్ యాప్‌లో మ్యాచ్ అవ్వగానే మైమరిచిపోవద్దు. తాత్కాలిక ఆకర్షణల కోసం జీవితాంతం అనుభవించే నరకాన్ని, భవిష్యత్తును తాకట్టు పెట్టకండి.
సిగ్గు ఎక్కువ.. ముందుచూపు తక్కువ
మరో కామెడీ ఏమిటంటే... ఆన్‌లైన్‌లో డేటింగ్ చేయడానికి, అపరిచితులతో కలవడానికి లేని 'సిగ్గు' ఒంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ లక్షణం కనిపిస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి మాత్రం కొండంత వచ్చి పడుతుంది. సమాజం ఏమనుకుంటుందోనని, ఇంట్లో తెలిస్తే ఏమవుతుందోనని భయపడి, వ్యాధి బాగా ముదిరి నరకం కనిపించే వరకు ఇంట్లోనే రహస్యంగా నటిస్తూ గడిపేస్తున్నారు.
డేటింగ్ యాప్స్ వాడటం నేరమేమీ కాదు.. కానీ దాన్ని ఆసుపత్రుల చుట్టూ తిరిగే షార్ట్‌కట్‌లా మార్చుకోవద్దు.. ప్రొఫైల్‌ను మ్యాచ్ చేసుకునే ముందు కాస్త ‘బుర్ర’ను కూడా వాడితే... ఆ తర్వాత మెడికల్ షాపులు, ఆస్పత్రుల చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయి..
