వైరల్ వీడియో.. ఆఫీస్ కాదు.. అదొక స్వర్గం! స్వీడన్ వర్క్ కల్చర్‌పై నెటిజన్ల ప్రశంసలు..
ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం వల్ల వచ్చే వెన్నునొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలకు ఇక్కడ చెక్ పెట్టారు. ఆఫీసులో ఉండే టేబుళ్లను మనకు కావాల్సిన ఎత్తుకు సర్దుబాటు చేసుకోవచ్చు.
By: Tupaki Political Desk | 11 May 2026 4:00 PM ISTకార్పొరేట్ కొలువు అంటే సాధారణంగా ఏం ఊహిస్తాం.. కుర్చీలకు అతుక్కొని గంటల కొద్దీ కంప్యూటర్ స్క్రీన్లను చూస్తూ.. ఇటు ఆరోగ్యం తనఖా పెట్టి చాలా చాలని జీతాల కోసం చేసే వెట్టి చాకిరి.. ఇది భారతదేశంలోని పరిస్థితి మరి ఇతర దేశాల్లో అంటే అగ్రరాజ్యం అగ్రరాజ్యం అని చెప్పుకుంటున్న అమెరికాలో ఎలా ఉంటుంది.. కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు.. కానీ స్వీడన్ లో మాత్రం అలా కాదట.. ఇంట్లో ఉండడం కంటే ఆఫీసులో ఉంటేనే బెటర్ అని అక్కడి ఉద్యోగులు ఎక్కువగా అనుకుంటారట. అంత కంఫర్టబుల్స్ ను ఇస్తాయట అక్కడి ఆఫీసులు. కార్పొరేట్ ఉద్యోగం అంటే కేవలం పని ఒత్తిడి, డెడ్‌లైన్లు మాత్రమే కాకుండా.. ఒక మనిషికి అవసరమైన విశ్రాంతిని, మానసిక ప్రశాంతతను కూడా అందించాలని స్వీడన్ వర్క్ కల్చర్ నిరూపిస్తోంది. సంకేత్ బానిక్ షేర్ చేసిన ఈ వీడియో చూస్తుంటే, ఆఫీసును కేవలం ఒక పని చేసే ప్రదేశంగా కాకుండా, ఒక 'సెకండ్ హోమ్' లాగా మార్చడం వల్ల ఉద్యోగుల ఉత్పాదకత ఎంతగా పెరుగుతుందో అర్థమవుతోంది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పని ఒత్తిడి వల్ల చాలా మంది మానసిక సమస్యలకు లోనవుతున్నారు. ఈ తరుణంలో స్వీడన్ దేశం అనుసరిస్తున్న ఈ వినూత్న పద్ధతులు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
విశ్రాంతికి పెద్దపీట – న్యాప్ రూమ్స్!
పని మధ్యలో కొద్దిసేపు నిద్రపోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. అందుకే స్వీడన్ లోని ఆఫీసుల్లో న్యాప్ రూమ్స్ (Nap Rooms) ఏర్పాటు చేశారు. ఆఫీసులోనే ప్రత్యేకంగా నిద్రపోవడానికి గదులను ఏర్పాటు చేశారు. అలసటగా అనిపిస్తే ఉద్యోగులు అక్కడ కొద్దిసేపు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు. కాఫీ, ఫ్రీగా దొరికే రక రకాల పండ్లు ఉద్యోగులకు రోజంతా శక్తిని ఇస్తాయి.
ఆరోగ్యమే మహాభాగ్యం – ఫ్లెక్సిబుల్ టేబుల్స్
ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం వల్ల వచ్చే వెన్నునొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలకు ఇక్కడ చెక్ పెట్టారు. ఆఫీసులో ఉండే టేబుళ్లను మనకు కావాల్సిన ఎత్తుకు సర్దుబాటు చేసుకోవచ్చు. కూర్చోవడం ఇబ్బందిగా అనిపిస్తే, టేబుల్‌ను పైకి లాగి నిల్చొని కూడా వర్క్ చేసుకోవచ్చు. పని ఒత్తిడి నుంచి మనసును మళ్లించడానికి వీడియో గేమ్స్, ఇతర ఇండోర్ గేమ్స్ ఆడుకునే సౌకర్యం కూడా ఉంది.
'ఫికా' సంప్రదాయం
స్వీడన్ వర్క్ కల్చర్‌లో 'ఫికా' అనే పదం చాలా పవిత్రమైనది. ఆఫీసులో పని ఒత్తిడిని పక్కన పెట్టి, సహోద్యోగులతో కలిసి కాఫీ తాగుతూ ముచ్చటించే సమయాన్ని వారు ఎంతో గౌరవిస్తారు. ఇది టీమ్ వర్క్‌ను మెరుగుపరుస్తుంది. స్వీడన్ వంటి దేశాలు పని కంటే మనిషి ఆరోగ్యానికి, సంతోషానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇలాంటి సౌకర్యాలు కల్పించడం వల్ల ఉద్యోగులు కూడా సంస్థపై ఎంతో అంకితభావంతో పనిచేస్తారని సంకేత్ బానిక్ వీడియో స్పష్టం చేస్తోంది. అందుకే ‘మా ఆఫీసుల్లో కూడా ఇలాంటి మార్పులు ఎప్పుడు వస్తాయి?’ అని మన దేశ ఐటీ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
