మోడీ స్వదేశీ మంత్రం...గ్లోబలైజేషన్ నుంచి భారత్ దూరం ?
ఈ రోజున ప్రపంచం అంతా ఒక కుగ్రామంగా మారిపోయింది. ఒక ఇంట్లో సామానుల జాబితా చూస్తే చాలు ప్రపంచం ఎక్కడో లేదు అక్కడే ఉంది అనిపిస్తుంది.
By: Satya P | 23 Sept 2025 9:19 AM ISTఈ ప్రపంచం అంతా ఉన్నది భూగోళం మీదనే. ఇక్కడ ఎవరికి ఎవరూ ఏమీ కారు అని అనుకోవచ్చు. కానీ ప్రతీ ఒక్కరికీ ఇంటర్ లింక్ ఉంది. అలాగే ఒక దేశంతో మరో దేశానికి ప్రాణావసరాలే ఉన్నాయి. విశ్వం అంతా ఒక్కటి అని భారత్ విశ్వ గురువు అని చెప్పుకునే బీజేపీ పెద్దలకు ఇవ్వన్నీ తెలియనివి కావు. కానీ వేగంగా మారిన అంతర్జాతీయ పరిణామాల నేపధ్యంలో తక్షణ పరిష్కారం అనుకున్నారో లేక సెంటిమెంట్ తో సాధించాలనుకున్నారో తెలియదు కానీ ఇపుడు స్వదేశీ మంత్రాన్ని పఠిస్తున్నారు. మన దేశం మన ఉత్పత్తులు మన వాడకం, మన వనరులు మన సంపద అంతా బాగానే ఉంది కానీ ఎక్కడో ఏదో తెలియని ఇబ్బంది పొంచి ఉందని కూడా అనిపిస్తోంది.
గొలుసు కట్టు నుంచి విడివడి :
ఈ రోజున ప్రపంచం అంతా ఒక కుగ్రామంగా మారిపోయింది. ఒక ఇంట్లో సామానుల జాబితా చూస్తే చాలు ప్రపంచం ఎక్కడో లేదు అక్కడే ఉంది అనిపిస్తుంది. తెల్లారి లేస్తే వాడే టూత్ పేస్టు నుంచి పోపుల డబ్బాలో ఇంగువ దాకా చూస్తే ఎక్కడో ఏదో దేశం నుంచి దిగుమతి చేసుకున్న సరుకులే దేశంలో కొని ఇంట్లో పెట్టుకున్నవి. అవన్నీ నిత్యావసరాలు అయిపోయాయి. ఒక విధంగా గ్లోబలైజేషన్ గొలుసుకట్టుతో ప్రపంచ దేశాలు ముడి వేసుకుని ఉన్నాయి. దాని నుంచి విడిపోవడం అంటే ఒంటరిగా ఉంటూ కష్టాలను కోరి తెచ్చుకోవడమే అవుతుంది అని అంటున్నారు.
మూడున్నర దశాబ్దాల క్రితం :
ప్రపంచీకరణ మంత్రం అన్నది 1990 నాటిది. ఆనాటి నుంచి దేశాలు అన్నీ ఒక్కటి అయ్యాయి. ఒక దేశం సరకుని మరో దేశం తలుపులు బార్లా తెరచి ఆహ్వానించింది. అలాగే తమ దేశంలోకి విదేశీ వస్తువులకు చోటు ఇచ్చింది. అలా ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడ ఎగుమతి చేసుకుంటూ తమకు అవసరమైనది దిగుమతి చేసుకుంటూ అన్ని దేశాలు ఒక్కటిగా ఉంటూ వస్తున్నాయ్హి. ఒక ప్రపంచీకరణ మంత్రం దేశల మధ్య ఎడం తగ్గించి. అనుబంధం పెంచింది. అంతే కాదు వ్యాపార వాణిజ్యాలు కూడా బాగా పెరిగి ఆర్ధికంగా అంతా బాగున్న నేపథ్యం ఉంది. భారత్ లో అయితే ఆర్ధిక మేధావిగా పేరు గడించిన పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నపుడు గ్లోబలైజేషన్ కి భారత్ ద్వారాలు తెరచి ఉంచారు. దాంతోనే దేశం ఆర్ధికంగా పరుగులు పెట్టింది. అంతే కాదు ఈ ఆర్ధిక సంస్కరణల వల్ల భారత్ లో ఎన్నో దేశాల వస్తువులు వచ్చిపడ్డాయి. అలా ఏ వస్తువు స్వదేశీ ఏ వస్తువు విదేశీ అన్న తేడా లేకుండా అంతా వినియోగిస్తున్న పరిస్థితి ఉందిపుడు.
బంధం పెరిగింది :
తినే తిండి కట్టే బట్ట ఇలా ఎన్నో విలాస వస్తువులు వినోద వస్తువులు అన్నీ కూడా ఎక్కడో దేశాల తయారీవే. వాటిని చాలా మంది మన ఉత్పత్తులే అనుకునే ప్రమాదం ఉంది. అంతలా కలసిపోయాయి అన్న మాట. మనం వాడే టూత్ పేస్టులలో సైతం అనేకం అమెరికా సహా ఎన్నో దేశాల నుంచి వచ్చినవే. అంతే కాదు ఇంట్లో బంగాళా దుంపలు ఇవన్నీ పాక్ నుంచి ఇతర అరబ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూంటాం. అంతే కాదు దక్షిణాఫ్రికా నుంచి ఉల్లి గడ్డలు ఎక్కువగా భారత్ లోకి దిగుమతిగా వస్తాయి. మనకు ఘుమఘుమలాడే వంటింటి పదార్థం ఇంగువ మన దేశం ఉత్పత్తి కాదని కూడా ఎవరికీ తెలియదని అంటారు. అది పూర్తిగా విదేశీ అని చెబుతున్నారు.
అటు అమెరికా ఇటు చైనా :
ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం అమెరికా విషయంలో పరిష్కారాలు చూస్తోంది. అధిక సుంకాలు విధించి భారత్ ని ఇబ్బంది పెడుతోంది అని భావించి స్వదేశీ మంత్రాన్ని అందుకుంది అని అంటున్నారు. అలాగే వీసాల విషయంలో అధిక ఫీజులను పెట్టి కొల్లగొడుతున్న తీరు మీద కేంద్ర పెద్దలు ఫైర్ అవుతున్నారు. అందుకే ఇతర దేశాలలో పని చేస్తే వృత్తి నిపుణులను కూడా భారత్ కి రమ్మని కోరుతున్నారు. చైనా విషయం తీసుకుంటే భారత్ ని తన పెద్ద మార్కెట్ గా చేసుకుంది. దానికి సైతం ముకుతాడు వేయాలని భావించి స్వదేశీ నినాదం వినిపిస్తున్నారు అని అంటున్నారు.
భవిష్యత్తులో ప్రభావమా :
అయితే ఈ నినాదాలు అన్నీ బాగానే ఉంటాయి. కానీ నా కోడి నా ఇల్లు అన్నట్లుగా ఒంటెద్దు పోకడలు పోయే కాలం దాటి ముందుకు వచ్చేశామని అంతా గ్రహించడం లేదు. ఈ రోజున మన వస్తువులు స్వదేశీ అని ఇతర దేశాల వస్తువులను దేశంలో వద్దని అనుకుంటే వారు మాత్రం తమ దేశంలో మన వస్తువుల అమ్మకాలను ఎలా స్వాగతిస్తారు అన్న ప్రశ్న వస్తోంది. అంతే కాదు మన ఉత్పత్తులు అన్నీ మన కోసమే కాదు కదా మిగులు అంతా ఇతర దేశాలకు ఎగుమతి చేయాల్సిందే. అపుడే మన ఆర్ధిక వ్యవస్థ బాగుంటుంది. డిమాండ్ అండ్ సప్లై చైన్ కూడా సక్రమంగా ఉంటుంది. కానీ ఇతర దేశాలతో బంధాలు తెంపుకుంటే మనకు అవసరం అయినపుడు వారు రానిస్తారా అన్నది కూడా పెద్ద ప్రశ్న. అపుడు అది కాస్తా అంతర్జాతీయ వివాదాలకే దారి తీసే ప్రమాదం ఉంది. మన ఆర్ధిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి ఉంది అని అంటున్నారు ఇది ఆర్థిక నిపుణులు అంటున్న మాట. అందువల్ల స్వదేశీ మంచి నినాదమే. అతి చేస్తే ముంచే నినాదం కూడా. మరి అది తెలుసుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది అని అంటున్నారు.
