మమత రైవల్.. సువేందుకు పట్టం.. ముఖ్యమంత్రిగా ప్రకటించిన బీజేపీ!
ఏ పార్టీ అధినేత ముందు.. వంగి వంగి దండాలు పెట్టారో.. ఏ పార్టీ అధినేత కనుచూపు కోసం తపించిపోయారో.. ఆ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీని రెండు సార్లు చిత్తు చిత్తుగా ఓడించిన సువేందు అధికారికి బీజేపీ ముఖ్యమంత్రి పీఠం ఇచ్చింది.
By: Garuda Media | 8 May 2026 10:31 PM ISTఏ పార్టీ అధినేత ముందు.. వంగి వంగి దండాలు పెట్టారో.. ఏ పార్టీ అధినేత కనుచూపు కోసం తపించిపోయారో.. ఆ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీని రెండు సార్లు చిత్తు చిత్తుగా ఓడించిన సువేందు అధికారికి బీజేపీ ముఖ్యమంత్రి పీఠం ఇచ్చింది. ఎంతో మంది హేమా హేమీలు పోటి పడినప్పటికీ.. మమతతో సువేందుకు ఉన్న రాజకీయ వైరం.. తమకు మరింత కలిసివస్తుందని భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుందని భావించిన కమల నాథులు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా సువేందుకు అవకాశం కల్పించారు.
ఎవరీ సువేందు?
కాంగ్రెస్ పార్టీలో మమతతో కలిసి రాజకీయాలు చేసిన సువేందు.. తర్వాత కాలంలో ఆమె వెంటే నడిచారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు.. ఆమెకు దన్నుగా ఉన్నారు. ఆమె మంత్రివర్గంలో స్థానం కూడా దక్కించుకున్నారు. తండ్రి సిసిర్ రాజకీయ వారసత్వంగా పాలిటిక్స్‌లోకి వచ్చినా.. మమత తన్నుతో సువేందు.. పది మెట్లు ఎదిగారు. అయితే.. తర్వాత.. కాలంలో మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఎంట్రీతో సువేందు అధికారి ప్రాధాన్యం తగ్గిపోయింది. దీంతో ఆయన మమతపై తిరుగు బాటు బావుటా ఎగురవేశారు. దీనిని అవకాశంగా భావించిన బీజేపీ 2020లో పార్టీ తీర్థం ఇచ్చింది. రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిని చేసింది.
అప్పటికే వ్యక్తిగతంగా ఎదిగిన సువేందు.. 2021, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా మమతను ఓడించే స్థాయికి చేరుకున్నారు. తాజా ఎన్నికల్లో రెండు చోట్ల(నందిగ్రామ్, భవానీపూర్)పోటీ చేసి తిరుగులేని విజయం అందుకున్నారు. దీంతో మమత గత, ప్రస్తుత ఎన్నికల్లో ఒకప్పటి తన రైట్ హ్యాండ్ చేతిలోనే ఓడిపోవాల్సి వచ్చింది. ఇక, తాజాగా జరిగిన ఎన్నికల్లో 208 స్థానాల్లో బీజేపీ విజయం దక్కించుకున్న దరిమిలా సువేందుకు.. ముఖ్యమంత్రి పీఠం అప్పగిస్తూ.. తాజాగా బీజేపీ అగ్రనేతలు నిర్ణయించారు. శనివారం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు కూడా వడివడిగా సాగుతున్నాయి.
ఈ ఎంపిక వెనుక..?
వాస్తవానికి బీజేపీని ముందుండి నడిపించిన వారు చాలా మంది ఉన్నారు. వారంతా కూడా ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెట్టు కున్నారు. ఒకప్పుడు ఇదే సువేందు అధికారితో పోరాడిన బీజేపీ నాయకులు ఉన్నారు. ఆయనతో కేసులు పెట్టించుకున్న వారు కూడా ఉన్నారు. అయినా.. మమతను మరోసారి అధికారంలోకి రాకుండా చేయాలంటే.. సువేందు వంటి బలమైన నాయకుడిని సీఎంను చేయడమే ఫలితం ఇస్తుందని భావించిన బీజేపీ పెద్దలు.. ఆదిశగా అడుగులు వేశారు.
అస్సాం ఫార్ములా రిపీట్!
గతంలో అస్సాంలోనూ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన హిమంత బిశ్వశర్మను బీజేపీ అక్కున చేర్చుకుని.. ఇతర నాయకులను కూడా పక్కన పెట్టి ముఖ్యమంత్రి పీఠం అప్పగించింది. ఫలితంగా గత రెండు సార్లుగా బీజేపీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. తాజాగా జరిగిన ఎన్నికలలోనూ హిమంత తన సత్తాచాటుకున్నారు. ఫలితంగా ఈశాన్య రాష్ట్రంలో వరసుగా మూడోసారి బీజేపీ రావడం గమనార్హం. ఇప్పుడు ఇదే ఫార్ములాను పశ్చిమబెంగాల్‌లోనూ బీజేపీ పాటించింది.
