Begin typing your search above and press return to search.

ఎల్ఓసీ వద్ద పాక్ పిల్ల పనులు.. పక్కకెళ్లి ఆడుకోమన్న భారత్!

తాను బాగుపడకపోయినా పర్లేదు కానీ.. భారత్ మాత్రం నాశనమైపోవాలనే సిద్ధాతంతో బ్రతుకుతుంటుంది పాకిస్థాన్ అనేది తెలిసిన విషయమే.

By:  Raja Ch   |   12 Jan 2026 12:36 PM IST
ఎల్ఓసీ వద్ద పాక్  పిల్ల పనులు.. పక్కకెళ్లి ఆడుకోమన్న భారత్!
X

తాను బాగుపడకపోయినా పర్లేదు కానీ.. భారత్ మాత్రం నాశనమైపోవాలనే సిద్ధాతంతో బ్రతుకుతుంటుంది పాకిస్థాన్ అనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే ఆ దేశం ఓ పక్క ఆర్థికంగా చితికిపోయి, నాశనమైపోతున్నా.. భారత్ ని గిల్లుతూ, తర్వాత చెప్పు దెబ్బలు తింటూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్.ఓ.సీ) వద్ద అనుమానంగా సంచరిస్తున్న డ్రోన్ లను అధికారులు గుర్తించగా.. అది పాక్ నుంచి వచ్చినట్లు చెబుతున్నారు!

అవును... భారత్ - పాకిస్థాన్ సరిహద్దులోని నౌషెరా సెక్టార్ పరిధిలోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద అనుమానంగా సంచరిస్తున్న డ్రోన్ ను అధికారులు కూల్చివేశారు. ఈ క్రమంలో పాకిస్థాన్ నుంచి ఈ డ్రోన్ వచ్చినట్లుగా భారత సైన్యం ప్రాథమికంగా నిర్ధారించింది. ఇదే సమయంలో.. మరికొన్ని డ్రోన్ లు సైతం గుర్తించినట్లు పేర్కొంది. సైన్యం తెలిపిన వివరాల ప్రకారం.. సాంబా, రాజౌరీ, పూంచ్ జిల్లాలో ఈ డ్రోన్ లు ప్రత్యక్షం అయ్యాయి. దీంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు.

ఈ సందర్భంగా స్పందించిన అధికారులు.. రాజౌరిలోని నియంత్రణ రేఖ వెంబడి నౌషెరా సెక్టార్‌ ను కాపలా కాస్తున్న ఆర్మీ దళాలు సాయంత్రం 6:35 గంటల ప్రాంతంలో డ్రోన్ కదలికను గమనించినట్లు తెలిపారు. దీంతో వెంటనే వాటిపై కాల్పులు జరిపాయని అధికారులు తెలిపారు. దాదాపు అదే సమయంలో రాజౌరి జిల్లాలోని టెర్యాత్‌ మరొకటి.. కలకోట్‌ లోని ధర్మసల్ గ్రామం వైపు మరొకటి కనిపించిందని, అయితే వాటిని సైన్యం కూల్చేసిందని తెలిపారు.

ఇదే క్రమంలో.. సాయంత్రం 7:15 గంటల ప్రాంతంలో సాంబాలోని రామ్‌ గఢ్ సెక్టార్‌ లోని చక్ బాబ్రాల్ గ్రామంపై డ్రోన్ లాంటి వస్తువు మెరిసే కాంతితో చాలా నిమిషాలు తిరుగుతూ కనిపించిందని.. పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న తంయిన్ దిశ నుండి మంకోట్ సెక్టార్‌ లోని టోపా వైపు మరో డ్రోన్ లాంటి వస్తువు కదులుతున్నట్లు కనిపించిందని తెలిపారు. ఇవన్నీ పాకిస్థాన్ వైపు నుంచే వచ్చినట్లు ప్రాథమికంగా నిర్థారణ అయ్యిందని వెల్లడించారు.

అంతకంటే ముందు.. సాంబా జిల్లాలోని ఐబి సమీపంలోని ఘగ్వాల్‌ లోని పలూరా గ్రామంలో పాకిస్తాన్‌ నుంచి వచ్చిన ఓ డ్రోన్ ద్వారా జారవిడిచిన ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయని.. స్వాధీనం చేసుకున్న వాటిలో రెండు పిస్టల్స్, మూడు మ్యాగజైన్‌ లు, 16 రౌండ్లు, ఒక గ్రెనేడ్ ఉన్నాయని వెల్లడించారు.