డబ్బు వివాదం ముందు పేగు బంధం చిన్నదైంది.. ఇంతలా కొట్టుకోవటమా?
సోషల్ మీడియాలో ఒక భయానక వీడియో షాకింగ్ గా మారింది. వెనుకా ముందు చూసుకోకుండా కొట్టేసుకోవటం.. ఈ క్రమంలో ఎవరి ప్రాణాలు పోతాయన్నది అర్థం కానట్లుగా మారింది.
By: Garuda Media | 24 Nov 2025 9:52 AM ISTసోషల్ మీడియాలో ఒక భయానక వీడియో షాకింగ్ గా మారింది. వెనుకా ముందు చూసుకోకుండా కొట్టేసుకోవటం.. ఈ క్రమంలో ఎవరి ప్రాణాలు పోతాయన్నది అర్థం కానట్లుగా మారింది. ఆందోళనకు గురి చేసే ఈ వీడియోకు సంబంధించిన వివరాలు.. అంతలా దాడులు చేసుకుంటున్న వారి మధ్యనున్న పేగు బంధం గురించి తెలిస్తే పాడు డబ్బు కోసం ఇలా మారిపోవటమా? అన్నది ప్రశ్నగా మారింది. ఎంత డబ్బు పంచాయితీ అయితే మాత్రం కట్టలు తెంచుకున్న ఆవేశంతో ఇంతలా దిగజారిపోవాలా? అన్నదిప్పుడు చర్చగా మారింది.
సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఈ ఉదంతం షాక్ కు గురి చేసింది. తల్లి కొడుకు ఒకవైపు.. కూతురు ఆమె పిల్లలు మరోవైపు కలిసి కొట్టేసుకున్నారు. కళావతి తన కుమార్తె జ్యోతికి కొంత డబ్బును అప్పుగా ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం తల్లి వద్ద తీసుకున్న డబ్బుల గురించి కూతురితో గొడవైంది. తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వని కూతురు గురించి తల్లి తన కొడుక్కి చెప్పింది. దీంతో వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
ఇచ్చిన డబ్బులు అడిగితే ఇవ్వని కూతురు గురించి తల్లి చెప్పిన మాటలతో కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఆమె కొడుకు ఉపేందర్ రెడ్డి.. తన సోదరి జ్యోతి పొలంలో వరి కోత పనులు చేసుకుంటున్న వేళ.. తల్లీ కొడుకులు ఇద్దరు ట్రాక్టర్ మీద వచ్చి వరికోత మెషిన్ ను అడ్డుగా పెట్టారు. వరికోత యంత్రం నడుపుతున్న డ్రైవర్ ను కిందకు లాగేసిన ఉపేందర్ రెడ్డి.. అక్కడితో ఆగకుండా ట్రాక్టర్ టైరుతో తొక్కించే ప్రయత్నం చేయటం.. దీంతో హడలిపోయిన డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో అతడికి త్రుటిలో ప్రాణాపాయం తప్పినట్లైంది.
అక్కడితో ఆగని ఉపేందర్ రెడ్డి.. తన సోదరి జ్యోతితో పాటు.. ఆమె ఇద్దరు మేనకోడళ్లపై దాడికి పాల్పడ్డాడు. ట్రాక్టర్ తో ఢీ కొట్టగా వారు స్వల్పంగా గాయపడ్డారు. ఈ క్రమంలో తల్లీకొడుకు కూతురు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని చూసిన స్థానికులు చేష్టలుడిగిపోయారు. కాసేపటికి తేరుకొని ఇరువురికి మధ్య అడ్డుగా నిలిచి గొడవను తగ్గించే ప్రయత్నం చేశారు. ఈ ఉదంతానికి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
