Begin typing your search above and press return to search.

తండ్రి కాబోతున్న చాంపియ‌న్ సూర్య‌కుమార్ యాద‌వ్

దేవిశా డాన్స్ కి సూర్య ఆకర్షితుడైతే.. క్రికెట్ క్రీడాకారుడైన‌ సూర్య బ్యాటింగ్ నైపుణ్యానికి దేవిశా ఫిదా అయ్యారు.

By:  Sivaji Kontham   |   15 March 2026 9:53 AM IST
తండ్రి కాబోతున్న చాంపియ‌న్ సూర్య‌కుమార్ యాద‌వ్
X

టీమిండియా స్టార్ క్రికెటర్, టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ తన వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకోబోతున్నారు. మైదానంలో ప్ర‌శాంతంగా క‌నిపించే సూర్య‌ త్వరలోనే తండ్రి కాబోతున్నారనే వార్త ఇప్పుడు క్రీడా వర్గాల్లోనూ.. సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. సూర్యకుమార్- దేవిశా శెట్టి దంప‌తులు తమ జీవితంలోకి కొత్త అతిథిని ఆహ్వానించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఇటీవల దేవిశా శెట్టి ఒక ఇంటర్వ్యూలో పిల్లల గురించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా.. ఇదే సరైన సమయం అని వ్యాఖ్యానించారు. ఇంత‌లోనే ఈ శ‌నివారం నాడు సీమంతం జ‌ర‌గ‌డంతో సూర్య‌కుమార్ తండ్రి కాబోతున్నాడ‌ని స్ప‌ష్ఠ‌త వ‌చ్చింది. త‌ల్లిదండ్రులు కాబోతున్న‌ సూర్య- దేవిశా దంపతులకు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సూర్యకుమార్ యాదవ్- దేవిశా శెట్టిలది అందమైన ప్రేమకథ. వీరిద్దరూ 2010లో ముంబైలోని పోడార్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు. దేవిశా డాన్స్ కి సూర్య ఆకర్షితుడైతే.. క్రికెట్ క్రీడాకారుడైన‌ సూర్య బ్యాటింగ్ నైపుణ్యానికి దేవిశా ఫిదా అయ్యారు. సుమారు ఆరేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట 2016 జూలైలో వివాహ బంధంతో ఒకటయ్యారు. వివాహం తర్వాత సూర్య కెరీర్ గ్రాఫ్ అద్భుతంగా ఎదిగింది.

సూర్యకుమార్ యాదవ్ తన విజయాల్లో భార్య దేవిశా పాత్రను ఎప్పుడూ కొనియాడుతుంటారు. తను మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ఫామ్ కోల్పోయినప్పుడు దేవిశా తనకు కొండంత అండగా నిలిచిందని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. క్రికెట్ మైదానంలో సూర్య ఆడే ప్రతి మ్యాచ్‌కు దేవిశా హాజరై.. స్టాండ్స్ నుండి తన భర్తను ఉత్సాహపరుస్తూ కనిపిస్తుంటారు. వీరిద్దరి జంటను క్రికెట్ అభిమానులు ఎంతో ఇష్టపడతారు.

ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ భారత టీ-20 జట్టుకు సారథ్యం వహిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవ‌లే ఐసీసీ టి-20 వ‌ర‌ల్డ్ క‌ప్ -2026 చాంపియ‌న్ గా భార‌త్ ని నిల‌బెట్టిన ఘ‌న‌త సూర్య‌కుమార్ కి చెందుతుంది. ఇప్పుడు తండ్రిగా కొత్త బాధ్యతలు చేపట్టబోతుండటం ఆయన కుటుంబంలో కొత్త వెలుగులు నింపింది. ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించక‌పోయినా.. వైరల్ అవుతున్న వార్తలు మాత్రం అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి.

మొత్తానికి ఒకవైపు క్రికెట్ కెరీర్‌లో శిఖరాగ్రాన ఉన్న సూర్యకుమార్.. మరోవైపు వ్యక్తిగత జీవితంలో తండ్రిగా ప్రమోషన్ పొందబోతుండటం ఆయనకు ఈ ఏడాదిని మరింత ప్రత్యేకం చేయనుంది. ఈ వార్త తెలియ‌గానే `జూనియర్ సూర్య` కోసం ఎదురుచూస్తున్నామంటూ ఫ్యాన్స్ మెసేజ్‌లు చేస్తున్నారు. ఈ క్రేజీ అప్‌డేట్‌తో సూర్య-దేవిశా జంట మరోసారి వార్తల్లో నిలిచింది.