Begin typing your search above and press return to search.

షాకింగ్... తవ్వేకొద్దీ బయటపడుతున్న డా. నమ్రత అద్దెగర్భాల వ్యవహారాలు

సంతానం లేకపోవడంతో రాజస్థాన్ నుంచి వచ్చి సికింద్రాబాద్ లో ఉంటున్న ఓ జంట డాక్టర్‌ నమ్రతను ఆశ్రయించారు.

By:  Raja Ch   |   31 July 2025 2:08 PM IST
Surrogacy Scam: Telangana Doctor Accused of Duping Childless Couples
X

సంతానం లేకపోవడంతో రాజస్థాన్ నుంచి వచ్చి సికింద్రాబాద్ లో ఉంటున్న ఓ జంట డాక్టర్‌ నమ్రతను ఆశ్రయించారు. ఆమె వైద్య పరీక్షలు నిర్వహించి సరోగసీతో బిడ్డను కనొచ్చని విడతల వారీగా రూ.30 లక్షలు వసూలు చేశారు. సరోగసి మహిళ ఖర్చులు అదనంగా తీసుకున్నారు. విశాఖపట్నంలోని ఆసుపత్రిలో ఆ మహిళ గర్భంలో బిడ్డ ఊపిరి పోసుకుంటుందని నమ్మించారు.

సరిగ్గా తొమ్మిది నెలలు పూర్తైన తర్వాత పుట్టిన బిడ్డను తీసుకొచ్చి చేతుల్లో పెట్టారు. ఆ బిడ్డకు క్యాన్సర్ రావడం, తర్వాత డీ.ఎన్.ఏ. పరీక్ష చేయించడంతో.. ఆ దంపతులతో మ్యాచ్ కాలేదు. వారి ఫిర్యాదుతో మొదలైన సికింద్రాబాద్‌ యూనివర్సల్‌ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ డా. నమ్రత వ్యవహారాలు అటు అహ్మదాబాద్ నుంచి ఇటు విశాఖ వరకూ ఉన్నాయి. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

అవును... డాక్టర్ నమ్రత వ్యవహారాలపై బాధితులు క్యూ కడుతున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో తాజాగా సరోగసీతో బిడ్డను కనొచ్చని ఓ జంట నుంచి విడతల వారీగా రూ.25 లక్షలు వసూలు చేసిన డా. నమ్రత... తొమ్మిది నెలల తర్వాత ఆశగా వెళ్లిన దంపతులకు... మగబిడ్డ శ్వాస సమస్యతో మరణించాడని చెప్పి, బోల్తా కొట్టించారు! ఇదే తరహాలో మరి కొందరు ఆమె ఆగడాలు వెల్లడిస్తున్నారు.

ఈ విధంగా... దంపతుల నుంచి అండాలు, వీర్యకణాలు సేకరించి.. అద్దెగర్భంతో బిడ్డను ఇస్తామని నమ్మించి.. వారి నుంచి లక్షల రూపాయల సొమ్ము వసూలు చేసి, సరిగ్గా తొమ్మిది నెలలు పూర్తిన తర్వాత నవజాత శిశువులను కొనుగోలు చేసి వీరి చేతికిచ్చేయడం చేసేవారు. ఈ నేపథ్యంలో... సరోగసీ ముసుగులో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ లో పెద్దఎత్తున మోసాలకు పాల్పడినట్లు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసాలతో సంబంధం ఉన్న ఆసుపత్రులు, వైద్యులు, శిశు విక్రయ ముఠాల లింకులను ఛేదించేందుకు పోలీసులు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో... వైద్య ఆరోగ్య, శిశు సంక్షేమ శాఖలతో సమన్వయం చేసుకుని లోతైన దర్యాప్తు చేపట్టారని సమాచారం! తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది!

ఈ క్రమంలో... సికింద్రాబాద్ లో మొదలైన ఈ దందా విశాఖలో ముగిసేలా ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... సికింద్రాబాద్‌ సెంటర్ లో సంతానం లేని దంపతులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి.. అనంతరం వారిని ప్రత్యేక వైద్య పరీక్షల కోసమని చెప్పి విమానాల్లో విశాఖకు తీసుకెళ్లేవారట. అక్కడ పరీక్షలు నిర్వహించేవారట.

ఇదే సమయంలో... సరోగసీకి అంగీకరించిన మహిళను వీరికి పరిచయం చేసేవారు. ఇదే సమయంలో... పుట్టబోయే బిడ్డ కోసమని వీర్యకణాలు, అండాలు సేకరించేవారట. ఈ క్రమంలో.. నెలరోజుల అనంతరం సరోగసీ విధానం విజయవంతమైందని, మరో 9 నెలల్లో బిడ్డను అందిస్తామని చెప్పి... డెలివరీ సమయాన్ని ముందుగానే చెప్పి రూ.లక్షల్లో వసూలు చేసేవారని చెబుతున్నారు.