Begin typing your search above and press return to search.

13 కోట్ల ఓట్ల చోరీ వాదనకు ప్రముఖ ఆర్థిక వేత్త అదిరే కౌంటర్

అదే పనిగా ఒకే అంశాన్ని ప్రస్తావించటం ద్వారా కొన్నిసార్లు సదరు అంశం నిజమా? అబద్ధమా? అన్న విషయాల్ని వదిలేసి..దాని చుట్టూ తిరిగే ధోరణి కనిపిస్తూ ఉంటుంది.

By:  Garuda Media   |   19 Oct 2026 4:02 PM IST
13 కోట్ల ఓట్ల చోరీ వాదనకు ప్రముఖ ఆర్థిక వేత్త అదిరే కౌంటర్
X

అదే పనిగా ఒకే అంశాన్ని ప్రస్తావించటం ద్వారా కొన్నిసార్లు సదరు అంశం నిజమా? అబద్ధమా? అన్న విషయాల్ని వదిలేసి..దాని చుట్టూ తిరిగే ధోరణి కనిపిస్తూ ఉంటుంది. అందునా రాజకీయం ఎంట్రీ ఇస్తే పరిస్థితి మరింత గందరగోళంగా మారుతుంది. పలు సందర్భాల్లో రాజకీయ పార్టీలు ప్రజల్ని ఇట్టే ఆకర్షించేలా కొన్ని నినాదాలు చేస్తుంటాయి. వాటిని పెద్ద ఎత్తున ప్రచారం చేయటం ద్వారా తాము చెప్పేదే నిజమన్నట్లుగా వ్యవహరిస్తుంటాయి. తాజాగా విపక్షాలు చేస్తున్న ఓట్ల చోరీ ఇష్యూ కూడా ఆ కోవలోకి చెందిందే.

దేశంలో ఇప్పటివరకు సర్ అమలు జరిగిన రాష్ట్రాల్లో 13 కోట్ల ఓట్ల చోరీ జరిగిందని ఆరోపిస్తూ ఇండీ కూటమి..వారికి అండగా సీజేపీలు గళం విప్పటం.. ఆందోళనలు చేస్తుండటం తెలిసిందే. 13 కోట్ల ఓట్ల చోరీకి సంబంధించిన ఆధారాలు చూపిస్తారా? అన్న సూటిప్రశ్నకు దీనిపై గళం విప్పిన వారు ఇప్పటివరకు నేరుగా ఎలాంటి ఆధారాల్ని చూపించింది లేదు. అదేమంటే.. పశ్చిమబెంగాల్ లో తీసేసిన ఓట్ల ప్రస్తావన చేయటం కనిపిస్తుంది. అయితే.. పశ్చిమ బెంగాల్ లోనూ ఓట్ల తీసివేతకు సంబంధించి అందరికీ ఆమోదయోగ్యమైన ఏ మీడియా సంస్థ కానీ.. ఏ ఎన్జీవో కానీ.. మరే ఇతర సంస్థ కానీ ఇప్పటివరకు అధ్యయనం చేసి.. వాస్తవంగా అక్కడేం జరిగిందో వెల్లడించింది లేదు.

నిజానికి సర్ ప్రక్రియ జరిగినప్పుడు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మమతా బెనర్జీ ప్రభుత్వం. సర్ ప్రక్రియను నిశితంగా గమనిస్తే.. ఓట్ల తీసివేతకు ముందు చాలానే ప్రక్రియ ఉంటుంది. అందులో బీఎల్ వో (బూత్ లెవల్ ఆఫీసర్) ఎన్నికల సంఘం తరఫున పని చేసే ఉద్యోగులు. వీరితో పాటు రాజకీయ పార్టీలకు చెందిన వారి పాత్ర కూడా ఉంటుంది. వారే బీఎల్ఏ (బూత్ లెవల్ ఏజెంట్లు). వీరు ఆయా రాజకీయ పార్టీల ద్వారా గుర్తింపు పొందిన ప్రతినిధులు లేదంటే కార్యకర్తలు. ఓటర్ల జాబితాలో తమ పార్టీ మద్దతుదారుల పేర్లు ఉన్నాయా? లేదా? అని చూసుకోవటం.. అర్హులైన కొత్త ఓటర్ల నమోదు ఫారాలు పూర్తి చేయటం.. బీఎల్ వోలు చేసే తొలగింపులను క్షుణ్ణంగా పరిశీలించి అభ్యంతరాలు ఉంటే లేవనెత్తటం వీరి ప్రధాన విధి.

ఇలాంటప్పుడు పశ్చిమబెంగాల్ లో రాజకీయ పార్టీల తరఫున పని చేసిన బీఎల్ ఏలు ఏం చెబుతున్నారు? మమతా బెనర్జీకి చెందిన పార్టీ ఎంతమందిని సర్ ప్రక్రియ బాధ్యతను అప్పగించింది? ఈ ప్రక్రియను ప్రత్యేకంగా పర్యవేక్షించేందుకు చేపట్టిన కార్యాచరణ ఏమిటన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. చివర్లో మాత్రం 70 లక్షల ఓట్లను తొలగించారన్న సింగిల్ లైన్ పట్టుకొని రచ్చ మాత్రం చేయటం కనిపిస్తుంది. 70 లక్షల ఓట్ల తొలగింపు.. ఆ తర్వాత వారిలో పలువురిని మళ్లీ ఓటర్లుగా గుర్తించి.. వారి ఓట్లను పునరుద్ధరించిన వైనం చూసినప్పుడు.. అప్పటి అధికార పక్షంగా ఉన్న టీఎంసీ తరఫు బీఎల్ఏల పని తీరుపై బోలెడన్ని సందేహాలు ఉన్నాయి. విచిత్రమైన విషయం ఏమంటే.. ఈ లోతుల్లోకి వెళ్లే వారు చాలా తక్కువగా కనిపిస్తారు. అందుకు భిన్నంగా పశ్చిమబెంగాల్ లో 70 లక్షల ఓట్లను తీసేసినట్లుగా ప్రచారం చేయటం కనిపిస్తుంది.

ఇలాంటి వేళ భారత ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియపై కొన్ని రాజకీయ పార్టీలు.. సీజేపీ లాంటి వారి వాదనకు భిన్నంగా ప్రముఖ ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా వాదన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన వాదనను ఆయన గణాంకాలతో సహా చెప్పారు. దీన్ని ఆయన బ్లాగులో షేర్ చేయటమే కాదు.. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెస్ లోనూ అచ్చేసింది. ఇంతకూ ఆయనేం చెప్పారు? ఆయన వాదన ఏంటి? అన్న ప్రశ్నలే కాదు ఇంతకీ సుర్జిత్ భల్లా ఎవరు. ఆయన బ్యాక్ గ్రౌండ్ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

భారతదేశ ప్రముఖ ఆర్థికవేత్తల్లో ఒకరు. రచయితగా.. విశ్లేషకులుగా ఆయన సుపరిచితులు. గతంలో ఆయన అంతర్జాతీయ ద్రవ్యనిధిలో భారత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పని చేశారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడిగా సేవలు అందించారు. దేశంలోని సామాజిక..రాజకీయ.. ఆర్థిక అంశాలకు సంబంధించిన వివరాల్ని గణాంకాల ఆధారంగా విశ్లేషించటంలో ఆయనకు మాంచి పట్టు ఉంది. ప్రస్తుతం ఆయన భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారతదేశంలో గృహ ఆదాయ పంపిణీ అంచనా కమిటీకి ప్రస్తుతం చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. దేశంలోని ప్రజల ఆదాయ వ్యత్యాసాలు.. ఆర్థిక స్థితిగతులను అంచనా వేయటం ఈ కమిటీ ప్రధాన విధిగా చెప్పాలి. కొన్నిప్రముఖ జాతీయ పత్రికలకు కాలమిస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగంలో లేనప్పటికి.. స్వతంత్ర ఆర్థికవేత్తగా.. రచయితగా మాత్రం చురుగ్గా వ్యవహరిస్తుంటారు.

సర్ మీదా.. సదరు ప్రక్రియ మీద వెల్లువెత్తిన విమర్శలు.. 13 కోట్ల ఓట్ల చోరీ అంశంపై ఆయన వాదన ఇదే. ఆయన చెప్పిన మొత్తం అంశాల్ని క్లుప్తంగా.. సూటిగా ప్రస్తావించటం ద్వారా విషయం మరింత సులువుగా అర్థం చేసుకునే వీలుంటుంది. ఇంతకూ ఆయనేమన్నారంటే..

- 13 కోట్ల ఓట్ల తొలగింపు ఆరోపణల్లో వాస్తవం లేదు. డ్రాఫ్ట్ లిస్ట్ వేరు.. ఫైనల్ లిస్ట్ వేరు. ముసాయిదా జాబితాలో ఒక పేరును ఫ్లాగ్ చేయటాన్ని తపపుడు తొలగింపుగా భావించలేం. తప్పులను సరిదిద్దే సాధారణ ప్రక్రియలో భాగంగానే ఈ పేర్లు గుర్తించారన్న విషయాన్ని మర్చిపోకూడదు.

- విపక్షాలు ఆరోపిస్తున్న 13.37 కోట్ల పేర్ల తొలగింపు ప్రతిపాదనల్లో మెజార్టీ భాగానికి స్పష్టమైన కారణాలు ఉన్నాయి. భారత్ లాంటి పెద్ద దేశంలో ప్రతి ఏడాది ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయనప్పుడు డూప్లికేట్ ఓట్లు.. చనిపోయిన వారి ఓట్లు పేరుకుపోవటం సహజం. 2004లో కూడా ఇలాంటి భారీ రివిజన్ జరిగిందన్నది మర్చిపోకూడదు.

- 2011 అధికారిక జనాభా లెక్కలను ప్రాతిపదికన తీసుకొని.. దేశంలో జనన - మరణాల రేటు.. కోవిడ్ మరణాలు.. విదేశాలకు వలస వెళ్లిన వారిని లెక్కల్లోకి తీసుకుంటే 2026నాటి భారతదేశంలో మొత్తం వయోజనుల సంఖ్య 100.8 కోట్లు. ఐక్యరాజ్యసమితి.. ప్రభుత్వ సాంకేతిక టీంల అంచనాలు కూడా ఈ సంఖ్యకు 1.5 శాతం అటుఇటుగా ఉండొచ్చు.

- 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోరన్న విషయాన్ని మర్చిపోకూడదు. 2024 లోక్ సభ ఎన్నికల నాటికి 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువతలో ప్రతి నలుగురిలో ఒకరు ఓటరుగా నమోదు కాలేదు. అంటే సుమారు 7.3 కోట్ల మంది యువతీ యువకులు ముందే ఓటరు జాబితాలో లేరు. ఓటర్ల సంఖ్య తగ్గటానికి కారణం కేవలం ఓట్ల తొలగింపులే కాదు. ముందే ఉన్న రిజిస్ట్రేషన్ గ్యాప్ ను కూడా పరిగణలోకి తీసుకోవాలి.

- సర్ ప్రక్రియ కింద తొలగించినట్లుగా చెబుతున్న జాబితాలో 8 పేర్లలో 7 పేర్ల తొలగింపు పూర్తిగా సమర్థనీయమైనదే. చనిపోయిన వారు.. డూప్లికేట్లు.. శాశ్వతంగా వలస వెళ్లిన వారు ఉంటారు. ఏ దేశంలో అయినా ఓటర్ల జాబితా వంద శాతం పక్కాగా ఉండదు. ఒకట్రెండు శాతం వ్యత్యాసాలు మామూలే.

- సీజేపీ (సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే 13 కోట్ల ఓట్ల తొలగింపునకు.. 2024 లోక్ సభ ఎన్నికల నాటి 2 శాతం ఓట్ల వ్యత్యాసానికి ముడిపెడుతూ చేసిన ఆరోపణలు సరైనది కాదు. ఏమైనా తీవ్ర ఆరోపణలు చేసేటప్పుడు దానికి తగిన ఆధారాలు చూపించాలే తప్పించి.. కేవలం రాజకీయ నినాదాలు.. డిమాండ్లు చేస్తే సరిపోదు.

- సర్ ముగిసిన రాష్ట్రాల్లో 13 కోట్ల మంది ఓటర్లు తొలగించారని ప్రచారం జరుగుతోంది. అవి ఇంకా డ్రాఫ్ట్ స్టేజ్ డిలీషన్లలోనే ఉన్నాయి. అంటే.. ఓటర్ల పేర్లను రికార్డుల నుంచి తొలగించాలా? వద్దా? అన్న ప్రతిపాదనలోనే ఉంది. ఇలాంటి ఓటర్లలో మరణాలు.. రీలొకేషన్లు.. డూప్లికేషన్ లాంటి చట్టబద్ధమైన అంశాలు ఉన్నాయి.

- 70 లక్షల మంది ఓటర్లను వివరణ లేకుండా తొలగించి ఉండొచ్చు.వివరణ లేకుండా అంటే 70 లక్షల మందిలో ప్రతి ఒక్కరినీ తప్పుగా తొలగించారన్నది ఏ మాత్రం నిజం కాదు.

- 13 కోట్ల ఓట్లను ఉద్దేశపూర్వకంగా దొంగిలించారనటం కేవలం రాజకీయ నినాదమే. అందులో వాస్తవం లేదు. అయితే.. సర్ ప్రక్రియ చాలా వేగంగా జరిగింది. దీని కారణంగా పేదలు.. వలసకూలీలు అవసరమైన పత్రాలను సమర్పించలేక ఇబ్బందులు పడ్డారు. 13 కోట్ల ఓట్ల చోరీ జరిగిందనే వాదనలో వాస్తవం లేదు. అయితే.. సర్ ప్రక్రియలో జరిగిన కొన్ని అనాలోచిత లోపాల కారణంగా దాదాపు 70 లక్షల మంది అర్హులైన ఓటర్లు నష్టపోయే ప్రమాదం ఉంది.

చివరగా ఒక ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. ఏ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో కేంద్ర ఎన్నికల సంఘంలో ఎన్నికల ప్రధాన అధికారికి..మిగిలిన ఇద్దరు కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్త వచ్చిందో.. అదే మీడియాలో సుర్జిత్ భల్లా రాసిన వ్యాసం ప్రచురితమైంది. కమిషనర్ల మధ్య విభేదాల వార్తను పిక్ చేసిన విపక్షాలు.. సీజేపీలు..అదే మీడియాలో 13 కోట్ల ఓట్ల చోరీ వాదనలో నిజం లేదని.. వాస్తవానికి దూరంగా ఉందంటూ గణాంకాల్ని ఉటంకించి రాసిన విశ్లేషణను మాత్రం అస్సలు పట్టించుకోని తీరు కనిపిస్తుంది. అంతేకాదు.. మీడియా సంస్థలు సైతం ఈ వాదనకు తగిన ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంది. కానీ.. అలాంటిది కూడా జరగలేదు. ఇదంతా చూస్తే.. తమకు నచ్చిన.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే అంశాలకే తప్పించి.. రెండు పార్శాలను ప్రజలకు అందించాలన్న విషయంలో మీడియా సంస్థలు.. సోషల్ మీడియాలో ఈ అంశంపై తరచూ మాట్లాడేవారు మౌనంగా ఉండటం దేనికి నిదర్శనం? అన్నదే అసలు ప్రశ్న.