కేంద్ర మంత్రి పదవి తలకు బాగా ఎక్కేసిందా సురేష్ గోపీ?
సినిమాల్లో ప్రత్యర్థులకు షాకులు ఇచ్చే విషయంలో హీరో ప్రదర్శించే హీరోయిజం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.
By: Garuda Media | 19 Sept 2025 10:51 AM ISTసినిమాల్లో ప్రత్యర్థులకు షాకులు ఇచ్చే విషయంలో హీరో ప్రదర్శించే హీరోయిజం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. రీల్ జీవితానికి భిన్నంగా రియల్ లైఫ్ లో హీరోలు.. విలన్లు అంటూ ఎవరూ ఉండరు. పరిస్థితులు.. ఆయా సందర్భాల్లో మనం వ్యవహరించే తీరుకు తగ్గట్లే మనం హీరోలమా? విలనా? జీరోనా అన్నది తేలుతుంది. ఈ విషయాన్ని ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాల్లో సూపర్ హీరోగా నటించిన మలయాళ అగ్రహీరోల్లో ఒకరైన సురేష్ గోపీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా గెలిచిన ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించింది. నిజానికి ఇదో అద్భుత అవకాశం. ఎందుకుంటే.. కేరళలో బీజేపీ బలపడాలని పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్న వేళ.. ఆ రాష్ట్రంలో కమ్యునిస్టులు.. కాంగ్రెస్ పార్టీనే హవా నడిపిస్తున్న వేళ.. అక్కడ కాషాయ జెండాను బలంగా దించటం అంత తేలికైన విషయం కాదు. ఇలాంటి సందర్భంలో తనకున్న సినీ గ్లామర్.. కేంద్ర మంత్రి పదవి హోదా.. పార్టీ అండతో మరింతగా బలపడేందుకు వీలుంది.
ఇన్ని సానుకూలాంశాలు ఉన్నప్పటికీ.. సురేష్ గోపీ వ్యవహరిస్తున్న తీరు ఆయన ఇమేజ్ తో పాటు పార్టీ సైతం డ్యామేజ్ అయ్యేలా చేస్తోంది. సాయం కోసం తన వద్దకు వచ్చే వారు ఎవరైనా..వారికి వీలైనంతగా సాయం చేయాల్సిన అవసరం ప్రజాజీవితంలో ఉన్న వారి మీద ఉంటుంది. ప్రభుత్వ ఆఫీసుల్లో అధికారుల మాదిరి.. రూల్ బుక్ తెరిచి పెట్టుకొని.. ఫలానా పని మాత్రమే తనదని..మిగిలిన వాటితో తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించే తీరును కేంద్ర మంత్రి హోదాలో ఉన్న సురేష్ గోపీ అస్సలు చేయకూడదు.
మొన్నటికి మొన్న సొంతింటి కోసం ఒక పెద్ద వయస్కుడు తన వద్దకు వస్తే.. అది తనకు సంబంధం లేని విషయమని.. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిందని ఈసడించిన సురేష్ గోపీ..తాజాగా ఒక పెద్ద వయస్కురాలైన మహిళ విషయంలోనూ ఇదే రీతిలో వ్యవహరించటం గమనార్హం. తాను కేంద్ర మంత్రినని.. దేశానికి మంత్రినని చెప్పుకుంటూ.. స్థానికంగా సాయం కోసం వచ్చినోళ్ల పట్ల ప్రదర్శిస్తున్న వైఖరిఅహంకారపూరితంగా ఉందని చెప్పాలి. ‘నో’ చెప్పినా నొప్పి కలగకుండా చెప్పాల్సిన అవసరం ఉందన్న చిన్న విషయాన్ని సురేశ్ గోపీ ఎందుకు మిస్ అవుతున్నట్లు? అన్నది ప్రశ్న.
సీపీఎం నేతల ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్న కరువన్నూర్ సహకార బ్యాంకు స్కాంలో పలువురి డిపాజిట్లు చిక్కుకుపోయాయి. దీనిపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ అంశంపై ఆనందవల్లి అనే మహిళ తన.. డిపాజిట్ మొత్తాన్ని తిరిగి ఇప్పించే విషయాన్ని చూడాలని కోరారు. దీనికి సురేష్ గోపీ స్పందిస్తూ.. ‘వెళ్లి మీ మంత్రితో.. ముఖ్యమంత్రికో చెప్పు. నేను కేంద్ర మంత్రిని. దేశానికి మంత్రిని. నాతో ఎక్కువగా మాట్లాడొద్దు’ అంటూ దురుసుగా చెప్పిన వైనం వివాదంగా మారింది.అత్యున్నత పదవుల్లో ఉండటం గొప్ప కాదు. ఆ పదవులకు వన్నె కలిగేలా వ్యవహరించాలన్న చిన్న విషయాన్ని సురేష్ గోపీ ఎందుకు మిస్ అవుతున్నారు? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
