వివేకా హత్య కేసు.. సీబీఐకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
అవును.. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్యకేసులో ఈ రోజు సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By: Raja Ch | 5 Feb 2026 5:18 PM ISTవైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంత సంచలనం సృష్టించిందనేది తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఈ హత్య కేసులో సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. ఇందులో భాగంగా... ఈ కేసు దర్యాప్తుపై ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఈ పిటిషన్ పై తాజాగా సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి సుప్రీంకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది.
అవును.. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్యకేసులో ఈ రోజు సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు వివేకా హత్యకేసు దర్యాప్తు కొనసాగించాలని సుప్రీంకోర్టు సీబీఐని కోరింది. ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు పూర్తయ్యిందని.. ట్రయల్ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని సీబీఐ సుప్రీంకోర్టు తెలిపింది!
ఈ సందర్భంగా.. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం దర్యాప్తు సంస్థకు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా... దర్యాప్తు సంస్థ నిబంధనల ప్రకారం కఠినంగా వ్యవహరించాలని.. దర్యాప్తు ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఇదే సమయంలో.. దర్యాప్తును ఒక నెలలోపే పూర్తి చేయాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించి.. బదులుగా దర్యాప్తును వీలైనంత త్వరగా ముగించాలని పేర్కొంది.
ఇదే క్రమంలో... దర్యాప్తు సమయంలో విచారణ నిమిత్తం ఇంకా ఎవరినైనా పిలవాల్సి వస్తే దానికి ఎలాంటి అడ్డంకులూ లేవని జస్టిస్ సుందరేష్ స్పష్టం చేశారు! ట్రయల్ కోర్టు ఉత్తర్వ్యుల్లో ఆ విషయం స్పష్టంగా ఉన్నందున.. యథాతథంగా దర్యాప్తు కొనసాగించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో.. ఈ కీలక పరిణామం ఆసక్తిగా మారింది.
మరోవైపు ఈ కేసు విచారణ సమయంలో వివేకా కుమార్తె సునీతరెడ్డి తరుపు న్యాయవాది ఓ విన్నపం చేశారు. ఇందులో భాగంగా.. సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూథ్రా ఈ కేసులో వాదనలు వినిపిస్తారని.. అందువల్ల ఆయన వచ్చేంత వరకూ విచారణను కాసేపు ఆపాలని కోరారు. దీంతో.. ఈ విన్నపాన్ని పరిగణలోకి తీసుకున్న ధర్మసనం.. విచారణను కాసేపటికి వాయిదా వేసింది.
ఇదిలా ఉంటే... ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సుందరేష్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. ఈ కేసు విచారణ కోసం మినీ ట్రయల్ నిర్వహించలేమని.. ఒకవేళ అలా చేస్తే మూడేళ్ల నుంచి నాలుగేళ్లు పడుతుందని అన్నారు.
