సుప్రీంకోర్టు తేల్చేసింది.. రిజర్వేషన్ సంగతేంటి?
సో.. ఇలా చూసుకుంటే.. తెలంగాణలో ప్రతిపాదించిన 42 శాతం బీసీల రిజర్వేషన్ అంశం.. ఏ తీరానికి చేరుతుందన్నది స్పష్టం అవుతూనే ఉంది.
By: Garuda Media | 18 Nov 2025 11:53 AM ISTస్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే విషయం తెలంగాణలో ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పటికే అసెంబ్లీ పాస్ చేసిన బిల్లు గవర్నర్‌వద్ద, అటు రాష్ట్రపతి వద్ద కూడా పెండింగులోనే ఉన్నాయి. పోనీ.. తమిళనాడు గవర్నర్ విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు.. ముందుకు సాగుదామని అనుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం..ఆదిశగా అడుగులు వేసినా.. అవి కూడా బెడిసి కొట్టాయి. గవర్నర్ వద్దకు బిల్లును పంపించి.. మూడు మాసాలు కూడా కాలేదని.. ఇంతలోనే జీవో ఎలా తెస్తారని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో ఆ మూడు మాసాల కాలం కోసం సర్కారు ఎదురు చూస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా డిసెంబరు 15 తర్వాత కానీ.. స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక నిర్ణయం తీసుకునేది లేదని.. సర్కారు స్పష్టం చేసింది. అంటే.. అప్పటికి గవర్నర్‌కు బిల్లును పంపించి మూడు మాసాలు అవుతుంది. దీంతో మరోసారి జీవో ఇచ్చి 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసి.. అనంతరం స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ఉద్దేశంగా ఉంది. అయితే.. ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన కేసు కాకపోయినా.. సేమ్ టు సేమ్ ఇలాంటి సమస్యపై తాజాగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మహారాష్ట్రలో కూడా.. ఓ వర్గానికి అదనపు ప్రయోజనం కల్పించి.. వారికి రిజర్వేషన్ ఇచ్చి.. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని అక్కడి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం భావించింది.
దీనిపైనే తాజాగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రిజర్వేషన్లు అనేవి.. పప్పుబెల్లాలు కావని పేర్కొంది. ఎలా పడితే అలా ఇచ్చేందు కు.. పంచిపెట్టేందుకు కుదరదని తేల్చి చెప్పింది. రాజ్యాంగం నిర్దేశించిన మేరకు 50 శాతానికి మించడానికి ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. అక్కడ కూడా బీసీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్(తెలంగాణ మాదిరి) కల్పించాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని కూడా సుప్రీంకోర్టు నిలదీసింది. ఈ క్రమంలో ఇప్పుడు తీర్పు ఇవ్వకపోయినా.. చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్రంగానే ఉన్నాయి. రిజర్వేషన్లను 50 శాతానికి పెంచడానికి వీల్లేదన్నది సుప్రీం నిర్దేశం.
సో.. ఇలా చూసుకుంటే.. తెలంగాణలో ప్రతిపాదించిన 42 శాతం బీసీల రిజర్వేషన్ అంశం.. ఏ తీరానికి చేరుతుందన్నది స్పష్టం అవుతూనే ఉంది. సుప్రీం తీర్పు ప్రామాణికం కాబట్టి.. తెలంగాణ విషయంలోనూ అదే జరుగుతుందన్నది న్యాయ నిపుణులు చెబుతున్న మాట. అయితే.. ఇప్పటికిప్పుడు రిజర్వేషన్లపై రేవంత్ సర్కారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ, స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా సమయం ప్రకటించింది. ఈలోగానే సుప్రీంకోర్టు తీర్పు రానుంది.(మహారాష్ట్ర విషయంలో).. దీనిని బట్టి.. తెలంగాణ సర్కారుకు ఆశించిన మేరకు ఊరట లభించడం కష్టమేనని అంటున్నారు పరిశీలకులు.
