కుక్కలు ముఖ్యమా? మనుషులు ముఖ్యమా?: సుప్రీంకోర్టు
పిల్లలు, వృద్ధులపై కుక్కల దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కోర్టు.. వీధికుక్కలు ప్రాణాలు తీస్తుంటే కళ్లు మూసుకుని కూర్చోవాలా..? అని నిలదీసింది.
By: Garuda Media | 14 Jan 2026 2:25 AM ISTవీధి కుక్కల వ్యవహారంపై తాజాగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కుక్కలు ముఖ్యమా.. మను షులు ముఖ్యమా? అని ప్రశ్నించింది. వీధి కుక్కల తరఫున వాదనలు వినిపిస్తున్న వారు.. బాధితుల తరఫున ఏం చెప్పగల రని నిలదీసింది. వీధి కుక్కల బారిన పడి దేశవ్యాప్తంగా గత ఏడాది వేలాది మంది మృతి చెందారని.. అనేక వాహన ప్రమాదాలు కూడా జరిగాయని.. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
``మూగ జీవాల పట్ల ప్రేమను చూపించడాన్ని మేం తప్పుబట్టడం లేదు. కానీ, ఎంతో సుదీర్ఘజీవితాన్ని అనుభవించాల్సిన ముక్కుపచ్చలారని చిన్నారులను కుక్కలు కాటేస్తుంటే.. ఎత్తుకుపోయి తినేస్తుంటే.. వారి పక్షాన నిలబడకుండా ఎలా ఉంటాం`` అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గత ఏడాదిలో ప్రారంభించిన వీధి కుక్కలపై విచారణను సుప్రీంకోర్టు కొనసాగిస్తోంది. తాజాగా మంగళవారం జరిగిన విచారణలో కీలక వ్యాఖ్యలు చేసింది. కుక్కల బెడదపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రజా భద్రత, జవాబుదారీతనం, జంతు ప్రేమికుల పాత్రపై ప్రశ్నలు గుప్పించింది.
పిల్లలు, వృద్ధులపై కుక్కల దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కోర్టు.. వీధికుక్కలు ప్రాణాలు తీస్తుంటే కళ్లు మూసుకుని కూర్చోవాలా..? అని నిలదీసింది. వీధి కుక్కల బెడదను ఆయా రాష్ట్రాలు అరికట్టాలని తేల్చి చెప్పింది. లేకుంటే ఆయా రాష్ట్రాలపై భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ``ప్రతి కుక్క కాటుకు ప్రభుత్వాలు పరిహారం చెల్లించాల్సిందే. జంతు ప్రేమికులు, కుక్కలను పెంచుకుంటున్న వారు వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వారిపైనా చర్యలు తప్పవు`` అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
``కుక్క ప్రేమికులు కేవలం కుక్కల కోసమే స్పందిస్తారా? బాధితుల బాధ, ప్రాణనష్టం గురించి పట్టదా? కుక్కల కంటే మనుషుల ప్రాణాలకు విలువ ఇవ్వరా?.. కుక్కలు ముఖ్యమా? మనుషులు ముఖ్యమా?`` అని సుప్రీంకోర్టు నిలదీసింది. వీధి కుక్కల విషయంలో తాము ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని పేర్కొంది. షెల్టర్లను ఏర్పాటు చేసి వాటికి ఆవాసాలు కల్పించాలని తేల్చి చెప్పింది.
