సుప్రీంలో వీధి కుక్కల కేసు... ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు!
దేశంలో వీధి కుక్కల బెడద ఇటీవల మరింత ఎక్కువగా పెరిగిన సంగతి తెలిసిందే! ఇటీవల పలు నగరాల్లో వీధి కుక్కలు చిన్న పిల్లలపై చేసిన దాడులు తీవ్ర కలకలం రేపాయి.
By: Raja Ch | 28 Oct 2025 3:00 AM ISTదేశంలో వీధి కుక్కల బెడద ఇటీవల మరింత ఎక్కువగా పెరిగిన సంగతి తెలిసిందే! ఇటీవల పలు నగరాల్లో వీధి కుక్కలు చిన్న పిల్లలపై చేసిన దాడులు తీవ్ర కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో.. వీధి కుక్కల కేసులో రాష్ట్ర ప్రభుత్వాలపై సోమవారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగస్టులో ఇచ్చిన ఉత్తర్వుల తర్వాత కూడా వీధి కుక్కల దాడులు నమోదవుతోన్న నేపథ్యంలో న్యాయస్థానం నుంచి తీవ్ర స్పందన వచ్చింది.
అవును... వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కుక్కలను పట్టుకోవడం, వాటి సంతానోత్పత్తిని నిరోధించడం, వాటిని శిబిరాలకు తరలించడంపై తీసుకుంటున్న చర్యలు తెలియజేసేలా అఫిడవిట్లు దాఖలు చేయకపోవడాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో... పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను సమన్లు జారీ చేసింది.
అసలు ఏం జరిగిందంటే..?:
వీధి కుక్కల దాడుల వల్ల ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో రేబిస్ మరణాల సంఖ్య పెరుగుతోందని వచ్చిన వార్తలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ లతో కూడిన ధర్మాసనం ఎనిమిది వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆగస్టు 11న ఆదేశించింది. అయితే.. దానిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఆ నేపథ్యంలో జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి.అంజరియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం దానిని విచారించింది. ఆ సందర్భంగా రేబిస్ లక్షణాలు లేదా విపరీత ప్రవర్తన కలిగిన కుక్కలు మినహా ఇప్పటివరకు షెల్టర్లకు తరలించిన వాటిని.. వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేసిన తర్వాత ఎక్కడినుంచి తీసుకొచ్చారో అక్కడే విడిచిపెట్టాలని పేర్కొంది.
ఈ మేరకు ఆగస్టు 11న ఇచ్చిన తీర్పును సవరించింది. ఈ క్రమంలోనే ఆదేశాల అమలుకు సంబంధించి అఫిడవిట్లు దాఖలు చేయాలని రెండు నెలల సమయం ఇచ్చింది. ఇలా ఆగస్టులో ఇచ్చిన ఉత్తర్వుల తర్వాత కూడా వీధి కుక్కల దాడులు నమోదవుతోన్న నేపథ్యంలో న్యాయస్థానం నుంచి తీవ్ర స్పందన వచ్చింది.
సుప్రీం కీలక ఆదేశాలు!:
ఈ సందర్భంగా స్పందించిన సుప్రీంకోర్టు... రాష్ట్రాల నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందనా రాలేదని.. వీధి కుక్కల దాడులు పెరుగుతున్నాయని.. ఆ బెడద వల్ల విదేశాల్లో భారత్ ను చెడుగా చిత్రీకరిస్తున్నారని.. తామూ వార్తాకథనాలను చూస్తున్నామని.. రెండు నెలల సమయం ఇచ్చినా ఇంతవరకు సమాధానం రాలేదని తెలిపింది.
ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందు హాజరుకావాలని.. ఈ ఆలస్యానికి గల కారణాన్ని వివరించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. పశ్చిమబెంగాల్, తెలంగాణ, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేశాయని వెల్లడించింది.
