నిరసనల సమయంలో ఎవరైనా పూలు జల్లుతారా? : సుప్రీకోర్టు
ఒక వేళ దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడినప్పుడు.. ఇలాంటివాటిని ఊహించగలమా? అని విస్మయం వ్యక్తం చేసింది.
By: Garuda Media | 6 Aug 2026 9:59 AM ISTశాంతి యుత నిరసనలు.. హింసాత్మకం ఎందుకు అవుతున్నాయన్న విషయంపై ప్రభుత్వాలు ఆత్మవిచారం చేసుకోవాలని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ``ప్రజా ఉద్యమాలను, నిరసనలను నిలిపివేస్తే.. ప్రజాస్వామ్య స్ఫూర్తి గురించి.. మనం మరిచిపోవాల్సి ఉంటుంది`` అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం నుంచి ప్రపంచ దేశాలు అనేక విషయాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాయన్న విషయాన్ని పత్రికల్లో చదువుతున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయని(గూస్ బంప్స్) కోర్టు వ్యాఖ్యానించింది.
ఒక వేళ దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడినప్పుడు.. ఇలాంటివాటిని ఊహించగలమా? అని విస్మయం వ్యక్తం చేసింది. అంతేకాదు.. నిరసనల సమయంలో ఎవరైనా రాళ్లు కాకుండా పూలు జల్లిన సందర్భాలు ఉన్నాయా? అని ధర్మాసనం వ్యాఖ్యా నించింది. ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమైన దారులను అర్థం చేసుకోవాలని పేర్కొంది. ``పనులు మానుకుని నిరసన వ్యక్తం చేసే తీరిక దేశంలో ఉంటుందని ఎవరూ అనుకోరు. బాధితులకు ఆ సమయంలో ఓదార్పు అవసరం. ప్రభుత్వాలు వారి సమస్యలు వినాలి. వినేందుకు మీరు ఓర్పుగా ఉండాలి. మీ చర్యలతో నిరసన కారులను ఓర్పు వహించాలని కోరడం సరికాదు`` అని కోర్టు వ్యాఖ్యానించింది.
విషయం ఏంటి?
ఢిల్లీలో గత నెల 20న కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు.. `చలో పార్లమెంటు` కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నిరసనలపై పోలీసులు ఉక్కుపాదం మోపారన్న వార్తలు వచ్చాయి. నిరసనకారులపై లాఠీచార్జి చేయ డంతోపాటు.. వారిపై పెల్లెట్ గన్స్‌ను కూడా వినియోగించారు ఈ వ్యవహారాలపై సుప్రీంకోర్టులో వందల కొద్దీ పిటిషన్లు దాఖల య్యాయి. వీటిని గతంలోనూ విచారించిన కోర్టు పోలీసులను పెల్లెట్ గన్స్ వాడకుండా నిరోధించలేమని, వారి చేతులు కట్టేయ లేమని వ్యాఖ్యానించింది. తాజాగా ఈ పిటిషన్లు మరోసారి విచారణకు రాగా.. నిరసనలను అదుపు తప్పకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని వ్యాఖ్యానించింది.
ఈ సమయంలో పోలీసులపై విద్యార్థులు రాళ్లు రువ్వారని, అందుకే లాఠీ చార్జి చేయాల్సి వచ్చిందని. పెల్లెట్ గన్ వాడాల్సి వచ్చిందని వారి తరఫున న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ సమయంలో న్యాయమూర్తులు స్పందిస్తూ..నిరసన సమయం లో రాళ్లు పడకుండా చూడాల్సిన బాధ్యత, అంత వరకు రెచ్చగొట్టకుండా వ్యవహరించాల్సిన బాధ్యత కూడా పోలీసులు, ప్రభుత్వాలపైనే ఉందని వ్యాఖ్యానించింది. ``నిరసన కారులు రాళ్లు రువ్వకుండా పూలు రువ్వుతారని మేం భావించలేం. వారి ఆవేదనను చర్చించాలి. వారిని ఓర్పుగా నేర్పుగా అర్ధం చేసుకోవాలి. రాళ్లు రువ్వే పరిస్థితిరాకుండా సంయమనంతో పోలీసులు వ్యవహరించాలి`` అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
