Begin typing your search above and press return to search.

గుడ్లకే భయపడితే ఎలా సామీ?: మహువా పిటిషన్‌పై ‘సుప్రీం’ ఘాటు సెటైర్!

రాజకీయాల్లో ఉన్నాక ఊహించని మలుపులు, సంచలన వ్యాఖ్యలు రావడం చాలా సహజం.

By:  A.N.Kumar   |   7 Aug 2026 10:53 PM IST
గుడ్లకే భయపడితే ఎలా సామీ?: మహువా పిటిషన్‌పై ‘సుప్రీం’ ఘాటు సెటైర్!
X

రాజకీయాల్లో ఉన్నాక ఊహించని మలుపులు, సంచలన వ్యాఖ్యలు రావడం చాలా సహజం. కానీ ఈసారి ఏకంగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నుంచే ఒక విచిత్రమైన ఉదంతంపై ధీటైన వ్యాఖ్య రావడంతో పొలిటికల్ వర్గాల్లో ఓ రేంజ్‌లో రచ్చ లేస్తోంది. పశ్చిమ బెంగాల్ ఫైర్‌బ్రాండ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు వేసిన ఘాటు సెటైర్లు ఇప్పుడు నెటిజన్లకు, రాజకీయ విశ్లేషకులకు భలే వినోదాన్ని పంచుతున్నాయి.

అసలు కథేంటంటే పోలీసుల విచారణకు హాజరుకావాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ మహువా మొయిత్రా మేడమ్ గారు వెంటనే అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సరే కోర్టులో ఆమె తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది చెప్పిన ఆసక్తికరమైన కారణం వింటే ఎవరికైనా నవ్వాలో లేక ఏడ్వాలో అర్థం కానంత విచిత్రంగా ఉంది. తమ క్లయింట్ గారు విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్న సమయంలో ప్రత్యర్థులు ఆమెపై గుడ్లు విసిరే ప్రమాదం ఉందని.. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని లాయర్ గారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. భద్రతా పరమైన ఆందోళనల వల్లే విచారణకు హాజరుకావడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని లీగల్ డ్రామా రక్తికట్టించే ప్రయత్నం చేశారు.

అయితే ఈ విచిత్రమైన భద్రతా ఆందోళనను విన్న సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఎక్కడలేని విస్తుపోవడం, కాస్త నవ్వు ఒకేసారి వచ్చినట్లున్నాయి. రాజకీయాల్లో ఉన్న ప్రజాప్రతినిధి గుడ్లకు భయపడటమేమిటని ప్రశ్నిస్తూ కోర్టు ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదు. రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఇలా కోడిగుడ్లకు భయపడితే ఎలా అని ప్రశ్నించిన బెంచ్.. మన స్వాతంత్ర్య సమరయోధులు దేశం కోసం ఏకంగా తుపాకీ బుల్లెట్లనే గుండెలపై ఎదుర్కొన్నారని గుర్తుచేసింది. ప్రజా జీవితంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఇలాంటి చిన్నపాటి నిరసనలను కూడా ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉండాలని, రెండు గుడ్ల దాడికి ఇలా వణికిపోకూడదని సుప్రీంకోర్టు నేరుగా గట్టి షాకే ఇచ్చింది.

కోర్టు మూడ్ అర్థమైపోయి ఇక్కడ తమ పప్పులు ఉడకవని తేలిపోవడంతో మహువా మొయిత్రా తరఫు న్యాయవాది వెంటనే సైడ్ అయిపోయారు. తమ వాదనకు సానుకూల స్పందన లభించకపోవడంతో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించక తప్పలేదు. దీంతో ఆ పిటిషన్ కథ అక్కడితో క్లోజ్ అయింది.

చట్టసభల్లో నిలబడి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించే అంతటి ఫైర్‌బ్రాండ్ ఎంపీ గారు.. విచారణకు వెళ్లేటప్పుడు మాత్రం చిన్న కోడిగుడ్డును చూసి ఇంతలా పరేషాన్ కావడం నిజంగానే పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమ్లెట్లు, ఆఫ్‌బాయిళ్లంటూ రకరకాల మీమ్స్‌తో ఎంపీ గారిపై సెటైర్లు వేస్తుంటే.. మరోవైపు ప్రజాప్రతినిధులు చట్టపరమైన ప్రక్రియలకు సహకరించాల్సిందేనని.. నిరసనలకు భయపడి విచారణల నుంచి తప్పించుకోలేరని ఈ ఘటనతో సుప్రీంకోర్టు స్పష్టమైన సందేశం ఇచ్చిందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.