Begin typing your search above and press return to search.

ఎక్కడా గెలవలేదు..... కానీ మంత్రిగా కొనసాగుతున్నారు !

రాజ్యాంగం ప్రకారం ఎవరైనా మంత్రి కావాలంటే ముందుగా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీగా కానీ ఏదో ఒక సభలో గెలిచి ఉండాలి.

By:  Satya P   |   30 July 2026 11:37 PM IST
ఎక్కడా గెలవలేదు..... కానీ మంత్రిగా కొనసాగుతున్నారు !
X

రాజ్యాంగం ప్రకారం ఎవరైనా మంత్రి కావాలంటే ముందుగా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీగా కానీ ఏదో ఒక సభలో గెలిచి ఉండాలి. ఒకవేళ ఆయన సేవలు అత్యవసరం అనుకున్నపుడు ముందుగా మంత్రిగా తీసుకుంటారు. కానీ ఆరు నెలల వ్యవధిలో రెండు సభలలో దేనిలో ఒక దానికి ఎన్నికల అయ్యేలా చూసుకోవాలి. ఇది రాజ్యాంగం ఇచ్చిన అవకాశం. ఇది ఒక్కసారికి మాత్రమే అది కూడా అరుదైన సందర్భాలలో మాత్రమే వినియోగిస్తారు. కానీ బీహార్ లో ప్రభుత్వంలో ఒక చిత్రమే జరుగుతోంది. ఒక మంత్రి గారూ ఏ సభలో సభ్యుడు కారు, కానీ గత ఏడాది నవంబర్ నుంచి ఎనిమిది నెలలకు పైగా మంత్రిగా కొనసాగుతున్నారు. దీని మీద సామాజిక కార్యకర్త రాకేశ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ చేస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఎలా కొనసాగిస్తున్నారు :

ఎక్కడా సభ్యుడు కానీ వారిని మంత్రిగా ఎలా కొనసాగిస్తున్నారు అని బీహార్ ప్రభుత్వాన్ని సూటిగానే సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దీని మీద వివరణ ఇవ్వాలని అక్కడి బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీహార్ లో పంచాయతీ రాజ్ మంత్రిగా దీపక్ ప్రకాష్ కొనసాగుతున్నారు. ఆయన గత ఏడాది నవంబర్ 20న నితీష్ కుమార్ మంత్రివర్గంలో తొలిసారి మంత్రి అయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) ప్రకారం ఆయన 2026 మే 19లోపు శాసనసభ లేదా శాసనమండలిలో సభ్యత్వం పొందాల్సి ఉండగా అది జరగలేదు. ఇక ఆయన రాజీనామా చేయాల్సి ఉండగా మరోసారి బీజేపీ నాయకత్వంలో సామ్రాట్ చౌదరి సీఎం గా కేబినెట్ లో ఆయనకు చోటు కల్పించారు. ఆ విధంగా 2026 మే 7న మంత్రివర్గ విస్తరణ సందర్భంగా దీపక్ ప్రకాష్ ని రెండవసారి కూడా తీసుకున్నారు. దీని మీదనే ప్రజా వాయ్జం దాఖలు అయింది.

పూర్తిగా చట్టపరమైన అంశం :

ఇదిల ఉంటే ఈ ప్రజా వాజ్యం మీద విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వీ మోహనతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విధంగా రెండవ మారు కూడా మంత్రి పదవి చేపట్టడం పూర్తిగా చట్టపరమైన అంశంగా పేర్కొంది. ఎక్కడా ఎన్నిక కాని వ్యక్తిని ఎలా కొనసాగిస్తున్నారు అని కూడా ప్రశ్నించింది. దీని మీద బిహార్ ప్రభుత్వ తరఫు న్యాయవాది అయితే ప్రభుత్వంతో మాట్లాడి వివరణ ఇస్తామని చెప్పడంతో ఈ కేసుని ఆగస్టు 4కి వాయిదా వేశారు.

రాజ్యాంగంలో అవకాశం :

రాజ్యాంగంలో ఆర్టికల్ 164(4) ప్రకారం ఎక్కడా సభ్యుడు కాకపోయినా మంత్రిగా చేయవచ్చు, అంతే కాదు ముఖ్యమంత్రిగానూ ప్రమాణం చేయవచ్చు. కానీ ఆరు నెలల వ్యవధిలో శాసనసభ లేదా శాసనమండలిలో సభ్యుడుగా తప్పనిసరిగా నెగ్గాలి. కానీ ఈ అధికరణాన్ని వీలుగా చేసుకుని ఆరు నెలల కాలం పూర్తి కాగానే రాజీనామా చేసి మరోసారి మంత్రి అయితే మరో ఆరు నెలల వ్యవధి వస్తుంది కదా అంటే లాజిక్ కి ఇది సరిపోతుంది కానీ చట్ట ప్రకారం న్యాయ ప్రకారం నైతికంగా కూడా కూడని వ్యవహారం అని అంటున్నారు. అలా కనుక చేస్తూ పోతే పోతే కనుక ఎవరైనా ప్రజల తీర్పుతో చట్ట సభలతో సంబంధం లేకుండా ఆరు నెలలకు ఒకసారి రాజీనామా చేసి మళ్ళీ ప్రమాణం చేస్తూ అలా ఎన్నాళ్ళు అయినా కొనసాగే దుస్సంప్రదాయం అమలు అవుతుందని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.

తీర్పులు ఏమి చెబుతున్నాయి :

ఇక వెనక్కి వెళ్తే ఇలాంటి కేసులలో తీర్పులు ఉన్నాయి.ఎస్ఆర్ చౌధురీ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అని 2001 నాటి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒకటి ఉంది. అందులో సుప్రీం కోర్టు తీర్పు స్పష్టంగా ఉంది. ఆర్టికల్ 164(4) కింద లభించే అవకాశం ఒకసారి మాత్రమే వర్తిస్తుందని, అదే శాసనసభ కాలంలో వరుసగా మళ్లీ మళ్లీ మంత్రి పదవి ఇవ్వడం రాజ్యాంగ ఉద్దేశానికి విరుద్ధమని సుప్రీంకోర్టు అప్పట్లో స్పష్టం చేసింది. కానీ బీహార్ లో మాత్రం వరసగా రెండవ ఆరు నెలల కాలాన్ని కూడా వాడేసుకుంటూ దీపక్ ప్రకాష్ మంత్రిగా కొనసాగుతున్నార్. అందుకే ఏ చట్టబద్ధమైన అధికారంతో మంత్రి పదవిలో కొనసాగుతున్నారో వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు బీహార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.