Begin typing your search above and press return to search.

లాఠీకి కూడా లిమిట్ ఉంది నాయనా... కేంద్రానికి సుప్రీం కోర్టు బిగ్ షాక్

మన దేశంలో ఒక సమస్య వస్తే పరిష్కార మార్గం చాలా సింపుల్ గా మారిపోయిందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

By:  A.N.Kumar   |   27 July 2026 12:56 PM IST
లాఠీకి కూడా లిమిట్ ఉంది నాయనా... కేంద్రానికి సుప్రీం కోర్టు బిగ్ షాక్
X

ప్రశ్నిస్తే 'లాఠీ'లతో వెల్‌కమ్ చెప్పే కొత్త పాఠ్యాంశానికి సుప్రీంకోర్టు పెద్ద బ్రేక్ వేసింది. ప్రజాస్వామ్యంలో సమాధానాలు చెప్పాలి కానీ, పోలీసుల చేతులకు పని చెప్పకూడదని పరోక్షంగా గట్టి క్లాసే తీసుకుంది. ఈ మధ్య దేశంలో పరీక్షలు రాయడం కంటే పరీక్షల అక్రమాలపై 'నిరసనలు' తెలపడమే పెద్ద పరీక్షగా మారిపోయింది. నీట్ అక్రమాలపై ప్రశ్నిస్తూ.. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీ వీధుల్లోకి వచ్చిన విద్యార్థులకు కేంద్రం అద్భుతమైన "స్వాగతం" పలికింది. అదేనండీ... 'సంసద్ చలో' అని విద్యార్థులు పిలుపునిస్తే 'లాఠీలతో చలో' అంటూ పోలీసులు తమ బాధ్యతను అత్యంత "శ్రద్ధగా" నెరవేర్చారు. బాష్పవాయువులు, లాఠీ దెబ్బలు... అబ్బో.. విద్యార్థులకు ప్రజాస్వామ్యం గురించి ప్రాక్టికల్ గా పాఠం చెప్పేశారు. పోలీసుల 'అతిప్రేమ'పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతూ... "శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం ఇచ్చింది, మీ లాఠీలు ఇచ్చింది కాదు" అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది.

లాఠీకి కూడా లిమిట్ ఉంటుంది. ప్రశాంతంగా నిరసన తెలుపుతుంటే లాఠీఛార్జ్ చేయడమేంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆధారాలు భద్రపరచాలని.. సీసీటీవీ ఫుటేజ్, పోలీసుల బాడీ కెమెరా రికార్డింగ్‌లు దాచిపెట్టకండి.. బయటకు తీయండని కోరింది. దెబ్బలు తిన్న నిరసనకారులకు తగిన పరిహారం అందించాల్సిందేనని స్పష్టం చేసింది.

సోషల్ మీడియా 'ట్రెండింగ్' కామెంట్స్

మన దేశంలో ఒక సమస్య వస్తే పరిష్కార మార్గం చాలా సింపుల్ గా మారిపోయిందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. సమస్య వస్తే మన వ్యవస్థ ఇచ్చే 'స్టెప్ బై స్టెప్' సొల్యూషన్ రోడ్డుపై బారికేడ్లు పెట్టడం.. విద్యార్థులపై లాఠీలు ఝుళిపించడం.. లాఠీ విరిగినా సమస్య తీరకపోతే... సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం.. "ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే సమాధానం రావాలి గానీ, బాష్పవాయువు గోళాలు రావడం ఏంటి సామీ? ఇది ఏ కొత్త సిలబస్‌లో ఉందో విద్యాశాఖే చెప్పాలి.

ప్రభుత్వాలు విమర్శలను భరించాలి.. ప్రజాస్వామ్యానికి 'లాఠీ' ఫస్ట్ ర్యాంక్ కాదు... 'సమాధానం' ఇచ్చే ధైర్యమే ఫస్ట్ ర్యాంక్ తెచ్చిపెడుతుంది. ఇప్పటికైనా మన 'లాఠీ రాయుళ్ళు' సుప్రీం మాట వింటే మంచిది.