Begin typing your search above and press return to search.

వీరికి గుణపాఠం చెప్పాల్సిందే.. బెయిల్ కు నిరాకరించిన సుప్రీం.. అసలు కేసు ఏంటి?

ఇటీవలి కాలంలో హిట్‌-అండ్‌-రన్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పెద్ద నగరాల్లో ఖరీదైన కార్లు, అధిక వేగం, డ్రంకన్ డ్రైవ్ ఈ మూడూ కలిసినప్పుడు రహదారులు భయానకంగా మారుతున్నాయి.

By:  Tupaki Political Desk   |   13 Dec 2025 4:58 PM IST
వీరికి గుణపాఠం చెప్పాల్సిందే.. బెయిల్ కు నిరాకరించిన సుప్రీం.. అసలు కేసు ఏంటి?
X

రహదారిపై ఒక క్షణం అజాగ్రత్త.. దాని ఫలితం మాత్రం ఒక జీవితానికి శాశ్వత ముగింపు. ముంబయిలో చోటుచేసుకున్న హిట్‌-అండ్‌-రన్ ఘటనపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక కేసుకు సంబంధించినవి కావు. అవి సమాజానికే ఇచ్చిన హెచ్చరిక. ‘ఇలాంటి అబ్బాయిలకు గుణపాఠం నేర్పించాల్సిందే’ అన్న మాటల్లో న్యాయస్థానం వ్యక్తం చేసిన ఆవేశం, ఆవేదన రెండూ ఉన్నాయి. రహదారులను ఆటస్థలాలుగా మార్చి, చట్టాన్ని లెక్కచేయకుండా ప్రాణాలతో ఆటలాడే ధోరణిపై ఇది ఒక స్పష్టమైన స్టాప్ సిగ్నల్. మద్యం మత్తులో కారును వేగంగా నడిపి, బైక్‌పై వెళ్తున్న దంపతులను ఢీకొట్టి, ఒక మహిళ ప్రాణాలు పోయినా.. నిందితుడు ఆగకుండా పారిపోవడం ఈ కేసును మరింత సీరియస్ గా మార్చింది. ప్రమాదం అనేది అనుకోకుండా జరిగే విషయం కావచ్చు. కానీ ప్రమాదం జరిగిన తర్వాత బాధ్యత తీసుకోకుండా పారిపోవడం మాత్రం నేరమే. ఆ నేరానికి సామాజిక హోదా, రాజకీయ నేపథ్యం, ఖరీదైన కారు ఏదీ రక్షణ కవచం కాకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.

ఇటీవలి కాలంలో పెరుగుతున్న హిట్ అండ్ రన్..

ఇటీవలి కాలంలో హిట్‌-అండ్‌-రన్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పెద్ద నగరాల్లో ఖరీదైన కార్లు, అధిక వేగం, డ్రంకన్ డ్రైవ్ ఈ మూడూ కలిసినప్పుడు రహదారులు భయానకంగా మారుతున్నాయి. చాలా సందర్భాల్లో నిందితులు ప్రభావవంతమైన కుటుంబాలకు చెందినవారిగా ఉండడం వల్ల, చట్టం తమను తాకదన్న ధీమాతో వ్యవహరిస్తున్నారు. ఇలాంటి నేపథ్యానికి చెక్ పెట్టేందుకే న్యాయస్థానం ఈసారి గట్టిగా మాట్లాడింది. మిహిర్‌ షా కేసులో సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడం ఒక న్యాయపరమైన నిర్ణయం మాత్రమే కాదు, ఒక నైతిక ప్రకటన కూడా. ‘కొద్ది రోజులు జైల్లో ఉండాలి’ అన్న వ్యాఖ్య వెనుక ఉన్న భావన స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. తప్పు చేసినవాడు తక్షణమే జైలుకు వెళ్లకపోతే.. తర్వాత నేరం చేసేవాడికి భయం ఉండదు. భయం లేకపోతే, బాధ్యత ఉండదు. బాధ్యత లేకపోతే, రహదారులపై మరిన్ని ప్రాణాలు పోతూనే ఉంటాయి.

మరో ప్రశ్నను లేవనెత్తుతున్న కేసు..

ఈ కేసు మరో ముఖ్యమైన ప్రశ్న కూడా ముందుకు వస్తుంది. హిట్‌-అండ్‌-రన్ లాంటి నేరాల్లో బెయిల్‌ అనేది ఎంతవరకు సబబు? ఒకరి నిర్లక్ష్యం వల్ల మరొకరి ప్రాణం పోయినప్పుడు, ‘ఇది ప్రమాదం మాత్రమే’ అని తేలికగా చూడగలమా? అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రమాదం అనేది పరిస్థితి కావచ్చు, కానీ మద్యం తాగి వాహనం నడపడం, ప్రమాదం తర్వాత పారిపోవడం మాత్రం స్పష్టమైన నేర ఉద్దేశాన్ని చూపిస్తాయి. ఇక్కడ బాధిత కుటుంబం కోణాన్ని కూడా మనం మర్చిపోలేం. ఒక సాధారణ రోజు, ఒక సాధారణ ప్రయాణం.. కానీ ఒక క్షణంలో ఒక కుటుంబం తల్లిని, భార్యను కోల్పోయింది. వారికి న్యాయం అంటే కేవలం పరిహారం కాదు. చేసినవాడికి శిక్ష పడడం, సమాజానికి ఒక ఉదాహరణగా నిలవడం కూడా న్యాయంలో భాగమే. ఆ దిశగానే సుప్రీంకోర్టు అడుగు వేసింది.

ఈ తీర్పు యువతకు, ముఖ్యంగా అధికారం, డబ్బు, రాజకీయ బలం తమ వెంటే ఉందని భావించే వారికి ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. స్టీరింగ్ మీ చేతిలో ఉందని, చట్టం మీ కాళ్ల కింద ఉందని భావిస్తే.. ఒక రోజు అదే చట్టం మీ ముందే నిలబడి ప్రశ్నిస్తుంది. అప్పుడు తప్పించుకునే మార్గాలు ఉండవు. చివరికి, ఈ కేసు మనందరినీ ఆలోచించాల్సిన పరిస్థితి తెచ్చింది. రహదారిపై నడిచే ప్రతి వాహనం వెనుక ఒక బాధ్యత ఉంటుంది. వేగం ఒక నిమిషం ఆనందం ఇవ్వొచ్చు. కానీ ఆ వేగం వల్ల జరిగే తప్పు జీవితాంతం మచ్చగా మిగిలిపోతుంది. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కఠినంగా అనిపించవచ్చు. కానీ ప్రాణాల విలువను గుర్తుచేసే ఈ కఠినతే ఈరోజు సమాజానికి అవసరం.