ఈసీ ప్రాసిక్యూషన్ పరిధిలోకి...చట్టం ఏమి చెబుతోంది ?
నిజానికి దేశంలో ఎవరికీ లేని అపరిమిత అధికారాలు ఈసీకి ఎందుకు ఇవ్వాలన్న దాని మీద చాలా కాలంగా చర్చ సాగుతోంది.
By: Satya P | 6 Oct 2026 9:12 AM ISTకేంద్ర ఎన్నికల సంఘానికి అపరిమితమైన అధికారాలు ఉన్నాయి. అది రాజ్యాంగబద్ధమైన సర్వ స్వతంత్ర సంస్థ. దాంతో ఈసీ నిర్ణయాలను సవాల్ చేసినా ప్రాసిక్యూషన్ చేసే అవకాశం లేదనీ అంటున్నారు. ప్రస్తుత చట్టం ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతర ఎన్నికల కమిషనర్లకు ప్రాసిక్యూషన్ నుండి చట్టపరమైన మినహాయింపు ఉంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇతర ఎలక్షన్ కమిషనర్ల చట్టం- 2023 లోని సెక్షన్ 16 ప్రకారం వారు తమ అధికారిక విధులను నిర్వర్తించే క్రమంలో చేసిన పనులు కానీ తీసుకున్న నిర్ణయాలు లేదా మాట్లాడిన మాటలపై ఎలాంటి సివిల్ లేదా క్రిమినల్ చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేస్తూ కోర్టుల విచారణ నుండి మినహాయింపు కల్పించారు. అయితే వీటి మీద పరిశీలన చేస్తామని తాజాగా సుప్రీంకోర్టు పేర్కొనడంతో ఇప్పుడు సరి కొత్త చర్చకు తావిస్తోంది.
అపరిమితమైన అధికారాలు :
నిజానికి దేశంలో ఎవరికీ లేని అపరిమిత అధికారాలు ఈసీకి ఎందుకు ఇవ్వాలన్న దాని మీద చాలా కాలంగా చర్చ సాగుతోంది. ఈసీ అంటే ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థనే కానీ అక్కడ కూడా మనుషులే ఉంటారు. రాగద్వేషాలతో పాటు సహజసిద్ధమైన మానవ లోపాలు కూడా ఉండే చాన్స్ ఉంది. అలాంటప్పుడు ఆ నిర్ణయాల మీద చట్టపరంగా చర్యలు ఎందుకు తీసుకోకూడదని మేధావులు ప్రజాస్వామ్య ప్రియులు అంతా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసీకి ఈ చట్టపరమైన మినహాయింపును సవాలు చేస్తూ లోక్ ప్రహరి అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో తాజాగా పిల్ దాఖలు చేసింది.
రాజ్యాంగబద్ధమేనా :
ఈ క్రమంలో దేశంలో భారత రాష్ట్రపతికి కూడా లేని ఇటువంటి అపరిమితమైన, జీవితకాల మినహాయింపును ఎన్నికల కమిషనర్లకు ఇవ్వడం రాజ్యాంగబద్ధమేనా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. అంతే కాదు ఈ మినహాయింపు చెల్లుబాటును విచారిస్తామని కూడా పేర్కొంది. అయితే ప్రస్తుతానికి ఈ నిబంధన పై కోర్టు స్టే విధించలేదు. ఇకపోతే సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్ 218 ప్రకారం విధి నిర్వహణలో తీసుకునే నిర్ణయాలపై ప్రాసిక్యూషన్ నుండి రక్షణ ఉంటుంది. కానీ దానికి ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి అవసరం అవుతుందని చెబుతున్నారు. అయితే, 2023 చట్టం ద్వారా ఎన్నికల కమిషనర్లకు కల్పించిన మినహాయింపు అంతకంటే చాలా విస్తృతమైనదిగా కోర్టుల జోక్యానికి తావులేకుండా ఉండేలా రూపొందించబడిందనే మేధావులు న్యాయ నిపుణులు, ప్రజాస్వామ్య ప్రియుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి.
న్యాయ సమీక్ష చేయాల్సిందే :
ఈ దేశంలో అన్ని వ్యవస్థలు రాజ్యాంగం ప్రకారం ఏర్పడ్డాయి. అయితే ఏ వ్యవస్థ అయినా న్యాయ సమీక్షకు అతీతం కాదు. ఇక ప్రాసిక్యూషన్ నుండి వ్యక్తిగత మినహాయింపు ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలు న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయి. ఒకవేళ ఎన్నికల సంఘం తీసుకున్న ఏ నిర్ణయమైనా రాజ్యాంగ విరుద్ధమని తేలితే వాటిని రద్దు చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఇప్పటికే ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు తీసుకునే చర్యల విషయంలో ఈ చట్టపరమైన ప్రాసిక్యూషన్ మినహాయింపుకు సంబంధించి పరిశీలన చేయాలని కూడా డిమాండ్లు ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇతర ఎలక్షన్ కమిషనర్లకు సివిల్ క్రిమినల్ ప్రాసిక్యూషన్ల నుంచి శాశ్వత లేదా జీవితకాల మినహాయింపు కల్పించే చట్టంలోని నిబంధనల చెల్లుబాటును పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇలాంటి ప్రాసిక్యూషన్ మినహాయింపు ఇవ్వడం రాజ్యాంగబద్ధంగా చెల్లుతుందా లేదా దీనివల్ల ఎలాంటి హాని జరుగుతుందనే అంశాలను లోతుగా పరిశీలిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో సీఈసీ ప్రత్యేక అధికారాల మీద ఏమి జరుగుతుంది అన్నది అంతా చర్చిస్తున్నారు.
