తాగేందుకు నీళ్లే లేవు.. బాటిళ్ల నాణ్యతపై పిటిషనా?
తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి సుప్రీంకోర్టులో చోటు చేసుకుంది. మంచినీళ్ల బాటిళ్ల నాణ్యత అంతర్జాతీయ స్థాయిని పాటించటం లేదంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది.
By: Garuda Media | 19 Dec 2025 12:00 PM ISTఇటీవల కాలంలో మన న్యాయస్థానాల్లో దాఖలవుతున్న కొన్ని పిటిషన్లపై న్యాయస్థానాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటాయి. కొందరి తీరును కోర్టులు ఆక్షేపిస్తుంటాయి. వాస్తవ పరిస్థితుల్ని మరిచి.. తమ ప్రయోజనాల కోసం.. పేరు కోసం తపించే పిటిషన్లను నిర్దాక్షిణ్యంగా రిజెక్టు చేయటం కనిపిస్తూనే ఉంటుంది.
తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి సుప్రీంకోర్టులో చోటు చేసుకుంది. మంచినీళ్ల బాటిళ్ల నాణ్యత అంతర్జాతీయ స్థాయిని పాటించటం లేదంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు.. సదరు పిటిషన్ విచారణను తిరస్కరించింది. ఈ సందర్భంగా పిటిషన్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేస్తూ.. ఇది కేవలం లగ్జరీ పిటిషన్ గా పేర్కొనటం గమనార్హం.
ఓవైపు దేశంలోని చాలా ప్రాంతాల్లో తాగునీరు అందని పరిస్థితి ఉందని.. ఆ అంశాన్ని వదిలేసి.. అమెరికా, జపాన్, ఈయూ దేశాల్లోని ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్ల నాణ్యత మార్గదర్శకాల్ని భారతదేశంలో ప్రవేశ పెట్టగలమా? అన్న సూటిప్రశ్నను సుప్రీం ధర్మాసనం సంధించింది. భారత్ లోని వాస్తవిక పరిస్థితుల్ని తెలుసుకోవాలని పేర్కొంటూ పిటిషన్ దారుకు ఒక సూచన చేసింది.
‘గాంధీజీ దేశానికి వచ్చినప్పుడు.. ఆయన దేశంలోని చాలా మారుమూల ప్రాంతాల్లో పర్యటించారు. మీరు కూడా అలా డెవలప్ మెంట్ నోచుకోని ప్రాంతాల్ని సందర్శించండి. అక్కడి ప్రజలు తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు పడుతుననారో చూడండి. అప్పుడు మీకు మన దేశం అంటే ఏమిటో అర్థమవుతుంది’’ అంటూ పిటిషన్ దారును ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్య బాగ్చితో కూడిన ధర్మాసనం అసహనాన్ని వ్యక్తం చేసింది.
ఈ తరహా పిటిషన్లు అర్బన్ రిచ్ మైండ్ సెట్ తో వేస్తారన్న ధర్మాసనం.. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి చాలామందికి తాగునీటి సరఫరా సరిగా లేదన్న విషయాన్ని గుర్తు చేసింది. ‘వారు శుద్ధి చేయని జలాలపై ఆధారపడుతున్నారు. ముందు వారి గురించి ఆలోచిద్దాం. నీళ్ల బాటిళ్ల నాణ్యత గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇది కేవలం లగ్జరీ వ్యాజ్యమే’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. పిటిషన్ ను విచారణ నుంచి డిస్మిస్ చేసింది. ఈ తరహా పిటిషన్లకు ఆ మాత్రం ఆగ్రహం సముచితమేనని చెప్పాలి.
