ఆకివీడు రామాలయం వివాదం : సుప్రీంకోర్టు తీర్పు వేళ జడ శ్రవణ్‌కు రఘురామ కీలక అభ్యర్థన
సుప్రీంకోర్టు తీర్పుతో అసంపూర్తిగా నిలిచిపోయిన రామాలయ పనులను పునఃప్రారంభిస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రకటించారు.
By: Tupaki Political Desk | 27 July 2026 4:17 PM ISTతీవ్ర వివాదాస్పదమైన పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు రామాలయంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకుని రామాలయం నిర్మించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ ఆలయ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే మరో పిటిషన్ దాఖలు చేయవచ్చని ధర్మాసనం సూచించింది. సుప్రీంకోర్టు తీర్పుతో అసంపూర్తిగా నిలిచిపోయిన రామాలయ పనులను పునఃప్రారంభిస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రకటించారు.
సుప్రీంకోర్టు తీర్పుపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆనందం వ్యక్తం చేశారు. రామాలయానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని వెల్లడించారు. ఈ తీర్పుతో సుప్రీంకోర్టులో శ్రీరాముడే విజయం సాధించినట్లు ఆయన అభివర్ణించారు. గతంలో హైకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ఆయన తెలిపారు. 90 ఏళ్లుగా ఆకివీడులో రామాలయం ఉందన్న తమ వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించిందని పేర్కొన్నారు.
ఆకివీడులో రామాలయ నిర్మాణం గతంలో తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి నెలలో శ్రీరామ నవమి సందర్భంగా జీర్ణావస్థకు చేరుకున్న రామాలయాన్ని పునరుద్ధరించాలని స్థానిక శాసనసభ్యుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు భావించారు. కూటమి నేతలతో కలిసి ఆ రోజు ఆలయంలో పూజలు చేసేందుకు ప్రయత్నించగా, స్థానికులు కొందరు అడ్డుకున్నారు. అక్కడ గొంతేనమ్మ కోవెల ఉందని పేర్కొంటూ రామాలయ నిర్మాణానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని, కొందరికి గాయాలయ్యాయి.
ఈ వివాదంపై ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ జోక్యం చేసుకుని, రామాలయ నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు వరకు సాగిన ఈ న్యాయపోరాటంలో సోమవారం జడ శ్రవణ్‌కుమార్ పిటిషన్‌ను కొట్టివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. తీర్పు అనంతరం మీడియాకు విడుదల చేసిన వీడియోలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు రామాలయ నిర్మాణంపై సంచలన ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు స్టే కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన రామాలయ నిర్మాణాలను, ముందుగా అనుకున్న ప్రకారం ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు.
ప్రస్తుతం గన్నవరంలో ఆలయానికి సంబంధించిన శిలలను చెక్కుతున్నామని, ఇప్పటికే 75 శాతం పనులు పూర్తయ్యాయని రఘురామ తెలిపారు. మరో నెల రోజుల్లో మిగతా పనులు పూర్తిచేస్తామని చెప్పారు. మంగళవారం ఉదయం నుంచి ఆకివీడులో పునాదుల పనులు ప్రారంభిస్తామని, రెండు వారాల తర్వాత గన్నవరంలో తయారైన సామగ్రిని తీసుకువచ్చి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రామభక్తుల కోరిక మేరకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో, ఇకనైనా మత సామరస్యంతో వ్యవహరించాలని, వివాదాలకు స్వస్తి పలకాలని న్యాయవాది జడ శ్రవణ్ కుమార్‌ను కోరుతున్నట్లు రఘురామరాజు వ్యాఖ్యానించారు.
