Begin typing your search above and press return to search.

తాళి కట్టలేదని విర్రవీగితే కుదరదు బాస్.. లివ్-ఇన్ జంటలకూ '498A' సుప్రీం షాక్!

మనువులు, మంత్రాలు, అగ్నిహోత్రాలు, ఏడడుగుల బాసలు ఏమీ లేకుండానే "లైఫ్‌ అంతా నీతోనే పిలగా" అని కబుర్లు చెప్పుకుంటూ ఒకే ఇంట్లో కాపురం పెట్టేసే లివ్-ఇన్‌ కపుల్స్‌కి సుప్రీంకోర్టు ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది.

By:  A.N.Kumar   |   3 Aug 2026 11:54 PM IST
తాళి కట్టలేదని విర్రవీగితే కుదరదు బాస్.. లివ్-ఇన్ జంటలకూ 498A సుప్రీం షాక్!
X

మనువులు, మంత్రాలు, అగ్నిహోత్రాలు, ఏడడుగుల బాసలు ఏమీ లేకుండానే "లైఫ్‌ అంతా నీతోనే పిలగా" అని కబుర్లు చెప్పుకుంటూ ఒకే ఇంట్లో కాపురం పెట్టేసే లివ్-ఇన్‌ కపుల్స్‌కి సుప్రీంకోర్టు ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. ఇకపై "మేం పెళ్లి చేసుకోలేదుగా.. నాపై 498A కింద కేసేంది రాజా?" అని బుకాయించే "లివ్-ఇన్" మోసగాళ్లకు సుప్రీంకోర్టు సీన్ రివర్స్ చేసింది. తాళి కట్టకపోయినా తడాఖా చూపించొచ్చని.. లివ్-ఇన్ సంబంధాల్లోనూ వేధిస్తే సెక్షన్ 498A కింద బుక్ చేసి ఊచలు లెక్కపెట్టించొచ్చని ధర్మాసనం ఊరటనిచ్చే తీర్పు చెప్పేసింది.

కర్ణాటకకు చెందిన ఒక కేడీ డాక్టర్ గారు.. ఆ ముచ్చటైన తీర్పుకు మూలకారణమయ్యారు. ఆల్రెడీ పెళ్లయిన విషయాన్ని సైలెంట్‌గా దాచేసి.. పాపం ఇంకో అమాయకురాలితో లివ్-ఇన్ రిలేషన్‌షిప్ అని రొమాంటిక్ కలరింగ్ ఇచ్చి.. ఆ తర్వాత కట్నం కావాలని శారీరక దాడికి దిగాడట.. తీరా ఆ బాధితురాలు పోలీసులను ఆశ్రయిస్తే.. "అసలు మా మధ్య చట్టబద్ధమైన పెళ్లే జరగలేదు, 498A నాకేలా వర్తిస్తుంది?" అని ఆ డాక్టర్ బాబు చాలా తెలివిగా కోర్టు మెట్లు ఎక్కాడు. కానీ మన సుప్రీంకోర్టు జడ్జీలు అంతకంటే తెలివైనవారు కదా "పెళ్లి పేపర్లు లేకపోతే ఏంటయ్యా.. భార్యాభర్తల్లా కలిసుండి మోసం చేస్తే క్రూరత్వం కాకుండా పోతుందా?" అని క్లాస్ పీకి ఆయనగారి పిటిషన్‌ను చెత్తబుట్టలో పారేశారు.

అసలు ట్విస్ట్ ఇక్కడే ఉందోచ్

అయితే "ఇకపై రోజూ గొడవపడే ప్రతి లివ్-ఇన్ జంటా పోలీస్ స్టేషన్‌కి పరుగెత్తవచ్చా?" అంటే.. సుప్రీంకోర్టు చిన్న "కండిషన్స్ అప్లై" బోర్డు పెట్టింది. నిన్న రాత్రి కలసి తిని ఉదయాన్నే విడిపోయే "టైమ్‌పాస్" కాంబినేషన్లకు ఈ రక్షణ దక్కదు. ఇద్దరికీ పెళ్లి చేసుకోవాలనే తీవ్రమైన ఉద్దేశం ఉండి సమాజం దృష్టిలో భార్యాభర్తల్లా మెలిగినప్పుడే ఈ 498A అస్త్రాన్ని ప్రయోగించవచ్చు.

"గృహహింస చట్టం ఉందిగా మళ్లీ 498A దేనికి?" అని నిందితుల లాయర్లు ఎంత లౌక్యంగా వాదించినా కోర్టు తగ్గలేదు. "అది వేరు.. ఇది వేరు.. నేరం చేసినవాడికి కటకటాలే కరెక్టు" అని తేల్చేసింది. ఆర్టికల్ 14 ప్రకారం మహిళలందరికీ సమానత్వ హక్కు ఉంటుందని గుర్తుచేస్తూ.. హింస అనేది పెళ్లి బంధంలో జరిగినా.. లివ్-ఇన్‌లో జరిగినా ఒకటేనని స్పష్టం చేసింది.

మొత్తానికి "లివ్-ఇన్ రిలేషన్‌షిప్ అంటే కేవలం రొమాన్స్.. జిల్ జిల్ జిగా జిగా మాత్రమే కాదురా బామ్మర్దీ.. కాస్త అటూ ఇటూ అయితే కేసుల డోస్ కూడా గట్టిగానే పడుతుంది" అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పేసింది. కాబట్టి లివ్-ఇన్‌లో ఉన్న సోదరులారా.. జాగ్రత్త.. బాండ్ పేపర్లు లేవు కదా అని విర్రవీగితే ఖాకీ డ్రెస్సులు వేసుకున్న ముద్దుల పోలీసులు మీకు స్వాగతం పలకడానికి రెడీగా ఉంటారు.