Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి ద్వారా పవన్ కళ్యాణ్‌ ను తీసుకొస్తే బీజేపీ ఆత్మహత్య చేసుకున్నట్టే

తెలంగాణ రాజకీయాల్లో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రవేశంపై తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

By:  A.N.Kumar   |   5 Jun 2026 12:00 AM IST
రేవంత్ రెడ్డి ద్వారా పవన్ కళ్యాణ్‌ ను తీసుకొస్తే బీజేపీ ఆత్మహత్య చేసుకున్నట్టే
X

తెలంగాణ రాజకీయాల్లో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రవేశంపై తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ద్వారా పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా ప్రోత్సహించే ప్రయత్నం జరిగితే దానికి మద్దతు ఇచ్చే బీజేపీ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్టేనని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన పాశం యాదగిరి తెలంగాణలో బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్‌ను ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తే ప్రజలు అంగీకరించరని అన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా పవన్‌కు మద్దతు ఇస్తే అది కూడా రాజకీయంగా నష్టదాయక నిర్ణయమే అవుతుందని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడిచినా సామాన్య ప్రజల జీవితాల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదని పాశం యాదగిరి విమర్శించారు. రాష్ట్రంలోని ప్రధాన వ్యాపార సంస్థలు, భూస్వామ్య వ్యవస్థ, కార్పొరేట్ శక్తులు ఇప్పటికీ ఒకే వర్గం చేతుల్లోనే ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణ వచ్చినా పాలనా విధానంలో ఆశించిన మార్పులు జరగలేదని, ఇంకా పాత ఆధిపత్య ధోరణులే కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు.

ఇక పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, రాజకీయ ప్రయాణంపై కూడా పాశం యాదగిరి తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో దివంగత నేత పరిటాల రవి నుంచి తనకు ఉన్న భయాన్ని దాచిపెట్టుకోవడానికే పవన్ కళ్యాణ్ విప్లవవాద భావజాలాన్ని ప్రదర్శిస్తూ ఒక రాజకీయ నాటకానికి తెరలేపారని ఆరోపించారు. తన ఇంట్లో, దుస్తులపై చేగువేరా, ఫిడెల్ కాస్ట్రో చిత్రాలను ప్రదర్శించడం ద్వారా ప్రజల్లో ఒక ప్రత్యేక ఇమేజ్ సృష్టించుకునేందుకు ప్రయత్నించారని అన్నారు.

అంతేకాకుండా, ప్రజాకవి గద్దర్‌పై 1997లో జరిగిన ప్రాణాంతక దాడి వెనుక అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారంటూ పాశం యాదగిరి ఆరోపించారు. అలాంటి వ్యక్తితో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయంగా కలిసి పనిచేయడం ఎలా సమర్థించగలరని ప్రశ్నించారు.

ఇటీవల జరిగిన ప్రెస్‌మీట్‌లో గద్దర్ గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కూడా పాశం యాదగిరి ఖండించారు. గద్దర్‌కు తానే కారు కొనిచ్చానన్న పవన్ వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని, గద్దర్ వద్ద ఇప్పటికే 2006 నుంచే సొంత ఇన్నోవా వాహనం ఉందని పేర్కొన్నారు. గద్దర్ పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

పాశం యాదగిరి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. అయితే ఆయన చేసిన ఆరోపణలపై పవన్ కళ్యాణ్ లేదా జనసేన పార్టీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.