ఇచ్చిన మాట కోసం నిలబడ్డాం: పవన్ కల్యాణ్
అనంతరం.. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రసంగానికి షెడ్యూల్ చేశారు.
By: Garuda Media | 10 Sept 2025 4:37 PM ISTఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్నికల హామీలు.. సూపర్ 6 పథకాలు విజయవంతం అయిన సందర్భాన్ని పురస్కరించుకుని.. అనంతపురంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు అగ్రతాంబూలం దక్కింది. ఈ సభలో ప్రధాన వక్తలుగా ముగ్గురిని ఎంపిక చేశారు. మూడు పార్టీల కూటమి ప్రభుత్వం కావడంతో తొలుత టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ప్రసంగించాలని నిర్ణయించారు.
అనంతరం.. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రసంగానికి షెడ్యూల్ చేశారు. ఇక, మూడో పార్టీ బీజేపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ మాధవ్ ప్రసంగించేలా కార్యక్రమానికి ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబును మంత్రి పయ్యావుల కేశవ్ ప్రసంగించాలని ఆహ్వానించారు. అయితే.. ఆయన తనకు బదులుగా తొలి ప్రధాన వక్తగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రసంగించాలని కోరారు. దీంతో సభలో తొలి ప్రధాన వక్తగా పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట కోసం.. నిలబడ్డామన్నా రు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో అనేక ప్రయాసలు ఎదురవుతున్నాయని అయినా.. సీఎం చంద్రబాబు నేతృత్వంలో వాటిని లబ్ధిదారులకు అందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కేవలం చెప్పిన వాటినే కాకుండా.. చెప్పని వాటిని కూడా అమలు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే అందరికీ ఉచిత ఆరోగ్య బీమాను కల్పిస్తున్నామని.. దీనికి ఒక్కొక్క కుటుంబం కోసం 25 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నామని చెప్పారు.
ఇక, తన శాఖలైన పంచాయతీరాజ్, అటవీ శాఖల గురించి ప్రస్తావిస్తూ.. రికార్డు స్థాయిలో గ్రామ సభలు నిర్వహించామని పవన్ కల్యాణ్ చెప్పారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయల కల్పన జరుగుతోందన్నారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులను రూపాయి కూడా ఖర్చు చేయకుండా.. గ్రామాల కు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇక, రాయల సీమ గురించి ప్రస్తావిస్తూ.. రాయల సీమను తిరిగి రత్నాల సీమగా మార్చేందుకు సీఎం చంద్రబాబు రేయింబవళ్లు కృషి చేస్తున్నారని వివరించారు.
ఈ క్రమంలోనే నీరు, పరిశ్రమలు, పెట్టబుడులు తీసుకువస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అంటే.. పార్టీల ప్రభుత్వం కాదని.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రజలు ఒక దుష్టపాలకుడి నుంచి విముక్తి పొందాలన్న ఉద్దేశంతో తమకు పట్టం కట్టి.. కోరుకున్న ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని.. ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
