తీవ్రమైన కరవు....ఇంట్లో మంట పెట్టనున్న ఎల్ నినో !
ఎల్ నినో. ఇపుడు ఈ పదమే భయపెడుతోంది. ఇప్పటిదాకా చూసిన ఎల్ నినో అన్నది ఒక ట్రైలర్ అయితే రానున్న ఆరేడు నెలలలో వచ్చేది సూపర్ ఎల్ నినో అంటున్నారు.
By: Satya P | 23 Oct 2026 9:17 AM ISTఎల్ నినో. ఇపుడు ఈ పదమే భయపెడుతోంది. ఇప్పటిదాకా చూసిన ఎల్ నినో అన్నది ఒక ట్రైలర్ అయితే రానున్న ఆరేడు నెలలలో వచ్చేది సూపర్ ఎల్ నినో అంటున్నారు. అది అత్యంత భయంకరంగా ఉండబోతోంది అని చెబుతున్నారు. ఏకంగా ప్రతీ ఇంట్లో మంట పెట్టనుంది అని అంచనా వేసి మరీ చెబుతున్నారు. పొయ్యి కింద పొయ్యి మీద రెండింటికీ కలిపి ఒకేసారి కరవు తీసుకుని వచ్చే పవర్ ఫుల్ సూపర్ ఎల్ నినోని దేశం చూస్తోంది. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలలో దీని ప్రభావం అత్యధికం అని చెబుతున్నారు. మరి ఇంతలా ఎల్ నినో వచ్చి మీద పడితే ఏమి చేయాలి అంటే చేయాల్సిన విధంగా పొదుపు చర్యలు ఎవరి మటుకు వారు పాటిస్తే తక్కువ నష్టంతో కష్టం తో బయటపడతామని దీని గురించి అంచనా వేస్తున్న వారంతా చెబుతున్నారు.
ఎల్ నినో తో వచ్చేవి :
ఎల్ నినోతో పాటే వెంట వచ్చేవి నీటి కొరత, అలాగే అధిక వేడిమి, నిత్యావసర ధరలు భారీగా పెరుగుదల. ఇక ఒకదానితో ఒకటి లింక్ అయి ఉన్న ప్రతీ వస్తువూ ఎల్ నినో తో తీవ్రమైన ప్రభావమే చూపిస్తుంది అంటున్నారు. ముందుగా నీటి కొరత అయితే పట్టి పీడిస్తుంది అని అంటున్నారు. భూగర్భ జలాలు దారుణంగా పడిపోవడంతో తాగేందుకు కూడా నీరు ఉండని దారుణమైన పరిస్థితులను అంతా చూడబోతున్నారు అని చెబుతున్నారు. మరి ఈ సమయంలో ఏమి చేయాలి అంటే ఉన్న నీటిని ఇప్పటి నుంచే జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. రెండు చెంబులు వాడాల్సిన చోట ఒక చెంబు వాడాలి. అలాగే పారబోయడం, నీటిని వృధా చేయడం అసలు చేయరాదు అని అంటున్నారు. ఇక తాగేందుకే నీటి కొరత ఉంటే పంటలకు ఎలా అన్నది పెద్ద ప్రశ్న. అలా పంటలు కూడా పూర్తిగా పండని స్థితి ఉంటుంది.
బియ్యం కొరత :
దాంతో అందరూ తినే బియ్యానికి కూడా ఎక్కువగా కొరత ఏర్పడుతుందని చెబుతున్నారు. ఇప్పటికే ఎల్ నినో ప్రభావం అని చూపిస్తూ బియ్యం ధరలను ఎక్కడికక్కడ పెంచేస్తున్నారు. రానున్న ఆరు నెలలలో వీటి ధరలు ఇంకా ఎక్కువగా పెరగవచ్చు అని అంటున్నారు. దాంతో అన్నం ముద్ద ప్రతీదీ ఇపుడు అత్యంత విలువ కాబోతోంది. అనవసరంగా అన్నం పారేయడం అయితే చేయవద్దు అన్నది పెద్దల మాట. ఉన్న ముద్దను జగ్రత్తగా వాడుకోవడం మరో మంచి మాట.
నిత్యావసరాలు అన్నీ :
కేవలం బియ్యం మాత్రమే కాకుండా నిత్యావసరాలు అన్నీ కూడా అత్యధిక ధరలు పలుకుతాయి. అది సామాన్యుడు కొనలేని స్థితికి వెళ్ళిపోతాయని అంటున్నారు. పప్పుల నుంచి వంట నూనెల నుంచి ఉల్లిపాయలు, చింతపండు, వంట గ్యాస్ నుంచి అన్నీ కూడా ఆకాశాన్ని అంటేలా ధరలు పెరిగిపోతాయని అంటున్నారు. ఇక కూరగాయల ధరలు ఇప్పటికే మార్కెట్ లో అదిరిపోతున్నాయి. ఇవి ఇంకా పెరిగి కిలో వంద రూపాయలు పై దాటినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
విద్యుత్ కొరత :
విద్యుత్ అన్నది ఎలా తయారవుతుంది అంటే నీటి నుంచే ఎక్కువ అన్నది తెలిసిందే. పైగా ఇది చవక అయినది కూడా. మరి నీరే లేని చోట విద్యుత్ ఉత్పత్తి భారీగా తగ్గిపోతుంది. దాంతో తీవ్రమైన విద్యుత్ కొరత ఏర్పడుతుంది అని అంటున్నారు. అందుకే ఇప్పటి నుంచే కరెంట్ ని కూడా పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. ఎక్కువగా ఫ్యాన్లు ఏసీలు లైట్లూ వేసి వృధా చేస్తే రేపటి రోజున విద్యుత్ ఉండని నేపథ్యం ఉంటుంది. వస్తుంది కదా కరెంట్ అని ఈ రోజు ఖర్చు చేయడం కాదు తగ్గిస్తే అదే రేపటికి మనకు వెలుగు ఇస్తుంది అన్నది గుర్తెరగాలి.
అనవసర ఖర్చులు కట్ :
ఇక సూపర్ ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అనవసర ఖర్చులను అదుపు చేయాలని సూచిస్తున్నారు. వేయి రూపాయలు ఖర్చు చేయాల్సిన చోట అయిదు వందలకే పరిమితం కావాలి. విలాసం ఏదో అవసరం ఏదో గుర్తించి ఆ విధంగా మసలుకోవాలని అంటున్నారు. ఎందుకంటే పెరిగే ధరలతో డబ్బు విలువ అమాంతం పడిపోతుంది. వందకు వచ్చేది రెండు వందలకు ఎగబాక వచ్చు. అపుడు నిత్యావసరాలకే ఎక్కువ బడ్జెట్ అవుతుంది. కాబట్టి చేతిలో డబ్బు ఉంచుకోవాలి. అది ప్రాణప్రదంగా ఖర్చు చేయాలని సూచిస్తున్నారు.
జాగ్రత్త పడితేనే :
అయితే సూపర్ ఎల్ నినో అని భయపడి వణికిపోయి ఇప్పుడే మొత్తం సరుకులు అన్నీ కొనేసి ఇంట్లో వేసుకున్నా కూడా అది కూడా తప్పే అవుతుంది. ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లై చైన్ తో సాగే ప్రపంచంలో ఈ విధంగా తొందర పడితే మరింతగా ధరలు పెరిగి ఆ ప్రభావం ఇతర వస్తువుల మీద కూడా పడుతుంది. అందువల్ల జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలు, అందరూ సూపర్ ఎల్ నినోని తట్టుకుని బయటపడతారని అంటున్నారు. వచ్చే ఆరు నెలలు గడిస్తే మాత్రం మంచి రోజులు వచ్చినట్లే అని అంటున్నారు. తస్మాత్ జాగ్రత్త.
