Begin typing your search above and press return to search.

2027 మరింత దారుణం... సూపర్ ఎల్ నినో భయంకరం !

ఎల్ నినో అంటే ఈపాటికే అర్ధం అయింది కదా. వర్షాభావం నూరు శాతం ఉంటుంది. పంటలు అన్నవి పండవు. దాంతో ఆహార ఉత్పత్తులకు దెబ్బ పడుతుంది.

By:  Satya P   |   6 Oct 2026 8:32 AM IST
2027 మరింత దారుణం...  సూపర్ ఎల్ నినో  భయంకరం !
X

ఎల్ నినో ఏమిటో తెలియదు కొత్త పదం అనుకున్నారు. కరవుకు ఇంగ్లీష్ లో మరో పేరు అని కూడా భావించారు. కానీ ఎల్ నినో దేశంలో తన ప్రతాపం ఏ తీరున చూపించిందో 2026 లో అంతా చూశారు. నైరుతి రుతు పవనాలను అమాంతం మింగేసింది. తుపాను వానలు తప్పించి మామూలు గా వాన చుక్క జాడ లేదు, ఇక అక్టోబర్ లో సైతం ఉక్క బోతలు వేసవిని తలపించే విధంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అయితే మరో నెల నుంచి సూపర్ ఎల్ నినో మొదలవుతుందని అంటున్నారు. ఇది ఎంతదాకా అంటే 2027 ఫిబ్రవరి చెబుతున్నారు. అయితే దాని ప్రభావం 2027 మొత్తం మీద భారీగా ఉండబోతోంది అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దాంతో తస్మాత్ జాగ్రత్త అన్నది కోట్లాది మంది దేశ ప్రజలకు జారీ అవుతున్న హెచ్చరికలు. ఇవి కేవలం హెచ్చరికలు కావు బతుకు సాఫీగా నడించేందుకు చేసే దిశా నిర్దేశాలుగా చూడాల్సి ఉంది.

పంటలకు దెబ్బ :

ఎల్ నినో అంటే ఈపాటికే అర్ధం అయింది కదా. వర్షాభావం నూరు శాతం ఉంటుంది. పంటలు అన్నవి పండవు. దాంతో ఆహార ఉత్పత్తులకు దెబ్బ పడుతుంది. వ్యవసాయ దిగుబడి తగ్గిపోతుంది. వీటితో పాటు తాగు నీటికి సైతం కటకటలాడే పరిస్థితి వస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలీ అంటే దుర్భరమైన పరిస్థితులు తలెత్తుతాయి. మరి విలయాన్ని తలపించే ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలి అన్నదే చూడాలి. ఇప్పటి నుంచే బియ్యాన్ని పదిలం చేసుకోవాలి. ఎందుకంటే నాలుగు నెలల తేడాలో సన్నబియ్యం ధరలు పాతిక శాతం పెరిగాయి. దాంతో రానున్న కాలంలో ఈ రేటు మరింతగా పెరిగే అవకాశలు ఉంటుందని అంటున్నారు.

అవసర ఆర్భాటాలు వద్దు :

పేద మధ్యతరగతి కుటుంబాలు ముఖ్యంగా మరో ఏడాది పాటు అయినా ఖర్చులను అదుపు చేసుకోవాలి. పొదుపు నేర్చుకోవాలని సామాజికవేత్తలు సూచిస్తున్నారు. వృధా ఖర్చులు పెట్టకుండా అవసరం చూసి మరీ రూపాయి తీయాలని కోరుతున్నారు. అనవసర వేడుకలకు చెక్ చెప్పాలి. అలాగే అప్పులు పెద్ద ఎత్తున చేయడాన్ని కూడా నిలుపు చేసుకోవాలి. ప్రతీ రూపాయిని చాలా జాగ్రత్తగా ఆచీ తూచీ ఖర్చు చేయాలని సూచిస్తున్నారు.

భారీ కొనుగోళ్ళు వాయిదా :

కనీసం ఒక ఏడాది పాటు అయినా ఖరీదైన కొనుగోళ్లకు స్వస్తి చెప్పాలి. కార్లు కొనడం, ఇళ్ళు కట్టాలనుకోవడం, ప్లాట్లు కొనుగోలు చేయడం వంటి వాటిని వీలైనంత వరకూ వాయిదా వేయాలని కోరుతున్నారు. అంతే కాదు మరమ్మతులు చేయడం వంటివి పెట్టుకున్నా భారీ ఖర్చుగానే అవుతుందని అంటున్నారు. ఇక వాహనాలు నడిపే వారు ఇంట్లో ద్విచక్ర వాహనాలు ఉంటే జాగ్రత్తగానే వాడుకోవాలని సూచిస్తున్నారు. పెట్రోల్ ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వీలైనంత వరకూ నడక అలవాటు చేసుకోవడం లేదా సైకిల్ మీద అయినా వెళ్ళే ప్రయత్నం చేస్తే మేలు అని అంటున్నారు.

విద్యుత్ పొదుపులు :

కరెంట్ బిల్లు కడుతున్నాం కదా అని ఇష్టం వచ్చినట్లుగా వాడేస్తే రేపటి రోజున కనీస అవసరాలకు కూడా కరెంట్ కి కటకటలాడాల్సి ఉంటుంది. జల విద్యుత్ ఉత్పత్తి ఎల్ నినో ప్రభావంతో గణనీయంగా తగ్గే చాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఇక్కడ కూడా పొదుపు అవసరం అని గుర్తు చేస్తున్నారు. ఇక 2026లో చలికాలం ఉండదని ఇప్పటికే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2027లో కూడా సూపర్ ఎల్ నినో ప్రభావంతో మరింతగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అంటున్నారు. దాంతో మండే ఎండలతో సావాసం చేయాల్సి వస్తుందని అంటున్నారు. మొత్తం మీద ఎల్ నినో టూ సూపర్ ఎల్ నినో వైపుగా సాగే ప్రయాణం మీద మాత్రం భయంకరమైన అంచనాలు ఉన్నాయి. అందువల్ల చేతిలో ఉన్న రూపాయిని కాపాడుకుంటూ వనరులు అన్నీ పొదుపుగా కాపాడుకుంటూ ఈ గండం గట్టెక్కాలని సామాజిక వేత్తలతో పాటు అంతా సూచిస్తున్నారు.