వివేకా విషయంలో జగన్ పై సునీత మరో సంచలన ఆరోపణ!
అవినాశ్ రెడ్డిని మంచి లీడర్ గా చేయాలని, అతనికి రాజకీయంగా మంచి భవిష్యత్ ఉందని వివేకా ఎప్పుడూ అనేవారని చెప్పిన సునీత.
By: Raja Ch | 10 Aug 2025 10:34 AM ISTఏపీ రాజకీయాల్లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఎంత చర్చనీయాంశం అనేది తెలిసిన విషయమే. ప్రధానంగా 2019 ఎన్నికల సమయంలో ఈ విషయం మరింత హాట్ టాపిక్. ఆ కేసుపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతుంది. మరోవైపు వివేకా 74వ జయంతి సందర్భంగా పులివెందులలోని ఇంటి వద్ద ఉన్న తండ్రి విగ్రహానికి భర్త రాజశేఖర్ రెడ్డి, తల్లి సౌభాగ్యమ్మతో కలిసి సునీత ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ముగ్గురూ కలిసి వైఎస్ వివేకాకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ప్రధానంగా... వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ జగన్ లక్ష్యంగా ఆమె చేసిన ఆరోపణలు మరోసారి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
అవినాశ్ రెడ్డిని మంచి లీడర్ చేయాలని...!:
అవినాశ్ రెడ్డిని మంచి లీడర్ గా చేయాలని, అతనికి రాజకీయంగా మంచి భవిష్యత్ ఉందని వివేకా ఎప్పుడూ అనేవారని చెప్పిన సునీత... అలాంటి వ్యక్తిని తమతో తిరిగిన, తమతో ఆడుకున్న అవినాశ్ రెడ్డే హత్య చేయించడం దారుణమని అన్నారు! కార్యకర్తకు దెబ్బ తగిలిందని సతీశ్ రెడ్డి, అవినాశ్ రెడ్డి పులివెందుల డీఎస్పీతో వాదనకు దిగారని.. పోలీసులు టీడీపీకి తొత్తులుగా మారారని ఆరోపించారని అన్నారు.
మరి.. వివేకా హత్య జరిగినప్పుడు ఘటనా స్థలంలో, పోలీసుల సమక్షంలో రక్తపు మరకలు చెరిపేసి శుభ్రం చేయలేదా? అప్పుడు మీకు పోలీసులు తొత్తులా? అని ప్రశ్నించిన సునీత... తన తండ్రి హత్య జరిగి ఆరేళ్లయినా నేటికీ న్యాయం జరగలేదని.. హైకోర్టులో 6 కేసులు, సుప్రీంకోర్టులో 6 కేసులు నడుస్తున్నాయని.. న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానని తెలిపారు.
‘వివేకా అంతిమ యాత్రను జగనన్న వద్దన్నారు’!:
ఇదే సమయంలో... సునీత మరో కీలక ఆరోపణ చేశారు. ఇందులో భాగంగా.. వివేకా అంతిమ యాత్రను జగనన్న నిరాకరించారని పేర్కొన్నారు. అలా ఎందుకు అన్నారో తనకు ఇప్పటికీ అర్థం కాలేదని.. కానీ తన కార్యకర్తలపై దాడి జరిగినప్పుడు అదే జగన్ పులివెందులలో విస్తృత నిరసనకు పిలుపునిచ్చారని.. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఇప్పటికీ నన్ను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని సునీత తెలిపారు!
