వ్యోమగామి.. సునీతా విలియమ్స్ రిటైర్మెంట్
భారత సంతతికి చెందిన ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్.. సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By: Garuda Media | 21 Jan 2026 12:39 PM ISTభారత సంతతికి చెందిన ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా)లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న సునీత.. రిటైర్మెంట్ ప్రకటించారు. నాసా నుంచి తాను రిటైర్ అవుతున్నట్టు ఆమె తెలిపారు. దాదాపు 27 ఏళ్లకు పైగా నాసాలో సునీత సేవలు అందిస్తున్నారు. స్పేస్ ఎక్స్ ద్వారా.. ఆమె అంతరిక్ష కేంద్రంలో గడిపిన విషయం తెలిసిందే.
1998లో నాసాలో చేసిన సునీత.. 1960, సెప్టెంబరు19న అమెరియాలోని ఓహియోలో జన్మించారు. తండ్రి దీపక్ పాండ్య గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారు కాగా... తల్లి బోనీ జలోకర్ స్లోవేకియా దేశస్తురాలు. వీరికి ఉన్న ముగ్గురు సంతానంలో సునీత చివరి అమ్మాయి. ఆమె అమెరికాలోని నవల్ అకాడెమీలో ఫిజిక్స్ డిగ్రీ, ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ పూర్తి చేశారు.
అమెరికాలో తొలుత నావికాదళంలో చేరిన ఆమె.. తర్వాత అంతరిక్ష ప్రయోగాలపై మక్కువతో.. వ్యోమగామిగా మారారు. అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ నిర్వహించిన సాహసయాత్రలో ఆమె పాల్గొన్నారు. 1983లో విలియమ్స్ మేరీల్యాండ్‌లోని అన్నాపోలిస్‌లోని యు.ఎస్. నావల్ అకాడమీలో చేరారు. 1987లో నావల్ ఏవియేషన్ ట్రైనింగ్ కమాండ్ వద్ద ఏవియేటర్ శిక్షణ పొంది తరువాత జూలై 1989లో ఆమె యుద్ధ హెలికాఫ్టర్ శిక్షణను పూర్తిచేశారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ 8 రోజుల మిషన్ కోసం బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో చేరుకున్నారు. దానిలో తలెత్తిన సమస్యల కారణంగా తొమ్మిది నెలలపాటు ఆమె అంతరిక్షంలోనే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో వ్యోమగాములు సురక్షితంగా తిరిగి రావడానికి నాసా, స్పేస్‌ఎక్స్ సహకారంతో గత ఏడాది మార్చి 15న క్రూ-10 మిషన్‌ను ప్రారంభించి.. అదే ఏడాది మార్చి 18న భూమికి తిరిగి తీసుకువచ్చారు.
