'హత్య' సినిమా కాకరేపింది.. రూ.5 కోట్లకు పరువు నష్టం దావాకు దారితీసింది
వివేకా హత్య కేసు ఇతివృత్తంతో తెరకెక్కిన 'హత్య' సినిమాలో తన పాత్రను, ముఖ్యంగా తన తల్లి పాత్రను అభ్యంతరకరంగా చిత్రీకరించారని సునీల్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By: A.N.Kumar | 17 Oct 2025 3:36 PM ISTమాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులలో ఒకరైన సునీల్ యాదవ్.. ఇటీవల విడుదలైన 'హత్య' సినిమాపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చిత్రం తన , తన కుటుంబం పరువు, ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా ఉందని ఆరోపిస్తూ, సినిమా యూనిట్‌కు.. మరికొందరికి ఆయన లీగల్ నోటీసులు పంపారు.
* రూ. 5 కోట్లు పరిహారం డిమాండ్
వివేకా హత్య కేసు ఇతివృత్తంతో తెరకెక్కిన 'హత్య' సినిమాలో తన పాత్రను, ముఖ్యంగా తన తల్లి పాత్రను అభ్యంతరకరంగా చిత్రీకరించారని సునీల్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రం కారణంగా తమ కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురైందని, తమ పరువు నష్టం జరిగిందని ఆయన పేర్కొన్నారు. దీనిపై స్పందిస్తూ, సునీల్ యాదవ్ తన తరఫు న్యాయవాది ద్వారా ముగ్గురికి లీగల్ నోటీసులు పంపారు. సినిమా దర్శకురాలు శ్రీవిద్య బసవ, నిర్మాత ప్రశాంత్ రెడ్డి, పులివెందుల వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పవన్ కుమార్ కు నోటీసులు పంపారు.
ఈ నోటీసుల్లో సినిమా యూనిట్ తక్షణం స్పందించాలని, ప్రతి ఒక్కరు రూ. 5 కోట్ల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏడు రోజుల్లోగా దీనికి స్పందన రాకపోతే, క్రిమినల్, పరువు నష్టం దావా కేసులు దాఖలు చేయనున్నట్లు ఆయన హెచ్చరించారు.
* వైఎస్ అవినాష్ రెడ్డిపై ఆరోపణలు
ఈ సినిమా వెనుక పులివెందుల ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫండ్‌ల సంబంధం ఉందని సునీల్ యాదవ్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ అంశంపై కూడా సమగ్ర విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
* పోలీసులకు ఫిర్యాదు, సోషల్ మీడియా వివాదం
సినిమాలో వాస్తవాలకు భిన్నంగా పాత్రలను సృష్టించి చూపించారని, సీబీఐ చార్జ్ షీట్‌లో ఉన్న నిందితుల సంఖ్యకు, సినిమాలో చూపిన పాత్రలకు మధ్య వ్యత్యాసం ఉందని సునీల్ యాదవ్ ఆరోపించారు. ఈ క్రమంలో, మార్చ్ 22, 2025న ఆయన పులివెందుల పోలీస్ స్టేషన్‌లో సినిమా యూనిట్‌పై ఫిర్యాదు కూడా దాఖలు చేశారు. అంతేకాక, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పవన్ కుమార్, సినిమాలోని కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేసి, తమ కుటుంబ ప్రతిష్టను మరింత దెబ్బతీశారని సునీల్ యాదవ్ ఆరోపించారు.
ఈ పరిణామం సినిమాలు.. వాస్తవ జీవిత సంఘటనల మధ్య ఉన్న సరిహద్దులు, అలాగే ఒకరి వ్యక్తిగత ప్రతిష్టను కాపాడడం యొక్క ప్రాముఖ్యతను మరోసారి చర్చకు తెచ్చింది. సునీల్ యాదవ్ డిమాండ్‌పై సినిమా యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
