Begin typing your search above and press return to search.

సునీల్ కుమార్ ను ఏం చేద్దాం? ప్రభుత్వంలో తర్జనభర్జన!

నిందితుల్లో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఉండటంతో కేసు విచారణ బాధ్యతలను కూడా ఐపీఎస్ అధికారికి ప్రభుత్వం అప్పగించింది. ఈ పరిణామాల మధ్య సోమవారం సునీల్ కుమార్ విచారణకు హాజరయ్యారు.

By:  Tupaki Political Desk   |   16 Dec 2025 4:31 PM IST
సునీల్ కుమార్ ను ఏం చేద్దాం? ప్రభుత్వంలో తర్జనభర్జన!
X

సీనియర్ ఐపీఎస్, డీజీ కేడర్ అధికారి సునీల్ కుమార్ విషయంలో ఏం నిర్ణయం తీసుకోవాలనే అంశంపై కూటమి ప్రభుత్వం తర్జనభర్జన పడుతోందని అంటున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుతో సునీల్ కుమార్ పై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో సోమవారం సునీల్ కుమార్ ను దర్యాప్తు అధికారి, విజయనగరం ఎస్పీ దామోదర్ సుమారు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం మరోసారి విచారణకు పిలుస్తామంటూ సునీల్ కుమార్ ను విడిచిపెట్టారు.

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గతంలో ఎంపీగా ఉండగా ఆయనపై రాజద్రోహం కేసును నమోదు చేశారు. అప్పట్లో సీఐడీ చీఫ్ గా పనిచేసిన సునీల్ కుమార్ ఆదేశాలతో రఘురామపై కేసు నమోదు చేయగా, ఆయన పుట్టినరోజు నాడే హైదరాబాద్ లో అరెస్టు చేసి రాష్ట్రానికి తెచ్చారు. అరెస్టు చేసిన రోజు రాత్రి రఘురామపై కొందరు ముసుగువేసుకుని దాడి చేసినట్లు గత ఏడాది రఘురామరాజు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సునీల్ కుమార్ తోసహా మరో ఐదుగురిని నిందితులుగా గుర్తిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

నిందితుల్లో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఉండటంతో కేసు విచారణ బాధ్యతలను కూడా ఐపీఎస్ అధికారికి ప్రభుత్వం అప్పగించింది. ఈ పరిణామాల మధ్య సోమవారం సునీల్ కుమార్ విచారణకు హాజరయ్యారు. అయితే దర్యాప్తు అధికారి వేసిన ప్రశ్నలకు సునీల్ కుమార్ సరైన సమాధానాలు చెప్పలేదని ప్రచారం జరుగుతోంది. విచారణలో సంతృప్తికరమైన సమాధానాలు చెప్పకపోవడంతో సునీల్ కుమార్ ను అరెస్టు చేసి ప్రశ్నించాలని దర్యాప్తు అధికారి భావిస్తున్నట్లు చెబుతున్నారు.

అయితే నిందితుడు సునీల్ కుమార్ సీనియర్ ఐపీఎస్ అధికారి కావడం, ఆయనను అరెస్టు చేయాలంటే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సివున్నందున.. దర్యాప్తు అధికారి సందిగ్ధంలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. సునీల్ కుమార్ నుంచి నిజాలు చెప్పించాలంటే ఆయనను అరెస్టు చేయాలని చెబుతూ దర్యాప్తు అధికారి ప్రభుత్వానికి లేఖ రాసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వం కూడా సునీల్ కుమార్ అరెస్టు చేయించడానికే మొగ్గు చూపుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తగిన సమయం కోసం ఎదురుచూస్తోందని అంటున్నారు.

తనపై కస్టడీలో దాడి చేసిన వారిపై చర్యలకు రఘురామరాజు ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ఏ4 రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ ను గతంలో అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు కోర్టు ద్వారా రక్షణ పొందుతూ విచారణ ఎదుర్కొంటున్నారు. ఏ5 గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి ఇదే మాదిరిగా అరెస్టు నుంచి తప్పించుకున్నారు. సుప్రీంకోర్టు ద్వారా విచారణకు నోటీసులు అందుకుని అరెస్టు ప్రమాదం నుంచి బయటపడ్డారు ప్రభావతి.

అదేవిధంగా అప్పటి సీఐడీ ఎస్పీ సునీల్ నాయక్ సైతం కోర్టు ద్వారా మినహాయింపు పొందారు. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ అరెస్టు సాధ్యమా? ప్రభుత్వం అనుమతించినా, కోర్టు ద్వారా అడ్డుకునే అవకాశాలు ఉన్నాయా? అనేదే ప్రధాన చర్చగా మారింది. సునీల్ కుమార్ ను అరెస్టు చేయిస్తే తలెత్తే పరిణామాలు కూడా ప్రభుత్వం ఆలోచిస్తోందని అంటున్నారు.