Begin typing your search above and press return to search.

పని చేయకపోతే తప్పుకోండి...బీజేపీ నేతలకు క్లాస్ !

తెలంగాణా బీజేపీ నేతలకు ఆ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సాల్ క్లాస్ తీసుకున్నారు అని అంటున్నారు.

By:  Satya P   |   25 Oct 2026 9:13 AM IST
పని చేయకపోతే తప్పుకోండి...బీజేపీ నేతలకు క్లాస్ !
X

తెలంగాణా బీజేపీ నేతలకు ఆ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సాల్ క్లాస్ తీసుకున్నారు అని అంటున్నారు. ఆయన ఈ బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారి హైదరాబాద్ వచ్చారు. వచ్చిన వెంటనే ఆయన తెలంగాణకు చెందిన బీజేపీ ముఖ్య నేతలు ఇతర నాయకులతో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో పార్టీ పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాగైతే కష్టం అని కూడా చెప్పేశారు. తాను ఇక మీదట పూర్తిగా తెలంగాణాలోనే ఉంటాను అని కూడా స్పష్టం చేశారు. తెలంగాణాలో బీజేపీ నేతల తీరు మారాల్సిందే అని ఆదేశించారు.

హైదరాబాద్ వదలండి :

నాయకులు అంతా హైదరాబాద్ లో ఉంటే పార్టీ ఎలా పటిష్టం అవుతుంది అని సునీల్ బన్సాల్ ప్రశ్నించారు. నిరంతరం ప్రజలతో వారు ఉండాలని పార్టీని బలోపేతం చేయాలని ఆయన గట్టిగానే కోరారు. అంతే కాకుండా రాష్ట్ర స్థాయి నాయకులు కేవలం రాజధాని హైదరాబాద్‌కే పరిమితం కాకుండా జిల్లాలలో పర్యటించాలని, అలాగే గ్రౌండ్ లెవెల్ దాకా వెళ్ళి పార్టీ శ్రేణులతో మమేకం కావాలని ఆయన కోరారు. ప్రజలతో ఉంటేనే పార్టీ బలోపేతం అవుతుందని ఆయన స్పష్టంగా ఒక సందేశం వినిపించారు.

పోటీ చేయాలంటే :

బీజేపీ నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలీ అంటే తాము పార్టీ పదవులు వదిలి తన సొంత నియోజకవర్గాలకు వెళ్ళాలని కూడా ఆయన సూచించారు. అలా నిర్ణయించుకున్న వారు ఒకటే రూల్ అని కూడా చెప్పేశారు. వారు ప్రస్తుతం తాము నిర్వహిస్తున్న పార్టీ బాధ్యతలకు పదవులకు ముందుగా రాజీనామా చేయాలని సునీల్ బన్సాల్ ఆదేశించడం విశేషం. పార్టీ పదవా లేక ఎన్నికల్లో పోటీనా ఏదో ఒకటి నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు.

తప్పిస్తామంటూ :

పార్టీలో పనిచేసే వారికే పదవులు అని ఆయన కచ్చితంగా చెప్పారు. అలా ఎవరైనా పని చేయకపోతే పదవుల నుంచి తప్పుకోండి అని కూడా సూచించారు. పార్టీ నియమించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించని వారు క్షేత్రస్థాయిలో పని చేయలేని వారు వెంటనే తమ పదవుల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని లేదంటే తామే బాధ్యతల నుంచి తప్పిస్తామని సునీల్ బన్సాల్ హెచ్చరించడం గమనార్హం. ఆఫీసులలో కూర్చుంటామంటే కుదరదని గ్రౌండ్ లెవెల్ లో పార్టీ కోసం పనిచేసే నాయకులే కావాలని ఆయన తేల్చేశారు. ఎవరైతే క్షేత్రస్థాయిలో కష్టపడతారో వారికి అవకాశం కల్పించడమే తమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ఇక తెలంగాణాలో రానున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు పార్టీ క్యాడర్‌ను సమాయత్తం చేసే వ్యూహంలో భాగంగానే సునీల్ బన్సాల్ ఈ కీలక సమావేశం నిర్వహించారు.

ఫుల్ ఫోకస్ తోనే :

ఇక మీదట తెలంగాణా విషయంలో పూర్తి ఫోకస్ ని కేంద్ర బీజేపీ నాయకత్వం పెడుతుందని అంటున్నారు. కేంద్ర నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా కూడా వరస పర్యటనలు తెలంగాణాలో చేస్తారు అని అంటున్నారు. డిసెంబర్ నెలలో మోడీతో వరంగల్ లో భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తున్నారు. దక్షిణాదికి గేట్ వేగా తెలంగాణాను భావిస్తున్న బీజేపీ నేతలు 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే పక్కా ప్లాన్ తో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే తెలంగాణా బీజేపీని యాక్టివ్ మోడ్ లో ఉంచాలని చూస్తున్నారు అని అంటున్నారు.