Begin typing your search above and press return to search.

తొలి మహిళా ఉప ముఖ్యమంత్రి సునేత్ర పవార్ బ్యాక్ గ్రౌండ్ ఇదే !

ఇంతకీ సునేత్ర పవార్ ఎవరు ఏమిటి ఆమె అజిత్ పవార్ సతీమణి మాత్రమేనా లేక ఆమె రాజకీయ నేపథ్యం ఏమిటి అన్న చర్చ సాగుతోంది.

By:  Satya P   |   31 Jan 2026 7:46 PM IST
తొలి మహిళా ఉప ముఖ్యమంత్రి సునేత్ర పవార్ బ్యాక్ గ్రౌండ్ ఇదే !
X

దేశంలో కీలక రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్రకు తొలిసారి ఒక మహిళ ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆమె ఇటీవల విమాన ప్రమాదంలో దివంగతులు అయిన అజిత్ పవార్ సతీమణి. ఉప ముఖ్యమంత్రిగా మరణించిన అజిత్ పవార్ రాజకీయ వారసురాలిగా సునేత్ర పవార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ఆమె ఉప ముఖ్యమంత్రిగా శనివారం పదవీ ప్రమాణం చేశారు. ఇంతకీ సునేత్ర పవార్ ఎవరు ఏమిటి ఆమె అజిత్ పవార్ సతీమణి మాత్రమేనా లేక ఆమె రాజకీయ నేపథ్యం ఏమిటి అన్న చర్చ సాగుతోంది.

రాజకీయ కుటుంబమే :

ఇక చూస్తే కనుక సునేత్ర పవార్ ది కూడా రాజకీయ కుటుంబమే. ఆమె అజిత్ ని పెళ్ళి చేసుకోకముందు నుంచే రాజకీయం ఏంటో చూశారు. స్వయంగా ఆమె తండ్రి స్వాతంత్ర సమరయోధుడుగా ఉన్నారు. ఇక ఆమె పుట్టింది మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లా తేర్ ప్రాంతం. ఆమె 1963 అక్టోబర్ 10న జన్మించారు. ఆమె విద్యాభ్యాసం ఆంతా స్థానికంగానే సాగింది. ఇక ఆమె 1983 ఏప్రిల్ న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయం నుంచి బీకాం డిగ్రీని అందుకున్నారు. ఆ తరువాత ఆమె ఔరంగాబాద్ లోని ఎస్ బీ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

ఆమె హాబీస్ అవే :

ఇక ఆమె కేవలం కాలేజ్ చదువులు మాత్రమే కాదు సోషల్, ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన కోర్సులను పూర్తి చేశారు పుస్తక పఠనం ఆమె హాబీగా ఉంది. బాగా చదువుతారు అని ఆమె కుటుంబ సభ్యులు చెబుతారు. నేచర్ ఫోటోగ్రఫీ పెయింటింగ్ కూడా ఆమెకు ఇష్టమైన హాబీలుగా ఉన్నాయి.

ఇటీవలనే రాజకీయం :

ఇక ఆమె రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా అజిత్ పవార్ తో వివాహం అనంతరం పూర్తిగా ఫ్యామిలీ బాధ్యతలే చూసుకుంటూ వచ్చారు. అయితే తన ఇద్దరు బిడ్డలు పెద్ద వాళ్ళు కావడంతో ఆమె రాజకీయాల మీద ఆసక్తి చూపించారు. ఇక 2019లో పెద్ద కుమారుడు పార్ధు పవార్ ని లోక్ సభ ఎన్నికల్లో నిలబెట్టిన అజిత్ పవార్ అతడు ఓటమి చెందడంతో పాటు పాలిటిక్స్ పట్ల విముఖంగా ఉండడంతో 2024 ఎన్నికల్లో తన సతీమణి సునేత్ర పవార్ ని ప్రోత్సహించారు. ఆమె పోటీ చేసి ఓటమి పాలు అయినా పాపులర్ అయ్యారు. ఆ వెంటనే రాజ్యసభకు 2024లో ఆయన నామినేట్ చేశారు గత ఏణ్ణర్ధ కాలంగా ఆమె రాజ్యసభ ఎంపీగా ఉంటున్నారు.

రెండేళ్ళ వ్యవధిలోనే :

సునేత్ర పవార్ రాజకీయం కేవలం రెండేళ్ళలోనే ఏకంగా డిప్యూటీ సీఎం స్థాయికి చేరుకుంది. ఆమె విద్యాధికురాలిగా ఉన్నారు. అలాగే పర్యావరణ సమస్యల మీద సామాజిక అంశాల మీద పూర్తి అవగాహనతో ఉన్నారు. దాంతో ఆమె తనకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు అని అంటున్నారు. ఆమె తనదైన ముద్ర మహారాష్ట్ర రాజకీయాల్లో వేయగలుగుతారు అని అంటున్నారు. ఆమె సామాజిక సేవను ముందు నుంచి చేస్తున్నారు ఎన్నో కార్యక్రమాలు గత పాతికేళ్ళుగా చేస్తూ వస్తున్నారు. ఇక ఆమె సామాజిక సేవకు గానూ జీవన్ గౌరవ్ పురస్కార్, గ్రీన్ వారియర్ అవార్డులతో పాటు, లోక్ మత్ ఐకాన్ అవార్డు, రాష్ట్ర మాత జిజావు పురస్కార్ 2024 వంటివి లభించాయి.