Begin typing your search above and press return to search.

ఎన్సీపీ కేంద్రంగా తెరపైకి కొత్త పేరు.. ఎవరీ సునేత్ర..!

బుధవారం ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   29 Jan 2026 5:00 AM IST
ఎన్సీపీ కేంద్రంగా తెరపైకి కొత్త పేరు.. ఎవరీ సునేత్ర..!
X

బుధవారం ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషాద సమయంలో అటు మాహాయుతి రాజకీయాల్లోనూ, ఇటు ప్రధానంగా ఎన్సీపీ రాజకీయాల్లోనూ కీలక చర్చలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్సీపీ నుంచి చాలా మంది పెద్ద నాయకులు ఉన్నప్పటికీ.. ప్రధానంగా ప్రస్తుతం అందరి దృష్టీ అజిత్ పవార్ భార్య, రాజ్యసభ ఎంపీ అయిన సునేత్ర పవార్ వైపు మళ్లిందని అంటున్నారు. దీంతో.. ఈమె ఎవరు అనేది ఆసక్తిగా మారింది!

అవును... మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణంతో.. ఆ రాష్ట్ర ప్రభుత్వ కూటమిలో 41 మంది ఎమ్మెల్యేలు కలిగి ఉన్న ఎన్సీపీ ఫ్యూచర్ పాలిటిక్స్, ఫ్యూచర్ లీడర్ పై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయని అంటున్నప్పటికీ.. ప్రధానంగా సునేత్ర పవార్ వైపు అందరి దృష్టీ మళ్లిందని అంటున్నారు. ఆయన భార్యగానే కాకుండా ఆమెకు అందుకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయనే చర్చా మొదలైందని చెబుతున్నారు. దీంతో.. ఈ విషయం ఆసక్తిగా మారింది.

2024 లోక్ సభ ఎన్నికల్లో ఓటమి!:

మాజీ రాష్ట్ర మంత్రి, లోక్ సభ ఎంపీ పదంసిన్హ్ పాటిల్ సోదరి అయిన సునేత్ర... 1985లో అజిత్ పవార్‌ ను వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో... ఇటీవలి 2024 సార్వత్రిక ఎన్నికలలో బారామతి లోక్‌ సభ స్థానం నుండి పోటీచేసిన ఈమె... శరద్ పవార్ కుమార్తె, అజిత్ పవార్ సోదరి అయిన సుప్రియా సులేపై పోటీ చేశారు. అప్పటి వరకూ ఆమె తన జీవితంలో ఎక్కువగా ప్రజల దృష్టిని ఆకర్షించలేదనే చెప్పాలి. అయితే ఆ ఎన్నికల్లో ఆమెకు పరాజయం ఎదురైంది! ఇందులో భాగంగా.. తన వదినపై 1,58,333 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు! అయితే.. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె మహారాష్ట్ర నుండి రాజ్యసభకు నామినేట్ చేయబడి, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

రాజకీయాలకు అతీతంగా ఎన్నో కీలక బాధ్యతలు!:

రాజకీయ నాయకురాలిగానే కాకుండా.. సామాజిక కార్యకర్త, పారిశ్రామికవేత్త, విద్యా నిర్వాహకురాలు కూడా అయిన సునేత్ర.. తనకంటూ ఓ ప్రత్యేక వైఖరిని సృష్టించుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం.. బారామతి టెక్స్‌ టైల్ కంపెనీ చైర్‌ పర్సన్‌ గా, ఆమె మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రంగంలో కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఇదే క్రమంలో... ఈమె 2010 నుండి నాయకత్వం వహిస్తున్న ఎన్జీఓ ఎన్విరాన్మెంటల్ ఫోరం ఆఫ్ ఇండియా (ఈ.ఎఫ్.ఓ.ఐ) వ్యవస్థాపకురాలు కూడా!

ఈ క్రమంలో... ఆమె ఎన్జీఓ సేంద్రీయ వ్యవసాయం, పర్యావరణ గ్రామాలు, పరిరక్షణ ప్రయత్నాలను ప్రోత్సహిస్తుంది. ఈ విధంగా మహారాష్ట్రలో స్థిరమైన అభివృద్ధికి ఆమె చేసిన కృషికి గానూ "గ్రీన్ వారియర్ అవార్డు" ఆమెకు లభించింది. అదేవిధంగా... 2011 నుండి ఆమె ఫ్రాన్స్‌ లోని వరల్డ్ ఎంటర్‌ ప్రెన్యూర్‌ షిప్ ఫోరంలో థింక్ ట్యాంక్ సభ్యురాలిగా కూడా పనిచేశారు.

ఇదే క్రమంలో.. శరద్ పవార్ స్థాపించిన విద్యా ప్రతిష్ఠాన్ అనే విద్యా ట్రస్ట్ కు ట్రస్టీగా కూడా ఉన్నారు. ఈ ట్రస్ట్ 25,000 మందికి పైగా విద్యార్థులకు విద్యను అందిస్తోంది. అదేవిధంగా.. ఆమె 2017 నుండి సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయంలో సెనేట్ సభ్యురాలిగా కూడా ఉన్నారు. ఈ క్రమంలో.. ప్రస్తుతం ఎన్సీపీకి ఆమె కీలక నాయకురాలు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు!