Begin typing your search above and press return to search.

ప్రపంచంలో టాప్ 10 జీతాలు పొందే సీఈవోల్లో మనోళ్లు ఎందరు?

పదవి ఏదైనా నెల తిరగానే బ్యాంక్ లో క్రెడిట్ అయ్యే జీతం లెక్కను సాధారణంగా లెక్కిస్తారు. రాజకీయ నాయకుల్ని పక్కన పెడితే.. మిగిలిన రంగాల్లో జీతం కీలక భూమిక పోషిస్తూ ఉంటుంది.

By:  Garuda Media   |   8 March 2026 10:07 AM IST
ప్రపంచంలో టాప్ 10 జీతాలు పొందే సీఈవోల్లో మనోళ్లు ఎందరు?
X

పదవి ఏదైనా నెల తిరగానే బ్యాంక్ లో క్రెడిట్ అయ్యే జీతం లెక్కను సాధారణంగా లెక్కిస్తారు. రాజకీయ నాయకుల్ని పక్కన పెడితే.. మిగిలిన రంగాల్లో జీతం కీలక భూమిక పోషిస్తూ ఉంటుంది. గూగుల్ సీఈవోగా వ్యవహరిస్తున్న మనోడు సుందర్ పిచాయ్ వేతన ప్యాకేజీని భారీగా పెంచేస్తూ గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఒక ఆంగ్ల మీడియా సంస్థ ప్రచురించిన కథనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఈ రిపోర్టు ప్రకారం సుందర్ పిచాయ్ వార్షిక జీతాన్ని మన రూపాయిల్లో లెక్కిస్తే అక్షరాల రూ.6300 కోట్లు (సరిగ్గా చెప్పాలంటే రూ.6361 కోట్లు, డాలర్లలో చెప్పాలంటే 692 మిలియన్ డాలర్లు). అంటే.. 63 అంకె తర్వాత తొమ్మిది సున్నాలు పెడితే మనోడి జీతం అవుతుంది. దీంతో.. ప్రపంచంలో అత్యధిక వేతనాన్ని పొందే టాప్ 10 సీఈవోల్లో ఒకరిగా నిలిచారు సుందర్ పిచాయ్.

ఇక్కడే మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. ప్రపంచంలో అత్యధిక వేతనాన్ని పొందే టాప్ 10 సీఈవోల్లో మనోళ్లు ముగ్గురు ఉండటం విశేషం. వారిలో ఒకరు సుందర్ పిచాయ్ అయితే మరొకరు సత్య నాదెళ్ల మూడో వారు ముకేశ్ అరోరా. మిగిలిన ఇద్దరి మాదిరి ఆయన పేరు పాపులర్ కాదు. కాకుంటే ప్రపంచంలోనే పేరున్న సైబర్ సెక్యూరిటీ కంపెనీ ‘‘పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌’’ కు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. వీరిలో ఒకరిది తమిళనాడు.. రెండో వారిది తెలుగురాష్ట్రాలకు చెందిన వారు. ముకేశ్ అరోరా విషయానికి వస్తే ఆయనది ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ కు చెందిన వారు.

సుందర్ పిచాయ్ తాజా వేతన ప్యాకేజీలో ఆయన వార్షిక జీతం 2 మిలియన్ డాలర్లు కాగా.. పెర్ఫార్మెన్స్ స్టాక్ యూనిట్ విలువ 126 మిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. ఈ మొత్తం.. కంపెనీ నిర్దేశించిన లక్ష్యాల్ని చేరుకునే దాని ఆధారంగా వేతన ప్యాకేజీలో సర్దుబాటు అవుతుంది. 2004లో గూగుల్ లో చేరిన సుందర్ పిచాయ్.. 2015లో సంస్థ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. గడిచిన పదేళ్లలో గూగుల్ మార్కెట్ విలువ ఏడు రెట్లు పెరిగింది. పదేళ్ల క్రితం 535బిలియన్ డాలర్లుగా గూగుల్ విలువను లెక్కేస్తే.. ఇప్పుడు అది కాస్తా ఏకంగా 3.6 ట్రిలియన్లకు చేరుకుంది. అందుకు తగ్గట్లే సుందర్ పిచాయ్ వేతనాన్ని భారీగా పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సుందర్ పిచాయ్ వేతన ప్యాకేజీలో కాస్త తికమక పెట్టే మాటల్లో ఒకటి పెర్ఫార్మెన్స్ స్టాక్ యూనిట్ అన్నది ఒకటైతే.. మరొక మాట లిమిటెడ్ స్టాక్ వెస్టింగ్. పెర్ఫార్మెన్స్ స్టాక్ యూనిట్ గా రూ.126 మిలియన్ డాలర్లను డిసైడ్ చేశారు. ఒక లిమిటెడ్ స్టాక్ వెస్టింగ్ కింద 84 మిలియన్ డాలర్లను అందుకుంటారు. ఇంతకూ లిమిటెడ్ స్టాక్ వెస్టింగ్ అంటే మరేమిటో కాదు.. కంపెనీ ఉద్యోగికి మంజూరు చేసే షేర్లు. వీటిని పదవీ కాలం ముగిసిన తర్వాత లేదంటే పని తీరు ఆధారంగా ఇవి ఉద్యోగికి బదిలీ అవుతాయి. గూగుల్ అనుబంధ సంస్థలైన వ్యోమో.. వింగ్ ఏవియేష్లలో 175 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను సుందర్ పిచాయ్ కు కేటాయించారు. అతడిపై ఉన్న బలమైన నమ్మకంతో ఈ వేతన పెంపును ప్రకటించినట్లు చెబుతున్నారు.

ఈ సందర్భంగా ప్రపంచంలో టాప్ 10 వేతనాన్ని పొందే సీఈవోలు ఎవరన్న సందేహం కలుగుతుంది. అందులో ముగ్గురు భారతీయులు ఉండటం విశేషం. ఇంతకూ ఆ టాప్ 10 సీఈవోలు ఎవరంటే..

1. ఎలోన్ మస్క్ (టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్)

2. జెన్సెన్ హువాంగ్ (ఎన్విడియా)

3. మార్క్ బెనియోఫ్(సేల్స్‌ఫోర్స్)

4. రీడ్ హేస్టింగ్స్ (నెట్‌ఫ్లిక్స్)

5. లియోనార్డ్ ష్లీఫర్ (రెజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్)

6. టిమ్ కుక్ (ఆపిల్)

7. నికేష్ అరోరా (పాలో ఆల్టో నెట్‌వర్క్స్)

8. సుందర్ పిచాయ్ (ఆల్ఫాబెట్ , గూగుల్)

9. హాక్ ఇ. టాన్ (బ్రాడ్‌కామ్)

10. సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్)