స్పెర్మ్ క్వాలిటీ పై ఆసక్తికర రిపోర్ట్: వేసవి అపోహలకే చెక్!
ఈ రిపోర్ట్ ముఖ్యంగా గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్న జంటలకు ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా చాలామంది ‘ఏ కాలంలో ప్రయత్నిస్తే మంచిది?’ అనే సందేహంతో ఉంటారు.
By: Tupaki Political Desk | 26 Feb 2026 2:51 PM ISTపురుషుల ఫెర్టిలిటీపై మాట్లాడినప్పుడు, ఒక అభిప్రాయం వినిపిస్తుంది. ఎక్కువ వేడి, ముఖ్యంగా వేసవి ఉష్ణోగ్రతలు (వేసవి కాలం) స్పెర్మ్ క్వాలిటీని దెబ్బతీస్తాయని. అందుకే చాలా మంది జంటలు గర్భధారణ ప్రయత్నాలను కాలానుగుణంగా ప్లాన్ చేస్తుంటారు. తాజాగా వచ్చిన ఒక పెద్ద అధ్యయనం ఈ నమ్మకాలను పూర్తిగా తలకిందులు చేసింది. వాస్తవానికి, వేసవిలోనే స్పెర్మ్ నాణ్యత మెరుగ్గా ఉంటుందని ఈ రిపోర్ట్ వెల్లడించింది.
15వేల కంటే ఎక్కువ మందిపై పరీక్షలు..
ఈ అధ్యయనంలో 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన 15,581 మంది పురుషుల వీర్య నమూనాలను విశ్లేషించారు. ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. సాధారణంగా అనుకున్నట్లుగా వేసవిలో స్పెర్మ్ క్వాలిటీ తగ్గలేదని, అందుకు విరుద్ధంగా జూన్, జులై నెలల్లో నాణ్యత ఎక్కువగా ఉందని తేలింది. అదే సమయంలో డిసెంబర్, జనవరి వంటి చల్లని కాలంలో స్పెర్మ్ క్వాలిటీ తక్కువగా నమోదైంది.
డీ విటమిన్ కారణమా?
ఈ ఫలితాలపై పరిశోధకులు విశ్లేషించినప్పుడు మరి కొన్ని ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. వేసవిలో ఎక్కువ సూర్యకాంతి వల్ల శరీరంలో విటమిన్ ‘డీ’ స్థాయిలు పెరుగుతాయి. ఇది హార్మోన్ల సమతుల్యతకు సహాయపడుతుంది. అలాగే, వేడి కారణంగా రక్తప్రసరణ మెరుగుపడడం కూడా స్పెర్మ్ ఉత్పత్తిపై పాజిటివ్ ప్రభావం చూపవచ్చు. మరోవైపు శీతాకాలంలో శరీర కార్యకలాపాలు తగ్గడం, సూర్యకాంతి కొరత ఉండటం వల్ల హార్మోన్ల మార్పులు సంభవించి స్పెర్మ్ నాణ్యత తగ్గే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
గత అనుమానాలకు లైన్ క్లియర్..
ఇది వరకూ ఉన్న ‘వేసవి = స్పెర్మ్ డ్యామేజ్’ అనే భావనకు ఈ అధ్యయనం సమాధానం ఇచ్చింది. అయితే, దీన్ని పూర్తిగా సాధారణ నియమంగా తీసుకోవడం కూడా సరైంది కాదు. ఎందుకంటే వ్యక్తిగత జీవనశైలి, ఆహారం, ఆరోగ్య పరిస్థితులు, ఒత్తిడి వంటి అంశాలు కూడా ఫెర్టిలిటీపై ప్రభావం చూపుతాయి. కేవలం కాలం మార్పుతోనే ఫలితాలు మారిపోవు.
గర్భాదారణకు యత్నిస్తున్న జంటలకు గుడ్ న్యూస్..
ఈ రిపోర్ట్ ముఖ్యంగా గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్న జంటలకు ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా చాలామంది ‘ఏ కాలంలో ప్రయత్నిస్తే మంచిది?’ అనే సందేహంతో ఉంటారు. ఇప్పుడు ఈ అధ్యయనం ప్రకారం వేసవి కాలం కూడా మంచి అవకాశాలను అందిస్తుందని చెప్పవచ్చు. అలాగే ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న వారికి కూడా ఇది ఒక మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. వైద్యులు చికిత్సా ప్రణాళికలు రూపొందించేటప్పుడు సీజనల్ ఫ్యాక్టర్లను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.
దీనితో పాటు వీటిని కూడా చూసుకోవాలి..
అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి.. ఫెర్టిలిటీ అనేది ఒకే ఒక్క కారణంపై ఆధారపడే విషయం కాదు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, సరైన నిద్ర, ఒత్తిడి నియంత్రణ వంటి అంశాలు కూడా కీలకం. అధిక మద్యం, పొగతాగడం వంటి అలవాట్లు స్పెర్మ్ క్వాలిటీని దెబ్బతీస్తాయి. కాబట్టి జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా కూడా ఫెర్టిలిటీని మెరుగుపరచుకోవచ్చు.
మొత్తానికి, ఈ తాజా అధ్యయనం ఒక విషయం స్పష్టంగా చెబుతోంది మనం అనుకున్నట్టుగా ప్రకృతి ఎప్పుడూ ఒకే విధంగా పనిచేయదు. కొన్ని సార్లు మన నమ్మకాలకే విరుద్ధంగా ఫలితాలు వస్తాయి. వేసవి కాలాన్ని ఫెర్టిలిటీకి ప్రతికూలంగా చూడకుండా, శాస్త్రీయ ఆధారాలతో పరిశీలిస్తే అది కూడా ఒక అవకాశంగా మారుతుంది. సరైన సమాచారం, సమతుల్య జీవనశైలి ఉంటే, ప్రతి కాలం కూడా కొత్త జీవానికి ఆహ్వానం పలికే సమయమే.
