Begin typing your search above and press return to search.

సుజనాకు లెక్కలు సరిపోవడం లేదట !

కేంద్ర మంత్రిగా నరేంద్ర మోడీ కేబినెట్ లో పనిచేసి ఢిల్లీ స్థాయిలో హవా చలాయించిన వారు సీనియర్ నేత ఏపీకి చెందిన సుజనా చౌదరి.

By:  Satya P   |   20 Aug 2025 9:28 AM IST
సుజనాకు లెక్కలు సరిపోవడం లేదట !
X

కేంద్ర మంత్రిగా నరేంద్ర మోడీ కేబినెట్ లో పనిచేసి ఢిల్లీ స్థాయిలో హవా చలాయించిన వారు సీనియర్ నేత ఏపీకి చెందిన సుజనా చౌదరి. ఆయన రాజకీయం అంతా టీడీపీలోనే ఎక్కువగా సాగింది. రెండు సార్లు ఆయన రాజ్యసభ సభ్యుడుగా టీడీపీ నుంచి అయ్యారు. ఆయన టీడీపీలో ఉన్నపుడు చంద్రబాబుకు కుడి భుజంగా ఉండేవారు. అందుకే ఆయనకు అత్యున్నత రాజ్యసభ సభ్యత్వం రెండు మార్లు బాబు ఇచ్చారని చెబుతారు. అయితే సుజనా 2019లో టీడీపీ ఏపీలో ఓటమి పాలు కావడంతో బీజేపీలోకి వెళ్ళారు. అయినా టీడీపీని ఆయన ఏనాడూ పల్లెత్తు మాట అనలేదు.

అనుకున్నది దక్కలేదు :

ఇక మూడేళ్ళ పాటు తన రాజ్యసభ సభ్యత్వం ఉందనగానే ఆయన బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ నుంచి కేంద్ర మంత్రులు ఎవరూ లేరు. ఎందుకంటే ఎన్డీయేలో వైసీపీ భాగం కాదు, బీజేపీకి ఎంపీలు లేరు, టీడీపీ దూరం జరిగింది దాంతో తనకు కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని సుజనా చౌదరి అన్ని లెక్కలూ వేసుకుని చేరారు అని అంటారు. కానీ అలా అయితే జరగలేదు. చివరికి 2022లో ఆయన పదవీ విరమణ చేశారు కానీ జస్ట్ ఎంపీగానే తన టెన్యూర్ పూర్తి చేయాల్సి వచ్చిందని అనుచరులు అంటారు.

ఆ సీటుకు గురి పెట్టినా :

ఇక సుజనా చౌదరి 2024 ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా తనకు విజయవాడ లోక్ సభ సీటు దక్కుతుందని ఎంతో ఆశించారు అని చెబుతారు. ఎందుకంటే లోక్ సభ సిట్టింగ్ ఎంపీగా ఉంటూ టీడీపీ నుంచి వైసీపీలోకి కేశినేని నాని వెళ్ళిపోయారు దాంతో బలమైన అభ్యర్ధిగా తాను ఉంటాను అనుకున్నారు. కానీ ఆ సీటు కేశినేని చిన్నికి దక్కింది. దాంతోనే ఆయన నిరాశ పడ్డారు అని చెబుతారు. లోక్ సభ నుంచి నెగ్గితే గ్యారంటీగా బీజేపీ కోటాలో కేంద్ర మంత్రి కావచ్చు అన్న ఆ లెక్క కూడా తప్పింది అని అంటున్నారు.

సమీకరణలు సరిపోవడంలా :

ఇక మొత్తం మీద విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సీటుని చివరి నిముషంలో సుజనా చౌదరికి కేటాయించారు. ఆయన కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకుంటే రాష్ట్రంలో ఎమ్మెల్యే అయ్యారు. పోనీ ఇది కూడా ఓకే రాష్ట్ర మంత్రి కావచ్చు అని బీజేపీ కోటాలో సాధ్యపడుతుందని అనుకున్నారు. అయితే సామాజిక సమీకరణలు ఇక్కడ దెబ్బేశాయి అని అంటున్నారు. మూడు పార్టీల కలయికలో పదవులు ప్రాంతీయ రాజకీయ సామాజిక సమీకరణలను చూసి లెక్క తేల్చితే సుజనాకు ఈ టెర్మ్ లో మంత్రి పదవి దక్కడం కష్టమే అని అంటున్నారు.

పుణ్యకాలమంతా అంతేనా :

ఇక అపుడే చూస్తూండగానే పదిహేను నెలలు గడచిపోయాయి. ఈ మధ్యలో ఎపుడైనా మంత్రి వర్గంలో మార్పులు చేసినా కూడా సుజనాకు చాన్స్ వస్తుందని ఆశించలేమని అంటున్నారు. దానికి కారణం మంత్రివర్గంలో నలుగురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. చంద్రబాబు లోకేష్ నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్. చంద్రబాబు కాకుండా ఈ ముగ్గురునీ అయిదేళ్ళలో తప్పించే అవకాశాలు లేనే లేవు అని అంటున్నారు. పైగా కృష్ణా జిల్లాలో మంత్రి పదవులు అంటే బీసీలు ఇతర సామాజిక వర్గాలు కూడా ముందుకు వస్తాయి. టీడీపీలోనూ కమ్మ ఎమ్మెల్యేలు రేసులో ఉన్నారు. సో ఇవన్నీ కూడి తీసివేస్తే కనుక సుజనా ఈ అయిదేళ్ళూ జస్ట్ ఎమ్మెల్యేగా ఉండాల్సిందేనా అన్న చర్చ సాగుతోంది. దాంతో ఆయన అనుచరులు అంతా నిరాశలో ఉన్నారని అంటున్నారు.