షాకింగ్ : పవన్ కళ్యాణ్‌పై సుగాలి పార్వతి ఫిర్యాదు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సుగాలి పార్వతి షాక్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి కేసులో న్యాయం చేస్తామన్న హామీని నెరవేర్చలేదని పవన్ పై ఆమె గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By: Tupaki Political Desk | 6 July 2026 4:36 PM ISTడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సుగాలి పార్వతి షాక్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తన కుమార్తె కేసులో న్యాయం చేస్తామన్న హామీని నెరవేర్చలేదని పవన్ పై ఆమె గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె కేసులో తనకు న్యాయం జరగలేదని, ఈ విషయంలో పవన్ మోసం చేశారంటూ సుగాలి పార్వతి ఆరోపిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కేసును వాడుకున్నారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం తీవ్ర సంచలనంగా మారింది. కర్నూలు జిల్లాకు చెందిన సుగాలి పార్వతి గన్నవరం పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అవుతోంది. తన కుమార్తె మరణానికి కారణమైన వారిని శిక్షించాలని సుదీర్ఘంగా పోరాడుతున్న సుగాలి పార్వతి ఊహించని విధంగా డిప్యూటీ సీఎంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోంది.
గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ కుటుంబానికి పలు హామీలు ఇచ్చారని తల్లి పార్వతీ దేవి గుర్తు చేశారు. ‘తాము అధికారంలోకి వస్తే తన కుమార్తె కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తానని, మొదటి సంతకం కూడా ఈ కేసు మీదే పెడతానని పవన్ కళ్యాణ్ గతంలో హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆయన మాట మార్చారు" అని ఆమె ఆరోపిస్తున్నారు. హామీలతో నమ్మించి, అధికారంలోకి వచ్చాక కేసును గాలికి వదిలేశారని, దీనిపై చీటింగ్, నమ్మకద్రోహం సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆమె పోలీసులను కోరారు. అలాగే, న్యాయం కోసం ప్రశ్నించినప్పుడల్లా జనసేన మద్దతుదారుల ద్వారా తనపై దాడులు చేయిస్తున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
మరోవైపు, తల్లి ఆరోపణలపై పవన్ కళ్యాణ్ గతంలోనే స్పష్టమైన వివరణ ఇచ్చారని ఆయన మద్దతు దారులు చెబుతున్నారు.ఆ కుటుంబానికి న్యాయం చేయడంలో తాను ఎప్పుడూ ముందుంటానని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కుటుంబం కన్నీళ్లు చూసి చలించిపోయి, ఆ కేసును సీబీఐకి అప్పగించేలా అప్పటి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చానని గుర్తు చేస్తున్నారు. అంతే కాకుండా, ప్రభుత్వం నుంచి బాధితులకు అందాల్సిన పరిహారం, భూమి, ఇళ్ల స్థలం తండ్రికి ఉద్యోగం దక్కాయని అంటున్నారు. జనసేన చేసిన పోరాటం వల్లే కుటుంబానికి ప్రభుత్వ పరంగా అందాల్సిన సౌకర్యాలు అన్నీ అందాయని చెబుతున్నారు. విచారణలో జరుగుతున్న జాప్యానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యం, సాక్ష్యాల తారుమారు కారణమని, బాధ్యతాయుతమైన నాయకుడిగా తాను దోషులు శిక్షించబడాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
2017లో కర్నూలు జిల్లాలోని ఒక ప్రైవేటు పాఠశాలలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది అత్యాచారం, హత్య అని ఆరోపిస్తూ తల్లిదండ్రులు పోరాటం మొదలుపెట్టగా, అప్పట్లో జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఆ కుటుంబానికి అండగా నిలిచి సుదీర్ఘంగా పోరాడారు. కాలక్రమేణా కేసు విచారణలో ఎదురవుతున్న అడ్డంకులు, మందగించిన విచారణ ఇప్పుడు మళ్లీ కొత్త వివాదానికి దారితీసింది. రాజకీయ నాయకుల హామీలు, బాధితుల ఆవేదనల మధ్య ఈ కేసు ఇప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్నది ఆసక్తికరంగా మారింది.
