‘‘మంచోడు మహేశ్’’ ఏలూరు ఎంపీకి తండ్రి సర్టిఫికెట్!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ కు ఆయన తండ్రి, ఏపీలోని కడప జిల్లా మైదకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ వెనకేసుకు వచ్చారు.
By: Tupaki Political Desk | 23 March 2026 4:28 PM ISTతెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ కు ఆయన తండ్రి, ఏపీలోని కడప జిల్లా మైదకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ వెనకేసుకు వచ్చారు. తన కుమారుడు చాలా మంచివాడని, ఎలాంటి దురాలవాట్లు లేవంటూ ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ క్లిన్ చిట్ ఇచ్చారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి నివేదించామని సుధాకర్ యాదవ్ వెల్లడించారు. డ్రగ్స్ కేసు వెలుగు చూసిన వారం రోజుల తర్వాత సుధాకర్ యాదవ్ తొలిసారిగా స్పందించారు. ఎంపీ మహేశ్ కుమార్ ను ఇరికించేలా కుట్ర జరిగిందన్న కోణంలో ఆయన మాట్లాడటం విస్తృత చర్చకు దారితీస్తోంది.
మొయినాబాద్ డ్రగ్స్ కేసు వివాదంపై ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏలూరు ఎంపీ, తన కుమారుడు మహేశ్ కుమార్ నిరపరాధి అంటూ ఆయన సర్టిఫికెట్ ఇచ్చారు. ఎంపీ మహేశ్ కుమార్ పై వస్తున్న ఆరోపణలను తాను ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఫాంహౌసులో జరిగిన పార్టీకి మహేశ్ కుమార్ వెళ్లడం నిజమేనని ఆయన అంగీకరించారు. అయితే తన కుమారుడికి ఎటువంటి చెడు అలవాట్లు లేవని, ముఖ్యంగా డ్రగ్స్ తీసుకునే అలవాటు అసలే లేదని తేల్చిచెప్పారు.
ఎంపీ మహేశ్ కుమార్ బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండానే పాజిటివ్ వచ్చిందని చెబుతున్నారని ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ ఆరోపించారు. తన కుమారుడు డ్రగ్స్ తీసుకున్నారని నిర్ధారించడంపై అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన వివరణను పార్టీ అధిష్టానానికి ఇప్పటికే సమర్పించామని ఆయన వెల్లడించారు. పోలీసు విచారణ ఇంకా కొనసాగుతుందని, దర్యాప్తు ముగిసిన తర్వాత అసలు వాస్తవాలు బయటకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తన కుమారుడు నిరపరాధి అన్న ఆధారాలను త్వరలో బయటపెడతామని ఎమ్మెల్యే తెలిపారు.
కాగా, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌసులో గతవారం డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో ఏలూరు ఎంపీ పుట్టా సుధాకర్ యాదవ్ అక్కడే ఉండటం తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత చర్చకు దారితీయగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీకి చెందిన ఎంపీ మహేశ్ కుమార్ పై సీరియస్ అయ్యారు. అయితే తొలుత యూరిన్ శాంపిల్స్ లో ఎంపీ మహేశ్ కుమార్ కి నెగిటివ్ వచ్చిందని పోలీసులు చెప్పడం, ఆ తర్వాత రక్తనమూనాలో పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించడంపై ఎంపీ అనుచరులు, అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఈ విషయంలో ఎంపీ తప్పు చేశారని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానానికి మహేశ్ యాదవ్ తన వివరణ ఇచ్చారని, దీనిపై అధిష్టానం నిర్ణయం ఇంకా వెలువడ లేదని అంటున్నారు.
