డిజిటల్ బాల్యం పై ఆందోళన: రాజ్యసభలో సుధామూర్తి కీలక వ్యాఖ్యలు
ఆధునిక సాంకేతికత విస్తరిస్తున్న నేపథ్యంలో మనమంతా ఇంటర్నెట్ యుగంలో ఉన్నాం...3జీ..4జీ...5జీ దాకా వచ్చేశాం. నెట్ ప్రభావం నుంచి పెద్దలూ పిల్లలూ తప్పించుకోలేని అనివార్య స్థితిలో పడిపోయాం.
By: Tupaki Political Desk | 6 Dec 2025 12:04 PM ISTఆధునిక సాంకేతికత విస్తరిస్తున్న నేపథ్యంలో మనమంతా ఇంటర్నెట్ యుగంలో ఉన్నాం...3జీ..4జీ...5జీ దాకా వచ్చేశాం. నెట్ ప్రభావం నుంచి పెద్దలూ పిల్లలూ తప్పించుకోలేని అనివార్య స్థితిలో పడిపోయాం. బడుల్లోనూ...గ్రౌండులోనే బాల్యాన్ని అందంగా మలచుకోవాల్సిన చిన్నారులు నిత్యం ఆన్ లైన్లో కాలం గడపడం నిజంగా దురదృష్టకరమంటూ రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి సభావేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి అర్దాంగిగా...కథారచయిత్రిగా, సమాజసేవకురాలిగా సుధామూర్తి కి సమాజంలో గుర్తింపు ఉంది. పిల్లల ఎదుగుదల, వారి అలవాట్లపై సుధామూర్తి రాజ్యసభలో తన గొంతుక వినిపించారు.
తలిదండ్రులు తమ పిల్లలు ఆన్ లైన్లో కాలం గడపడాన్ని ప్రివిలేజ్ గా భావిస్తున్నారని, దీర్ఘకాలంలో ఈ పోకడ పిల్లల మానసిక రుగ్మతలకు దారితీస్తుందని సుధామూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు సోషల్ మీడియా వాడకానికి సంబంధించి ప్రభుత్వం నియమనిబంధనల్ని రూపొందించి అమలు చేయాలని ఆమె కోరారు. రాజ్యసభ జీరో అవర్ లో ఎంపీ సుధామూర్తి ఈ విషయం లేవనెత్తారు. ఫ్రాన్స్ లాంటి అభివృద్ది దేశాలు పిల్లలు సోషల్ మీడియా, ఆన్ లైన్ వాడకం పై పలు నిబంధనలు అమలు చేస్తున్నట్లు సభ దృష్టికి తెచ్చారు. భారత దేశం కూడా ఈ విధానాన్ని అనునసరించాల్సిన సందర్బం వచ్చిందన్నారు.
పేరెంట్స్ పిల్లల ద్వారా వేల నుంచి మిలియన్ల వ్యూస్ పాలోవర్లను ఎలా రాబట్టుకోవాలా అని ఆలోచిస్తున్నారే తప్ప తమ పిల్లలు ఈ వ్యవహారంలో ఎలా బలి అవుతున్నారన్నది పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇపుడు చిన్నపిల్లల వీడియోలు తలిదండ్రులకు ఆదాయవనరులుగా మారిపోయాయి. ఈ క్రమంలో పిల్లలు బాల్యంలో ఉండే సున్నితత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. అలాగే సామాజిక నైపుణ్యాలు, ఆటలకు దూరంగా ఉండిపోతున్నారు. పొద్దస్తమానం వర్చువల్ జీవితానికి అలవాటు పడిపోతున్నారు...చదువుపై కూడా ధ్యాస ఉంచడం లేదని ఎంపీ సుధామూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే ప్రభుత్వం ప్రకటనలు, సినిమాల్లో పిల్లల్ని చూపించే విధానలపై కొన్నినిబంధనల్ని అమలు చేస్తోందని, అలాగే సోషల్ మీడియాకు సంబంధించి కఠినమైన విధానాలు అమలు చేసితీరాలని ఆమె డిమాండ్ చేశారు. ఇలా చేయకుంటే భవిష్యత్తులో పిల్లల పరిస్థితి దారుణంగా మారుతుందని అన్నారు. పిల్లల వస్త్ర ధారణపై కూడా ఆంక్షలు అవసరమని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
