హైవేపై వాహనాలు నడుపుతున్నారా.. ఇదొక్కసారి చదవండి!
హైవేలపై వాహనాలు రయ్ రయ్ మంటూ దూసుకుపోతుంటాయనే సంగతి తెలిసిందే. టోల్ వచ్చినప్పుడు తప్ప మరెక్కడా వాహనాన్ని స్లో చేయాల్సిన అవసరం లేదనే ధైర్యంతోనో, నమ్మకంతోనో వాహదారులు దూసుకుపోతుంటారు.
By: Garuda Media | 31 July 2025 3:29 PM ISTహైవేలపై వాహనాలు రయ్ రయ్ మంటూ దూసుకుపోతుంటాయనే సంగతి తెలిసిందే. టోల్ వచ్చినప్పుడు తప్ప మరెక్కడా వాహనాన్ని స్లో చేయాల్సిన అవసరం లేదనే ధైర్యంతోనో, నమ్మకంతోనో వాహదారులు దూసుకుపోతుంటారు. అదే నమ్మకంతో వారి వెనుక వచ్చేవారూ వస్తుంటారు. ఈ సమయంలో సడన్ గా బ్రేకు వేస్తే.. వెనుక వరుస ప్రమాదాలు జరుగుతాయి! ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇలాంటి ఓ సంఘటనపై ఆసక్తికర తీర్పు వెలువరించింది.
అవును... 2017లో తమిళనాడులో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మోటర్ సైకిల్ పై వెళ్తున్న ఓ వ్యక్తి ఎడమ కాలు కోల్పోయారు. ఆ పరిస్థితికి దారితీసిన నిర్లక్ష్యానికి పాల్పడిన కారు డ్రైవర్ ను ఉద్దేశించి.. హైవేలపై డ్రైవింగ్ చేసేవారు మధ్యలో ఆపాలని అనుకుంటే.. వెనుక ఉన్న వాహనాలకు హెచ్చరిక సిగ్నల్స్ ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా... భారీ పరిహారాన్ని చెల్లించాలని వెల్లడించింది!
వివరాళ్లోకి వెళ్తే... జనవరి 7, 2017న హక్కిం అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి మోటార్ సైకిల్ పై వెళుతున్నాడు. సరిగ్గా ఆ సమయంలో వారి ముందున్న కారు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో.. హక్కిం మోటార్ సైకిల్ కారును ఢీకొట్టి రోడ్డు కుడి వైపున పడిపోయింది. ఆ సమయంలో అతనిపై నుంచి ఒక బస్సు దూసుకెళ్లింది. దీంతో... చికిత్స సమయంలో వైద్యులు అతని ఎడమ కాలును తొలగించాల్సి వచ్చింది.
ఈ సమయంలో... అప్పీలుదారుడు కదులుతున్న కారును వెనుక నుండి ఢీకొట్టాడంటూ కారు బీమా సంస్థ తన వాదనను వినిపించింది.. అందువల్ల కారు డ్రైవర్ బాధ్యత వహించడని తెలిపింది. మరోవైపు.. తన భార్య గర్భవతి కావడంతో ఆమెకు వాంతులు వచ్చినట్లు అనిపించడంతో తాను అకస్మాత్తుగా బ్రేక్ లు వేసినట్లు కారు డ్రైవర్ తన సాక్ష్యంలో అంగీకరించాడు.
ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు... తమ అభిప్రాయం ప్రకారం అప్పీలుదారుడు ముందుకు కదులుతున్న వాహనం నుండి తగినంత దూరం నిర్వహించకపోవడం, చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా మోటార్ సైకిల్ ను నడపడంలో ఖచ్చితంగా నిర్లక్ష్యంగా వ్యవహరించాడని కనుగొనడం సరైనదేనని పేర్కొంది. అలాగే... ప్రమాదానికి ప్రధాన కారణం కారు డ్రైవర్ వేసిన సడన్ బ్రేకులు అని తెలిపింది.
ఇదే సమయంలో... హైవే మధ్యలో తన కారును అకస్మాత్తుగా ఆపినందుకు కారు డ్రైవర్ ఇచ్చిన వివరణ ఏ కోణం నుండి చూసినా సహేతుకమైంది కాదని.. హైవేలో వాహనాల అధిక వేగంతో వెళ్తాయని.. ఆ సమయంలో డ్రైవర్ తన వాహనాన్ని ఆపాలని అనుకుంటే, రోడ్డుపై వెనుక కదులుతున్న ఇతర వాహనాలకు సిగ్నల్ ఇవ్వాల్సిన బాధ్యత అతనిపై ఉందని తెలిపింది.
ఈ నేపథ్యంలో... మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (ఎంఏసీటీ) పరిహారాన్ని రూ.91.62 లక్షలుగా నిర్ణయించింది. అయితే... ఇందులో హక్కిం నిర్లక్ష్యాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆ పరిహారాన్ని 20% తగ్గిస్తూ... దానిని రూ.73.29 లక్షలకు ఫైనల్ చేసింది! ఇందులో కారు బీమా సంస్థ 50%, బస్సు బీమా సంస్థ 30% వరకు చెల్లించాలని తెలిపింది!
