Begin typing your search above and press return to search.

ఊచకోత... అంతరిక్షం నుంచి కనిపిస్తున్న శవాల కుప్పలు!

సూడాన్‌ లో మానవతా సంక్షోభం రోజు రోజుకీ అత్యంత తీవ్ర స్థాయికి చేరుకుంటుంది.

By:  Raja Ch   |   31 Oct 2025 1:00 AM IST
ఊచకోత... అంతరిక్షం నుంచి కనిపిస్తున్న  శవాల కుప్పలు!
X

సూడాన్‌ లో మానవతా సంక్షోభం రోజు రోజుకీ అత్యంత తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. ఈ విషయంలో ప్రపంచం కళ్ళు మూసుకున్నట్లు కనిపిస్తోంది. పారామిలిటరీ బృందం సుడానీస్ ప్రాంతీయ రాజధానిని స్వాధీనం చేసుకున్న తర్వాత రెండు రోజుల వ్యవధిలో రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్) ద్వారా సూడాన్ నగరమైన అల్ ఫషీర్‌ లో పదివేల మంది ప్రజలు మరణించారని విశ్లేషకులు భావిస్తున్నారు.

అవును... మిలిషియా రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్) స్వాధీనం చేసుకున్న నార్త్ డార్ఫర్‌ లోని అల్ షఫీర్ నగరంలో ఊహించని స్థాయిలో ప్రజలు హత్యలకు గురవుతున్నరనే విషయం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఈ క్రమంలో అక్కడ జరిగిన హత్యల పరిమాణం ఎంతగా ఉందంటే.. రక్తంతో పాటు మృతదేహాల కుప్ప అంతరిక్షం నుండి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు విడుదలై నెట్టింట వైరల్ గా మారాయి.

సూడాన్‌ లోని అల్ షఫీర్ లో జరిగిన ఊచకోత తర్వాత జరిగిన భయానక పరిణామాలను ఉపగ్రహ చిత్రాలు సంగ్రహించాయి. అక్కడ నేలపై ఎర్రటి మరకలు, (రక్తం అని చెబుతున్నారు!), మానవ శరీరాలను పోలి ఉండే సమూహాలు అంతరిక్షం నుండి కనిపిస్తున్నాయని యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కి సంబంధించిన హ్యుమానిటేరియన్ రీసెర్చ్ ల్యాబ్ (హెచ్ఆర్ఎల్) నివేదిక తెలిపింది.

అక్టోబర్ 27న ఏరోనాటిక్ కంపెనీ ఎయిర్‌ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ తీసిన ఈ చిత్రాలు.. ఉత్తర డార్ఫర్‌ లోని సూడాన్ సాయుధ దళాల చివరి బలమైన నగరాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ చేసిన సామూహిక హత్యలకు అనుగుణంగా ఉన్న ఆధారాలను వెల్లడిస్తున్నాయని చెబుతున్నారు. ఇక్కడ కనిపిస్తున్న కొలతలు మానవ శరీరాలకు సరిపోతాయని అంటున్నారు.

ఏమిటీ సూడాన్ అంతర్యుద్ధం!:

ఉత్తర ఆఫ్రికా దేశం సూడాన్‌ లో ఆర్మీకి, ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్సెస్‌ కు మధ్య రెండేళ్లుగా అంతర్యుద్ధం అవిరామంగా జరుగుతోంది! ఈ యుద్ధం ఏప్రిల్ 2023లో ప్రారంభమైంది. ఈ యుద్ధం వల్ల వేల మంది మరణించగా.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఈ దాడుల భయంతో సుమారు 1.3 కోట్ల మంది ప్రజలు దేశాన్ని విడిచి పారిపోయారు.

వాస్తవానికి సూడాన్ లోని అంతర్యుద్ధం 1983లోనే ప్రారంభమైంది. ఇది 2005 వరకూ జరిగింది. ఇది అంతిమంగా దక్షిణ సూడాన్ వేర్పాటుకు దారితీసింది. ఈ క్రమంలో గత రెండేళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధం భారీ మానవతా సంక్షోభానికి కారణమైంది.. దీని వల్ల ఇప్పటికే సుమారు రెండున్నర కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారని చెబుతున్నారు.