ఇండియాలో టీచర్ పై విద్యార్థి కాల్పులు.. టీచర్ పరిస్థితి ఎలా ఉందంటే?
ఇండియా.. ఉత్తరాఖండ్ లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని కాశీపూర్ లో ఒక విద్యార్థి హోంవర్క్ చేయలేదని గురువు మందలించడంతో.. ఆ విద్యార్థి చేసిన పని కలకలం సృష్టిస్తోంది.
By: Madhu Reddy | 22 Aug 2025 5:00 PM ISTఒకప్పుడు గురువుకి విద్యార్థులు ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గురువు వస్తున్నాడు అని తెలిసిన వెంటనే క్లాస్ రూమ్ లో ఎంతటి అల్లరి చేసేవారైనా ఇట్టే సైలెంట్ అయిపోయేవారు. కానీ కాలం మారే కొద్దీ పిల్లలను దండించాలంటే కూడా ఉపాధ్యాయులు భయపడే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఉపాధ్యాయులు అందరి ముందు దండిస్తున్నారని మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు కూడా ఉన్నారు. మరి కొంతమంది ఏకంగా టీచర్లపైనే దాడులు చేసి వారి ప్రాణాలకి ముప్పు తీసుకొస్తున్నారు. సరిగ్గా ఇండియాలో కూడా ఇదే ఘటన చోటు చేసుకుంది. ఒక టీచర్ పై విద్యార్థి నాటు తుపాకీతో కాల్పులు జరిపి.. అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఆ టీచర్ పరిస్థితి ఎలా ఉంది? అనే విషయం ఆందోళనకరంగా మారింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
టీచర్ పై కాల్పులు జరిపిన విద్యార్థి..
ఇండియా.. ఉత్తరాఖండ్ లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని కాశీపూర్ లో ఒక విద్యార్థి హోంవర్క్ చేయలేదని గురువు మందలించడంతో.. ఆ విద్యార్థి చేసిన పని కలకలం సృష్టిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. కాశీపూర్ లోని గురునానక్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి హోంవర్క్ చేయలేదట.. దీంతో ఆ విద్యార్థిని ఉపాధ్యాయుడు మందలించాడు. కక్ష పెట్టుకున్న విద్యార్థి అందరి ముందు తనను మందలించాడనే కారణంతో మరుసటి రోజు ఉపాధ్యాయుడి పై నాటు తుపాకీతో కాల్పులు జరపడం కలకలం రేకెత్తిస్తోంది.
జరిగిందేంటంటే?
పైగా ఒక విద్యార్థి నాటు తుపాకీతో స్కూల్ లోకి రావడం ఇక్కడ మరింత ప్రశ్నార్ధకంగా మారింది.. ఇక అసలేం జరిగింది? అంటే .. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రోజు టీచర్ గగన్ సింగ్.. విద్యార్థి హోంవర్క్ చేయలేదని మందలించారు.. దీంతో కోపంతో రగిలిపోయిన విద్యార్థి.. మరుసటి రోజు ఒక నాటు తుపాకీతో తిరిగి వచ్చి టీచర్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనతో తరగతి గదిలో భయాందోళనలకు దారితీసింది. సదరు విద్యార్థి చేసిన పనికి తోటి విద్యార్థులంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ కాల్పుల్లో టీచర్ గగన్ సింగ్ కి భుజంపై బుల్లెట్ గాయం అవ్వడంతో వెంటనే అప్రమత్తమైన స్కూలు యాజమాన్యం ఆయనను ప్రైవేటు హాస్పిటల్ కి తరలించారు.
టీచర్ పరిస్థితి ఎలా ఉందంటే?
చికిత్స అనంతరం ఆయన భుజం నుండి తుపాకిని తొలగించిన వైద్యులు కొద్ది రోజులు అబ్జర్వేషన్ లో ఉంచారు. ఇకపోతే అదృష్టవశాత్తు ఆయనకు ప్రాణాపాయం తప్పడంతో స్కూల్ యాజమాన్యం కూడా ఊపిరి పీల్చుకుంది.. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది. టీచర్ పై కాల్పులు జరిపిన విద్యార్థి అక్కడ నుండి పారిపోగా.. పోలీసులు అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ముఖ్యంగా విద్యార్థికి తుపాకీ ఎలా లభించింది ఇలాంటి తీవ్ర చర్యకు అతడిని ప్రేరేపించింది ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
భగ్గుమన్న నిరసనలు..
విషయం తెలియడంతో.. ఉధమ్ సింగ్ నగర్ అసోసియేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ స్కూల్స్ నిరసనను మొదలుపెట్టాయి. ఈ సంఘటనను ఖండిస్తూ.. నిందితుడి పై, అతడికి.తుపాకీ అందించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించాయి. విద్యార్థులలో పెరుగుతున్న ఆవేశం, అక్రమ ఆయుధాలు లభ్యత వంటి సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తోందని.. ముఖ్యంగా ఈ విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది అని వారు స్పష్టం చేశారు. ఇకపోతే త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని ఆ ప్రాంత ఎస్పీ అభయ్ సింగ్ స్పష్టం చేశారు.
