Begin typing your search above and press return to search.

"అమ్మా నాన్న లేరు.. మీరే నా దేవుడు సార్".. ఇంటర్ విద్యార్థి లేఖ వైరల్!

ఆన్సర్ షీట్‌లో ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సిన విద్యార్థి తన దీన స్థితిని వివరిస్తూ పాస్ చేయాలని వేడుకున్నాడు.

By:  Tupaki Political Desk   |   23 March 2026 8:00 PM IST
అమ్మా నాన్న లేరు.. మీరే నా దేవుడు సార్.. ఇంటర్ విద్యార్థి లేఖ వైరల్!
X

పరీక్షల సమయం వచ్చిందంటే విద్యార్థుల్లో ఒక రకమైన టెన్షన్ కనిపిస్తుంటుంది. బాగా చదివిన వారు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తే, సరిగా చదవని వారు పాస్ మార్కులు తెచ్చుకునేందుకు రకరకాల పాట్లు పడుతుంటారు. కొన్నిసార్లు విద్యార్థులు పడే పాట్లు ఫన్నీగా అనిపిస్తుంటాయి. తెలంగాణలో ఇంటర్ పరీక్ష రాసిన ఓ విద్యార్థి తనను పాస్ చేయాలని వేడుకోవడం అందరినీ నవ్విస్తోంది. ఆ పేపర్‌లో విద్యార్థి రాసిన లేఖ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. పాపం పాస్ కావడానికి ఆ విద్యార్థి ఎంత కష్టపడ్డాడో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఆన్సర్ షీట్‌లో ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సిన విద్యార్థి తన దీన స్థితిని వివరిస్తూ పాస్ చేయాలని వేడుకున్నాడు. "సార్, నాకు అమ్మా నాన్న లేరు. నేను చాలా కష్టపడి చదువుకున్నాను కానీ పరీక్షలో నేను చదివినవి ఏవీ రాలేదు. ఈ పరిస్థితిలో మీరే నాకు అమ్మా నాన్న. దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను.. ప్రస్తుతానికి మీరే నా దేవుడు సార్. నన్ను ఎలాగైనా పాస్ చేయండి," అంటూ వేడుకున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు విద్యార్థి పట్ల సానుభూతి చూపుతుండగా, మరికొందరు చదువుకు అడ్డదారులు ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.

కొందరు ఆ విద్యార్థి అనాథ అని తెలియడంతో చాలా బాధపడుతున్నారు. "ఎంతటి కష్టం వస్తే ఒక విద్యార్థి ఇలా రాస్తాడు?" అని సానుభూతి చూపుతున్నారు. ఇదే సమయంలో కొందరు నెటిజన్లు పాస్ కోసం ఇలాంటి లేఖల వల్ల ప్రయోజనం ఉండదు, పైగా మాల్ ప్రాక్టీస్ కింద ఇబ్బందులు ఎదురవుతాయి" అని సూచిస్తున్నారు. ఏదిఏమైనా ఈ ఘటన విద్యార్థుల్లో పెరుగుతున్న ఒత్తిడిని వెల్లడిస్తోందని అంటున్నారు. సరైన మార్గదర్శకత్వం లేని అనాధ విద్యార్థుల దీన స్థితిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

సాధారణంగా పరీక్ష పత్రాల్లో ఇలాంటి వ్యక్తిగత అభ్యర్థనలు, ఫోన్ నంబర్లు లేదా డబ్బులు పెట్టడం వంటివి చేస్తే వాటిని 'మాల్ ప్రాక్టీస్' గానే పరిగణిస్తారు. మూల్యాంకనం చేసే సిబ్బందికి మార్కులు వేసే అధికారం ఉండదు, కేవలం రాసిన సమాధానాలకే మార్కులు కేటాయించాల్సి ఉంటుంది. అయితే తెలంగాణకు చెందిన ఇంటర్ విద్యార్థి అభ్యర్థనగా వైరల్ అవుతున్న లేఖపై పూర్తి వివరాలు బయటపెట్టలేదు. విద్యార్థి పేరు, ఏ కళాశాల వంటి వివరాలను మూల్యాంకన సిబ్బంది వెల్లడించలేదు.