ఎంపీలు మాట్లాడరా.. మౌనం వెనుక రీజనేంటి.. ?
టీడీపీ ఎంపీలు అనగానే ఒకప్పుడు మంచి పవర్ ఫుల్ వాయిస్ వినిపించేవారు. రాష్ట్ర సమస్యలపైనే ఎక్కువగా ఫోకస్ చేసేవారు.
By: Garuda Media | 10 Jan 2026 8:00 AM ISTటీడీపీ ఎంపీలు అనగానే ఒకప్పుడు మంచి పవర్ ఫుల్ వాయిస్ వినిపించేవారు. రాష్ట్ర సమస్యలపైనే ఎక్కువగా ఫోకస్ చేసేవారు. గతంలో ఉన్నవారు.. వైసీపీని ఎక్కువగా టార్గెట్ చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. విజయవాడ ఎంపీగా అప్పట్లో ఉన్న కేశినేని నాని.. బలమైన వాయిస్ వినిపించారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు పట్టించుకునేవారు. ఇప్పుడు ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ ఎంపీగా ఉన్నారు. కానీ.. అన్న దూకుడుతో పోలిస్తే.. తమ్ముడు కొంత వెనుకబడ్డారన్న వాదన ఉంది.
ఇక, గుంటూరు ఎంపీగా గతంలో గల్లా జయదేవ్ పనిచేశారు. రాజధాని అమరావతి ఇష్యూ వివాదం అయినప్పుడు పార్లమెంటులో దుమ్మురేపే ప్రసంగం చేసి.. ఎంపీలను అమరావతిపై ఆలోచించేలా చేశారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్.. ప్రొటోకాల్‌కారణంగానో.. లేక మరేమో తెలియదు కానీ.. ఇంత బలమైన వాయిస్ వినిపించడంలేదు. అభివృద్ధి పనుల విషయంలో మాత్రం ముందున్నారు. కానీ, రాజకీయంగా కేవలం అభివృద్ధి మాత్రమే కాదు.. బలమైన వాయిస్ కూడా ఉండాలి.
ఇక, అమలాపురం ఎంపీగా గతంలో హర్షకుమార్ బలమైన నేతగాఎదిగారు. ఆయనకు గుర్తింపు వచ్చింది కూడా ఎంపీ అయిన తర్వాతే. ఆయన వాయిస్ అలా ఉండేది.ఆ ఆయన కాంగ్రెస్ వాదే అయినా.. ప్రస్తుతం ఉన్న యువ ఎంపీ గంటి హరీష్ మాథుర్ ఆ తరహాలో వాయిస్ వినపించలేక పోతున్నారు. పార్టీ ఏదైనా కీలకమైన అమలాపురంలో గుర్తింపు పొందాలంటే.. బలమైన వాయిస్ ఉండాలి. పనులు చేస్తున్నా.. వాయిస్ కూడా అంతే విధంగా వినిపించాల్సిన అవసరం యువ ఎంపీకి ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఇక, అన్నింటికంటే ముఖ్యం.. బాపట్ల. వైసీపీ హయాంలో బాపట్ల ఎంపీగా ఉన్న నందిగం సురేష్ నిరంతరం వార్తల్లో ఉండేవారు. రాజధాని కోసం రైతులు ఉద్యమించినప్పుడు.. వారికి ప్రతిగా తాను కూడా మూడు రాజధానులకు అనుకూలంగా ఉద్యమించారు. ఇది మంచా చెడా.. అనేది పక్కన పెడితే.. బలమైన నేతగా ఆయన ఎదిగారు. ఇప్పుడు తెన్నేటి కృష్ణప్రసాద్ ఉన్నా.. ఆయన అంత బలమైన వాయిస్ వినిపించలేక పోతున్నారు. రాజధాని రైతులు కొన్ని విషయాల్లో వెలిబుచ్చుతున్న సందేహాలను తీర్చేందుకు కూడాముందుకు రావడం లేదు. సో.. ఇప్పటికైనా ఎంపీలు మౌనం వీడి బలమైన వాయిస్ వినిపించే దిశగా అడుగులు వేయాల్సి ఉంది.
