Begin typing your search above and press return to search.

ఆపదలో దేవుడిలా.. అత్యాచార యత్నం నుంచి యువతిని కాపాడిన వీధికుక్కలు

తమిళనాడులోని కోయంబత్తూరులో తుడియలూర్ జాతీయ రహదారి రైల్వే వంతెన కింద చోటుచేసుకున్న ఈ ఉదంతం సమాజంలో తిరుగుతున్న కొందరు "మనుషులకంటే" వీధిలో తిరిగే "కుక్కలే" నయమని మరోసారి ఘంటాపథంగా చాటిచెప్పింది.

By:  A.N.Kumar   |   4 Sept 2026 10:41 PM IST
ఆపదలో దేవుడిలా.. అత్యాచార యత్నం నుంచి యువతిని కాపాడిన వీధికుక్కలు
X

తమిళనాడులోని కోయంబత్తూరులో తుడియలూర్ జాతీయ రహదారి రైల్వే వంతెన కింద చోటుచేసుకున్న ఈ ఉదంతం సమాజంలో తిరుగుతున్న కొందరు "మనుషులకంటే" వీధిలో తిరిగే "కుక్కలే" నయమని మరోసారి ఘంటాపథంగా చాటిచెప్పింది.

గురువారం తెల్లవారుజామున.. మానసిక వైకల్యంతో రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఒక అనాధ మహిళపై ఒక "సాటి మనిషి" కన్ను పడింది. పరిసరాల్లో ఎవరూ లేరని.. తను ఏం చేసినా అడిగే దిక్కు లేదని భావించిన ఆ 'సమాజ రత్నం', మద్యం మత్తులో ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఆ బాధితురాలు భయంతో సహాయం కోసం పెడబొబ్బలు పెట్టినా ఆ దారిన పోయే ఏ మనుషుల చెవులకూ ఆ అరుపులు వినపడలేదు. బహుశా వారంతా తమ 'సామాజిక బాధ్యత' అనే నిద్రలో జోగుతూ ఉండి ఉంటారు.

కానీ అక్కడే ఉండి ఈ దారుణాన్ని గమనించిన రెండు వీధికుక్కలకు మాత్రం ఐఏఎస్, ఐపీఎస్ డిగ్రీలు లేవు.. కేవలం మనుషుల కన్నా కాస్త ఎక్కువ మెదడు.. జాలి మాత్రమే ఉన్నాయి. వెంటనే రంగంలోకి దిగిన ఆ నాలుగు కాళ్ల రక్షకులు, గట్టిగా మొరుగుతూ నిందితుడిపైకి దూసుకెళ్లాయి. కేకలు వేసినా భయపడని ఆ మృగాడు, కుక్కలు దాడి చేసేసరికి తోకముడిచి ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు తీశాడు. అలా ఆ మూగజీవులు ఒక్కసారిగా "సింగం" రేంజ్ హీరోలుగా మారి ఆ మహిళను కాపాడాయి.

ఈ విజువల్స్ సీసీటీవీలో రికార్డై సోషల్ మీడియాలోకి రాగానే అలవాటు ప్రకారం నెటిజన్లు లైక్ లు, షేర్లు కొడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. "మనుషులు చచ్చిపోయారు, కుక్కలే నయం" అంటూ పెద్ద పెద్ద కోట్స్ రాసేస్తున్నారు. పోలీసులు కూడా ఎట్టకేలకు ఆ మద్యం బాబును అరెస్ట్ చేసి తమ 'విధి' నిర్వహించారు.

మనం నిత్యం "వీధికుక్కల బెడద ఎక్కువైంది. వాటిని ఊరి నుంచి తరిమేయాలి" అని మున్సిపాలిటీకి వినతిపత్రాలు ఇస్తుంటాం. కానీ అర్థరాత్రి వేళల్లో మహిళలకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలు, మనుషులు నిద్రపోతున్న వేళ... ఉచితంగా ఎటువంటి జీతం ఆశించకుండా సెక్యూరిటీ గార్డులుగా మారిన ఆ కుక్కలను చూసి సమాజం కాస్తయినా నేర్చుకోవాలి.

రోడ్డుపై బతికే అనాధ మహిళల భద్రత గాలికి వదిలేసి, ఘటన జరిగాక సోషల్ మీడియాలో సింపతీ కార్డ్‌లు ప్లే చేసే మనుషుల కంటే... అన్యాయాన్ని చూసి వెంటనే దాడికి దిగిన ఆ వీధికుక్కలే నూరుపాళ్ళు నయం.