మరో ఆరు నెలలు చమురు కష్టాలు.. పెంటగాన్ సంచలన నివేదిక
దీంతో మరో ఆరు నెలల వరకు చమురు సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు లేవనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
By: Tupaki Political Desk | 24 April 2026 12:00 AM ISTహర్మూజ్ జలసంధిలో ఇరాన్ అమర్చిన సీమైన్స్ వణుకు పుట్టిస్తున్నాయి. అమెరికా కాల్పుల విరమణతో ప్రస్తుతానికి పశ్చిమాసియాలో శాంతి నెలకొన్నా, యుద్ధ ప్రభావం మాత్రం ఇప్పట్లో ప్రపంచాన్ని వీడే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం హార్మూజ్ జలసంధిలో సీ మైన్స్ ను తొలగించడానికి మరో ఆరు నెలలు పట్టే అవకాశం ఉందని అంటున్నారు. సీమైన్స్ తొలగించడంపై ఇరాన్ చేతులెత్తేయడం, వాటిని తొలగించడం అమెరికాకు పెద్ద సవాల్ గా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో మరో ఆరు నెలల వరకు చమురు సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు లేవనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా ప్రతినిధుల సభలోని ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీకి అందిన సమాచారం ప్రకారం ఇరాన్ జీపీఎస్ టెక్నాలజీ సహాయంతో మైన్లను అమర్చిందని చెబుతున్నారు. ఇవి సముద్రంలో ఒకే చోట ఉండకుండా కదులుతూ ఉండటం వల్ల వాటిని గుర్తించడం అమెరికా నౌకాదళానికి కష్టంగా మారిందని చెబుతున్నారు. దీంతో ఈ మైన్లను క్లియర్ చేయకుండా నౌకలను అనుమతించడం ఆత్మహత్యాసదృశ్యమే అవుతుందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మైన్స్ 'క్లీనింగ్ ఆపరేషన్' పూర్తి కావడానికి సుమారు 180 రోజులు అంటే 6 నెలలు పడుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రతి రోజూ ప్రపంచ వినియోగిస్తున్న చమురులో ఐదో వంతు హర్మూజ్ జలసంధి గుండా రవాణా అవుతుంది. మైన్స్ తొలగించడంలో జరిగే జాప్యం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు కొరత ఏర్పడవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటేసింది. ఇది ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.
ఈ మైన్లను అమర్చిన ఇరాన్ కూడా ఇప్పుడు వాటిపై పూర్తి నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. కొన్ని మైన్లు సముద్ర ప్రవాహాలకు కొట్టుకుపోయి ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ప్రకటన ప్రకారం, అమెరికా తన ఆర్థిక దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు ఈ జలసంధి పునరుద్ధరణ సాధ్యం కాదని పరోక్షంగా హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో సముద్ర గర్భంలో దాగి ఉన్న నిశ్శబ్ద హంతకులు మాత్రం ప్రపంచ వాణిజ్యాన్ని గడగడలాడిస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికా తన అమ్ములపొదిలోని అధునాతన మైన్ స్వీపింగ్ సాంకేతికతను వాడినా, సాధారణ స్థితి రావడానికి కనీసం మరో అరేడు నెలలు వేచి చూడాల్సిందేనని విశ్లేషకులు చెబుతున్నారు.
