ఫ్లిప్‌కార్ట్ నుంచి ఫోన్‌పే వరకు... స్టార్టప్ మాఫియా సక్సెస్ స్టోరీ
ప్రపంచ కార్పొరేట్ రంగంలో వేగంగా ఎదుగుతున్న ఆసక్తికరమైన ధోరణి ‘స్టార్టప్ మాఫియా’.
By: A.N.Kumar | 5 April 2026 8:00 PM ISTప్రపంచ కార్పొరేట్ రంగంలో వేగంగా ఎదుగుతున్న ఆసక్తికరమైన ధోరణి ‘స్టార్టప్ మాఫియా’. పేరు వింటే అండర్‌వర్డ్ గ్యాంగ్‌లా అనిపించినా.. ఇది పూర్తిగా విభిన్నం. ఒకే సంస్థలో కలిసి పనిచేసిన ఉద్యోగులు, ఆ సంస్థను వదిలి తర్వాత తమ స్వంత స్టార్టప్స్‌ను ప్రారంభించి పరస్పరం సహకరించుకునే నెట్‌వర్క్‌కే ఈ పేరు. ఐడియాలే ఆయుధాలుగా నెట్‌వర్క్‌లే బలంగా ఇవి కార్పొరేట్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
భారతదేశంలో ఈ సంస్కృతికి బీజం వేసింది ఫ్లిప్‌కార్ట్. అమెజాన్‌లో పనిచేసిన సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ స్థాపించిన ఈ సంస్థ కేవలం ఈ-కామర్స్ దిగ్గజంగానే కాకుండా ‘స్టార్టప్ స్కూల్’గా మారింది. ఇక్కడ పనిచేసిన అనేక మంది ఉద్యోగులు తర్వాత మింత్రా, ఉడాన్, గ్రో వంటి ప్రముఖ సంస్థలను ప్రారంభించారు. ఫ్లిప్‌కార్ట్ పూర్వ ఉద్యోగులను ‘ఫ్లిప్‌స్టర్స్’గా పిలుస్తారు.
అలాగే పేటీఎం కూడా స్టార్టప్ మాఫియాలో కీలక పాత్ర పోషించింది. విజయ్ శేఖర్ శర్మ నేతృత్వంలోని ఈ సంస్థ నుంచి వచ్చిన మాజీ ఉద్యోగులు ఇండియాగోల్డ్, పాకెట్ ఎఫ్‌ఎం వంటి సంస్థలను స్థాపించారు. ఇదే ధోరణి ఓయో, ఓలా, జొమాటో, స్విగ్గీ వంటి కంపెనీల్లోనూ కనిపించింది. ఈ సంస్థల నుంచి వచ్చిన వందలాది మంది కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుట్టారు.
ఇటీవల కాలంలో ‘స్టార్టప్ మాఫియా 3.0’ మరింత వేగంగా విస్తరిస్తోంది. రేజర్‌పే, మీషో, క్రెడ్, ఫోన్‌పే వంటి సంస్థలు ఉద్యోగులను ఆంత్రప్రెన్యూర్లుగా తయారు చేసే ఫ్యాక్టరీలుగా మారాయి. ఓపెన్ కల్చర్, స్వేచ్ఛా ఆలోచనలు, విఫలతలను అంగీకరించే ధోరణి.. ఇవి ఈ సంస్థల ప్రధాన బలాలు. ఫలితంగా, ఉద్యోగులు తక్కువ కాలంలోనే తమ స్వంత సంస్థలను ప్రారంభిస్తున్నారు.
అమెరికాలో ఈ సంస్కృతి ‘పేపాల్ మాఫియా’తో మొదలైంది. పీటర్ థీల్, ఎలన్ మస్క్ వంటి ప్రముఖులు ఇందులో భాగమయ్యారు. వారి నుంచి ప్రేరణ పొందిన గూగుల్, ఫేస్‌బుక్, ఆపిల్ వంటి కంపెనీలూ తమ తమ మాఫియాలను నిర్మించుకున్నాయి.
స్టార్టప్ మాఫియా విజయానికి ప్రధాన కారణం పరస్పర సహకారం. మాజీ సహచరులు ఇన్వెస్టర్లు, మెంటర్లు, భాగస్వాములుగా మారి కొత్త వ్యాపారాలను ముందుకు తీసుకెళ్తారు. అయితే ప్రతి ప్రయాణం విజయవంతం అవుతుందనే గ్యారెంటీ లేదు. మార్కెట్ పోటీ, వ్యూహపరమైన తప్పిదాలు కొందరికి చేదు అనుభవాలనూ మిగులుస్తాయి.
అయినా సరే స్టార్టప్ మాఫియా సంస్కృతి యువతలో ఆంత్రప్రెన్యూర్షిప్‌కు కొత్త ఊపునిస్తోంది. ఉద్యోగం కంటే యజమాన్యం వైపు అడుగులు వేయాలనుకునే వారికి ఇది ప్రేరణగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఈ నెట్‌వర్క్‌లు మరింత విస్తరించి, కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం చేయడం ఖాయం.
