'స్టార్టర్ మ్యారేజ్' అంటే ఏంటి? భారత్‌లోనూ అదే ట్రెండ్ మొదలైందా?
"జీవితాంతం తోడుంటా.. నూరేళ్ల పంట ఈ బంధం" అంటూ డ్యూయెట్లు పాడుకునే రోజులు దాదాపు పోయినట్లే ఉన్నాయి.
By: A.N.Kumar | 14 July 2026 10:04 AM IST"జీవితాంతం తోడుంటా.. నూరేళ్ల పంట ఈ బంధం" అంటూ డ్యూయెట్లు పాడుకునే రోజులు దాదాపు పోయినట్లే ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్లోకి కొత్తగా 'స్టార్టర్ మ్యారేజ్' అనే కాన్సెప్ట్ వచ్చింది. కొత్తగా పెళ్లైన దంపతులు మొదట కొనుగోలు చేసే చిన్న ఇళ్లను 'స్టార్టర్ హౌస్' అని.. తర్వాత పెద్ద ఇంటికి మారతారని అంటుంటారు. సరిగ్గా ఇదే లాజిక్‌ను పెళ్లిళ్లకు కూడా అప్లై చేసేశారు మన జనాలు. ఐదేళ్లలోపు అందునా ఇంట్లో 'చిచ్చీ-బుచ్చీ' అని పిలిచే పిల్లలు పుట్టకముందే గుడ్‌బై చెప్పేసుకునే ఫస్ట్ మ్యారేజ్‌లను అమెరికన్ రచయిత్రి పమేలా పాల్ తన పుస్తకంలో 'స్టార్టర్ మ్యారేజ్' అని నామకరణం చేశారు.
పమేలా పాల్ అభిప్రాయం ప్రకారం.. నేటి యువత వివాహాన్ని ఎంతో గొప్పగా ఊహిస్తారు. వివాహ వేడుకలు, సెలబ్రిటీ పెళ్లిళ్లు, సినిమాలు, సోషల్ కల్చర్ కారణంగా పెళ్లిపై భారీ అంచనాలు పెంచుకుంటున్నారు. కానీ పెళ్లి తర్వాత ఎదురయ్యే బాధ్యతలు, రాజీలు, సహనం గురించి మాత్రం తగినంతగా ఆలోచించడం లేదని ఆమె అంటున్నారు. పెళ్లి ఏర్పాట్లకు నెలల తరబడి సమయం కేటాయించినా జీవితాంతం కొనసాగే బంధం కోసం అవసరమైన మానసిక సిద్ధత చాలా మందిలో కనిపించడం లేదని ఆమె విశ్లేషించారు.
అంతేకాదు విడాకులు పొందిన తల్లిదండ్రుల కుటుంబాల్లో పెరిగిన యువతకు ఆదర్శ దాంపత్య జీవితాన్ని చూసే అవకాశం తక్కువగా ఉండటం కూడా ఒక కారణమని పమేలా పాల్ అభిప్రాయపడుతున్నారు. సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించకుండా త్వరగా విడిపోవాలని నిర్ణయించుకునే ధోరణి పెరుగుతోందని ఆమె పేర్కొన్నారు.
విషయం ఏంటంటే.. ఈ అమెరికా ట్రెండ్ ఇప్పుడు మన దేశంలోని మెట్రో నగరాల్లో కూడా మెల్లగా అడుగుపెట్టింది. దీనికి సంబంధించి అధికారికంగా పెద్ద లెక్కలు, గణాంకాలు లేకపోయినా ఫ్యామిలీ కోర్టుల చుట్టూ తిరిగే లాయర్లు, కౌన్సెలర్ల డైరీలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
రీజన్స్ అనేకం.. రిలేషన్స్ క్షణికం
ఒకప్పుడు పెళ్లి అంటే 'ఏడేడు జన్మల బంధం'. కానీ ఇప్పుడది 'ఎన్ని నెలల గ్యారెంటీ?' అనే రేంజ్‌కు వచ్చేసింది. దీనికి కారణాలు లేకపోలేదు. సెలబ్రిటీల పెళ్లిళ్లు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసి పెళ్లి అంటే కేవలం డిజైనర్ లెహంగాలు, ప్రీ-వెడ్డింగ్ షూట్లు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ మాత్రమే అనుకుని బరిలోకి దిగుతున్నారు. తీరా పెళ్లయ్యాక వచ్చే బాధ్యతలు, సర్దుబాట్లు చూసి షాక్ తింటున్నారు. కెరీర్ ఒత్తిళ్లు, నైట్ షిఫ్ట్‌లు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండటంతో.. "నువ్వెంత అంటే నువ్వెంత" అనుకుంటున్నారు. ఈగోలు అడ్డురావడంతో సమస్యను సాల్వ్ చేసుకోవడం కంటే 'సెలవు' తీసుకోవడమే ఈజీ అనుకుంటున్నారు.
మొదటి పెళ్లిలో దెబ్బతిన్న యువత, రెండో పెళ్లి చేసుకునేటప్పుడు మాత్రం చాలా ప్రాక్టికల్‌గా.. మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నారట. అంటే మొదటి పెళ్లిని జస్ట్ ఒక 'ట్రయల్ రన్' లేదా 'ఇంటర్న్‌షిప్' లాగా భావిస్తున్నారన్నమాట
భారతదేశంలో ఈ ట్రెండ్ ఇంకా ఊపందుకోకపోయినా.. నగరాల్లో మాత్రం దీని చప్పుడు గట్టిగానే వినిపిస్తోంది. జీవితాంతం కలిసి ఉండే కమిట్‌మెంట్, ఓర్పు, ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం లేకపోతే.. పెళ్లి అనేది 'శుభలేఖ'తో మొదలై ఐదేళ్లలోపే 'కోర్టు నోటీసు'తో ముగిసిపోయే ఒక స్టార్టర్ ప్యాకేజీలా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు..
