అంటార్కిటికా నుంచి స్టార్ లింక్ తో లైవ్.. మస్క్ పప్పులో కాలేశారా..!
ఈ సందర్భంగా.. 49 సెకన్ల వీడియోను పోస్ట్ చేసిన యూజర్... స్టార్ లింక్ కారణంగా అంటార్కిటికాలోని లెజెండరీ మంచు గోడను మొదటిసారిగా ఓ వ్యక్తి ప్రత్యక్ష ప్రసార చేశాడని..
By: Raja Ch | 12 Feb 2026 11:20 AM ISTప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఉపగ్రహ ఆధారిత బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్.. స్టార్ లింక్ గురించి తెలిసిందే. ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా ధృవ ప్రాంతాలతో సహా ప్రపంచవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి రూపొందించబడింది. ఈ క్రమంలో తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుండగా.. అందులోని ఓ పొరపాటు సమాచారంతో మస్క్ పప్పులో కాలేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును... ప్రపంచ అంతరిక్ష రంగంలో స్పేస్ ఎక్స్ తో తనదైన ముద్ర వేస్తున్నారు ఎలాన్ మస్క్. ప్రధానంగా అంగారకుడిపై నివాసాలు అనే లాంగ్ లక్ష్యంపై పనిచేస్తూనే.. స్టార్ లింక్ పేరు చెప్పి వేల సంఖ్యలో ఉపగ్రహాలను అంతరిక్షంలో మొహరించి.. ఈ భూగ్రహంపై ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రదేశం ఉండకూడదన్నట్లుగా ముందుకు వెళ్తున్నారు. ఈ సమయంలో ఇంటర్నెట్ లో ఓ ఆసక్తికర వీడియో దర్శనమిచ్చింది. పైగా అది అంటార్కిటికాది అని చెప్పడంతో మరింత వైరల్ అయ్యింది.
ఈ సందర్భంగా.. 49 సెకన్ల వీడియోను పోస్ట్ చేసిన యూజర్... స్టార్ లింక్ కారణంగా అంటార్కిటికాలోని లెజెండరీ మంచు గోడను మొదటిసారిగా ఓ వ్యక్తి ప్రత్యక్ష ప్రసార చేశాడని.. స్ట్రీమింగ్ ఇండస్ట్రీలో స్టార్ లింక్ అనేది గేమ్ ఛేంజర్ అని.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు మనం ప్రదేశాలను చూడవచ్చని.. ఇదొక అద్భుతమని కొనియాడాడు. ఈ క్రమంలో ఈ వీడియో సుమారు 25 మిలియన్స్ పైగా వ్యూస్ సంపాదించుకుంది! ఈ సమయంలో ఎలాన్ మస్క్ స్పందించారు.
ఇందులో భాగంగా... స్టార్ లింక్ ఈ భుగ్రహంపై ఎక్కడైనా, వేగవంతమైన, సరసమైన కనెక్టివిటీని చాలామందికి ఇప్పటికీ తెలియదని అన్నారు. ఇదే సమయంలో... ఈ వీడియో స్టార్ లింక్ ను ఉపయోగించి అంటార్కిటికా నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయబడింది అని ఆ వీడియో కింద రాసుకొచ్చారు. కట్ చేస్తే... ఓ షాకింగ్ అప్ డేట్ ఆ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి నుంచి వచ్చింది! ఇందులో భాగంగా... ఇది అంటార్కిటా నుంచి వచ్చిన వీడియో కాదని తెలిసింది!
ఈ సందర్భంగా స్పందించిన అప్ లోడర్... ఈ స్ట్రీమింగ్ అంటార్కిటికా నుంచి కాదని.. ఇది దక్షిణ అమెరికాలోని పటగోనియా నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయబడిందని చెప్పారు! దీంతో.. హతఃవిధీ ఎంత పని జరిగిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి! వాస్తవానికి గతంలో స్పేస్ ఎక్స్ అంటార్కిటికాతో పాటు ఎన్నో మారుమూల ప్రదేశాల నుంచి స్టార్ లింక్ కనెక్టివిటీని ప్రదర్శించినప్పటికీ.. తాజాగా వైరల్ అవుతోన్న వీడియో మాత్రం అంటార్కిటికా నుంచి కాదని స్పష్టమవుతుంది!
